సాక్షి, హైదరాబాద్: జంట నగరాల ప్రజలకు ఎన్నో దశాబ్దాలుగా తాగునీరు అందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. ఈ రెండు జలాశయాలు కూడా నిష్ప్రయోజనకరంగా మారాయని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు గురువారం హైకోర్టుకు నివేదించారు. ఈ జలాశయాల వల్ల తాగునీరు తగినంత అందడం లేదని, కృష్ణా జలాలనే తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తున్నామని ఆయన చెప్పారు.
ఈ జంట జలాశయాల పరిధిలో జీవో 111కు విరుద్ధంగా భారీ ఎత్తున వెలసిన అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టు ఎదుట ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటనపై పిటిషనర్ తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సమయంలో ఏఏజీ స్పందిస్తూ, జీవో 111పై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఓ కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని కోర్టును కోరారు.
ఇందుకు కోర్టు అంగీకరిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ నక్కా బాలయోగిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 111 జీవో పరిధిలో పెద్ద సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయని, వీటి విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. అలాగే జీవో 111 చట్టబద్ధతను సవాలు చేస్తూ కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏఏజీ వాదనలు వినిపిస్తూ జంట జలాశయాలు నిష్ప్రయోజనకరంగా మారాయని కోర్టుకు నివేదించారు.
Comments
Please login to add a commentAdd a comment