దేశ రాజకీయాల్లోనే పెను సంచలనం చోటు చేసుకుంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అదీ అవినీతి ఆరోపణల మీద ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం రాత్రి అరెస్టు చేసింది. తద్వారా పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారాయన. అయితే ఆయన అరెస్ట్ నేపథ్యంలో.. ఢిల్లీకి నెక్ట్స్ సీఎం ఎవరనే చర్చ సాధారణంగానే తెరపైకి వచ్చింది. ఆప్ మాత్రం మరో మాట చెబుతోంది.
‘‘అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పూర్తిగా రాజకీయ కుట్ర. ఢిల్లీకి కేజ్రీవాలే ముఖ్యమంత్రి. ఆయనే మా పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతారు. జైలుకు వెళ్లినా అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తారు. ఆప్ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు..’’ ఇది ఇప్పుడు ఆప్ కీలక నేతలు చెబుతున్న మాట.
ఇప్పుడే కాదు.. గత నవంబర్‌లో లిక్కర్ స్కాంలో తొలిసారి ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన అరెస్ట్ అవుతారనే ప్రచారం నడుస్తూ వచ్చింది. అయితే ఆ సమయంలోనూ ఆప్ ఒక్కటే ప్రకటన చేసింది. కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో రాజీనామా చేయబోరని.. అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లినా ఆయనే సీఎంగా పాలన కొనసాగిస్తారని. అంతేకాదు ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే గనుక రాజీనామా చేయాలా? లేదంటే సీఎంగా కొనసాగొచ్చా? అంటూ.. ‘మై బీ కేజ్రీవాల్’ పేరుతో ఈ జనవరిలో ఏకంగా ఓ పబ్లిక్ సర్వేను సైతం చేపట్టింది ఆప్. అయితే.. ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి ముఖ్యమంత్రి హోదాలో జైలు నుంచే పాలన నడిపించేందుకు వీలుందా?అందుకు భారత రాజ్యాంగం అనుమతిస్తుందా? చట్టాలు ఏం చెబుతున్నాయి?..
రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులు మాత్రమే రాజ్యాంగం పరిధిలోని పోస్టింగులు. చట్టం ప్రకారం.. వీళ్లకు మాత్రమే అరెస్ట్ నుంచి రక్షణ ఉంటుంది. వాళ్ల పదవీకాలం ముగియడం లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసేదాకా వాళ్లకు ఊరట లభిస్తుంది. అప్పటిదాకా ఆర్టికల్ 361 ప్రకారం వాళ్లకు కల్పించిన రక్షణ ప్రకారం.. న్యాయస్థానాలకు వాళ్లు జవాబుదారీలుకారు. అయితే.. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి లాంటి పదవులకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదు. అందుకే ఢిల్లీ హైకోర్టు సైతం కేజ్రీవాల్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు విముఖత వ్యక్తం చేసింది. అలాగని కేవలం అరెస్ట్ అయినంత మాత్రానా వాళ్లు(పీఎం, సీఎంలాంటి పదవుల్లో ఉన్నవాళ్లు) ఆ పదవులకు అనర్హులైపోరు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం కచ్చితంగా శిక్ష పడితేనే పదవుల్ని కోల్పోతారు.
కేజ్రీవాల్‌కు జైలుకెళ్తే..
తాజా పరిణామాల్ని పరిశీలిస్తే.. జైలు నుంచి కేజ్రీవాల్ ఢిల్లీని పాలించడాన్ని ఏ చట్టం అడ్డుకోదు. ఒకవేళ ఆయనకు శిక్ష పడితే మాత్రం అనర్హతకు గురవుతారు. ఇప్పటివరకైతే ఆయనకు శిక్ష పడలేదు. కాబట్టి ఆయన పాలన కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగని జైలు నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువైన పనీ కాదని కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకు జైలు అధికారులు ఆయనకు పలు సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు అక్కడి జైళ్ల శాఖ నిబంధనలపై స్పష్టత రావాల్సి ఉంది.
స్వచ్ఛందంగా రాజీనామాను మినహాయిస్తే ఒక ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోయేది అసెంబ్లీలో మెజారిటీని కోల్పోవడమో లేదంటే అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడం వల్లనో.
కేజ్రీవాల్‌కు కలిసొచ్చే మరో అంశం ఏంటంటే.. ఇప్పటి వరకు ఆప్ మంత్రులు ఇద్దరు మనీశ్ సిసోడియా , సత్యేందర్ జైన్ అరెస్టై జైలుకు వెళ్లారు. కానీ, కేజ్రీవాల్ కేవలం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. ఆయన వద్ద ఎలాంటి పోర్ట్‌ఫోలియో లేదు.
లెఫ్టినెంట్ గవర్నర్‌దే నిర్ణయం?
ప్రస్తుతం ఉన్న ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. అయితే.. ఢిల్లీ అధికార నిర్మాణం చాలా భిన్నంగా ఉంటుందన్నది తెలిసిందే. ప్రజలు ఎన్నుకునే ముఖ్యమంత్రి.. కేంద్రం ఎంపిక చేసే లెఫ్టినెంట్ గవర్నర్ పాలనలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా ఉన్నారు. ఆయనతో కేజ్రీవాల్ సర్కార్‌కు అంత సత్సంబంధాలు కూడా ఏం లేవు. దీంతో.. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా?.. ఎల్జీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
రాజధాని రీజియన్‌లోని ఢిల్లీకి మాత్రమే వర్తించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం.. కేజ్రీవాల్ జైలుకు వెళ్తే గనుక ఆయన్ని అధికారం నుంచి తొలగించమని ఎల్జీ రాష్ట్రపతిని కోరేందుకు అవకాశం లేకపోలేదు. ఒకవేళ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ జైలుకు గనుక వెళ్లాల్సి వస్తే.. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేయించొచ్చు. ఆర్టికల్ 239ఏబీ ప్రకారం ఎల్జీ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు. తద్వారా బలవంతంగా అయినా కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు రాష్ట్రపతి పాలన కింద ఢిల్లీ కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. రిమాండ్ పిటిషన్‌పై తీర్పు, బెయిల్ ఏదో ఒకటి వచ్చేదాకా ఎదురుచూసే అవకాశం లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment