‘పది’ మూల్యాంకనం ప్రారంభం
* పర్యవేక్షించిన జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మిబాయి
* తొలిరోజు 14,500 పత్రాల మూల్యాంకనం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం శనివారం ప్రారంభమైంది. ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి పర్యవేక్షించారు. జూలైలో బదిలీ అయిన ఉపాధ్యాయులకు స్పాట్‌కు సంబంధించిన ఉత్తర్వులు గతంలో పనిచేసిన పాఠశాలలకు వెళ్లడంతో కొంత ఇబ్బందులు తలెత్తాయి. చివరికి విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయుల ప్రత్యేక చొరవతో ఉత్తర్వులు అందజేశారు. పంచవటి విద్యాలయంలో మూల్యాం కనం ఏర్పాటు చేశారు.
మొత్తం 5,87,289 జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు 20 మంది అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు, 200 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 1450 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 500 మంది స్పెషల్ అసిస్టెంట్‌లను నియమించారు. ఎసీఓలకు ప్రతి రోజూ రూ.260, సీఈలకు రూ.240, ఏఈలకు ఒక్కో పేపర్‌కు రూ.11ల చొప్పున, స్పెషల్ అసిస్టెంట్లకు ప్రతిరోజు రూ.150 చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. వీటితో పాటు ఏసీఓలకు, సీఈఓలకు, ఏఈలకు డీఏ రోజుకు రూ.300 చొప్పున అందజేయనున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడు పది నుంచి 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయగా తొలిరోజు 14,500 పూర్తయ్యాయి.
మూల్యాంకన కేంద్రాన్ని క్యాంపు అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మిబాయి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా జవాబుపత్రాలు మూల్యాంకనం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరుగకుండా మూల్యాంకనం చేయాలని సూచించారు. టీఎస్‌ఎస్‌ఓ పీఓ గోవిందరాజులు, డిప్యూటీ ఈఓలు మీరాజుల్లాఖాన్, రవీందర్‌గౌడ్ మూల్యాంకన కేంద్రంలో పర్యవేక్షించారు.