మున్సి‘పోల్స్‌’ ఏర్పాట్లలో ఎస్‌ఈసీ | State Election Commission Started Work For Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సి‘పోల్స్‌’ ఏర్పాట్లలో ఎస్‌ఈసీ

Published Thu, Jan 2 2020 3:48 AM | Last Updated on Thu, Jan 2 2020 3:48 AM

State Election Commission Started Work For Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమై న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ)..ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ ఎన్నికల అధికారిగా మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ (డీఎంఏ)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన ఎస్‌ఈసీ.. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల (జీహెచ్‌ఎంసీ మినహా)లో ఎన్నికల నిర్వహణ విధులు, అధికారాలు సీడీఎంఏకు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. జిల్లా స్థాయిల్లో (హైదరాబాద్‌ మినహా) కలెక్టర్లను జిల్లా మున్సిపల్‌ ఎన్నికల అధికారులు గా నియమించారు. అన్ని కార్పొరేషన్ల (జీహెచ్‌ఎం సీ మినహా) కమిషనర్లను అదనపు జిల్లా అధికారులుగా, రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్లు/ సబ్‌ కలెక్టర్ల ను డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారులుగా, జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు (హైదరాబాద్‌ మినహా) అదనపు జిల్లా ఎన్నికల అధికారులుగా, అన్ని మున్సిపాలిటీల కమిషనర్లను సహాయ జిల్లా ఎన్నికల అధికారులుగా నియమిస్తూ ఆదేశాలిచ్చారు.

ఎన్నికల ప్రక్రియపై చర్యలు.. 
అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నమోదైన ఓట ర్ల జాబితాలకు అనుగుణంగా మున్సిపల్‌ ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు చేపట్టాల్సిన చర్య లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా జాబితాలు సిద్ధం చేసి ప్రచురించేందుకు అనుసరించాల్సిన విధానాలు, వార్డుల విభజన, ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్ల ఖరారు, ఫలితాల ప్రకటన వరకు అధికారులకు అవగాహన కల్పిస్తున్నారు. వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు, ప్రచురణ, రిటర్నింగ్, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల నియామకం, శిక్షణ, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్‌ పేపర్ల పంపిణీ, కౌంటింగ్, స్ట్రాంగ్‌రూంల గుర్తింపు, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, ఎన్నికల సామగ్రి సేకరణ వరకు వివిధ అంశాలపై దృష్టి నిలిపారు.

2019 జనవరి 1 ప్రాతిపదికగా.. 
ఈనెల 4న వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు ప్రచురించనున్నారు. వీటిని సిద్ధం చేసే అధికారం మున్సిపల్‌ కమిషనర్లకు కల్పించారు.  
►మున్సిపాలిటీలో వార్డుల వారీగా.. 2019 జనవరి 1ని ప్రాతిపదికగా తీసు కుని ఫొటో ఓటర్ల జాబితా లు సిద్ధం చేసుకోవాలి.
►ఇందులో ఓటర్‌ ఫొటో, పేరు, తండ్రి/తల్లి/భర్త పేరు, వయసు, లింగం, ఇంటి నంబర్, ఓటరు గుర్తింపు కార్డు నంబర్‌ ఉండేలా చూసుకోవాలి. 
►వార్డుల వారీగా మున్సిపల్‌ కమిషనర్లు ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ప్రచురించాలి.  
►ఓటర్ల జాబితాల్లో ఏ ఓటరు పేరు ఎదుటా వారి కులం, వర్గం, జాతి వివరాలు ఉండకూడదు.

పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుపై... 
పోలింగ్‌స్టేషన్ల గుర్తింపు, వాటి జాబితా ఇతరత్రా బాధ్యతలను మున్సిపల్‌ కమిషనర్లకు అప్పగించా రు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పో లింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదించిన భవనా లను మున్సిపాలిటీల రిటర్నింగ్‌ అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 13న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన పోలింగ్‌స్టేషన్ల వారీగా ఓటర్ల జాబితాలు (ఫొటోలు లేకుండా) ఎన్నికలు జరగనున్న సంబంధిత మున్సిపాలిటీలతో పాటు టీఎస్‌ఈసీ వెబ్‌పోర్టళ్లలో ప్రచురిస్తారు.

ఈ నెల 4న మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా పోలింగ్‌స్టేషన్ల ముసాయిదా జాబితా సిద్ధం చేసి 5న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 7న మున్సిపాలిటీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహి స్తారు. 8న సాయంత్రం 5 గంటల వరకు క్లెయిమ్స్, సలహాలు, అభ్యంతరాల స్వీకరణ.. 9న వాటి పరిష్కారం, అదేరోజు పోలింగ్‌స్టేషన్ల తుదిజాబితా జిల్లా కలెక్టర్లకు అందజేస్తారు. 10న తుదిజాబితాను ఖరారు చేస్తారు. 13న తుది జాబితా ప్రచురణ.. 14న అధికారిక ప్రకటన ఉంటుంది.

వారు పల్లె ప్రగతిలో పాల్గొనవద్దు: ఎస్‌ఈసీ 
జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు (హైదరాబాద్‌ మినహా), అదనపు జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న మున్సి పల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు (జీహెచ్‌ఎంసీ మినహా) గురువారం నుంచి జరగనున్న రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొనవద్దని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపీడీవోలు కూడా పాల్గొనకూడదని పేర్కొంది.

4 వరకు కామన్‌ సింబల్‌ దరఖాస్తులు... 
తమ వద్ద రిజిస్టరై, రిజర్వ్‌డ్‌ సింబళ్లు లేని ఏ పార్టీ అయినా కామన్‌ సింబల్‌ కేటాయింపు కోసం 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్‌ ఈసీ తెలిపింది. అయితే సదరు పార్టీ ఎన్నికలు జరగనున్న మొత్తం వార్డు స్థానాల్లో కనీసం పది శాతం సీట్లలో పోటీ చేయాలంది. ఎస్‌ఈసీ సెక్రటరీ పేరిట రూ.10 వేల డీడీని డిపాజిట్‌ చేయాలని తెలిపింది. ఒకవేళ పది శాతం మంది అభ్యర్థులను పోటీకి నిలపకపోతే కామన్‌ సింబల్‌తోపాటు డిపాజిట్‌ను కోల్పోతారంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement