ఫిలింనగర్ రోడ్ నంబర్1లోని శ్రీరాజరాజేశ్వరీ దేవాలయం ఎదుట బిచ్చమెత్తుకుంటున్న కొండా రామారావు
ఆశ ఆవిరైంది.. అవకాశం చిక్కనంది.. జీవితం ఒంటరైంది.. ఫుట్‌పాతే దిక్కయింది.. బిచ్చమే బతుకయింది...అయినా ఆయనలో ఆత్మస్థైర్యం సన్నగిల్లలేదు. సినిమాలపై ఆసక్తి తగ్గలేదు. ఒక్క చాన్స్ దొరక్కపోతుందా? అనే ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. సినీ అవకాశం కోసం దాదాపు 55 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ఇప్పటికే 100 కథలు రాశాడు. ఇంకా రాస్తూనే ఉన్నాడు. 72 ఏళ్ల వృద్ధుడి వ్యధ ఇది. ఓ కథా రచయిత జీవిత కథ ఇది.
బంజారాహిల్స్: గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామానికి చెందిన కొండా రామారావుకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. తానూ వెండితెర మీద వెలిగిపోవాలని కలలు కనేవాడు. అదే ఆశతో 1964 ప్రాంతంలో మద్రాస్ రైలెక్కాడు. కానీ అవకాశాలు రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలిరావడంతో ఆయనా మకాం మార్చాడు. కనీసం చిన్న పాత్ర అయినా చేయాలని జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరాడు. కానీ విఫలమయ్యాడు. ఇక కథలు రాసుకొని రచయితగానైనా రాణించాలని కలం పట్టాడు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 100 కథలు రాశాడు. కానీ ఒక్కరూ ఆ కథలు వినలేదు.. అవకాశం ఇవ్వలేదు.
పనిమనిషిగా ప్రస్థానం...
ఎన్టీఆర్, ఏఎన్నార్, రావుగోపాల్‌రావు, కైకాల సత్యనారాయణ, రాజబాబులను తెరపై చూస్తూ తానూ అంతటివాడిని కావాలని రామారావు కలలు కన్నాడు. మద్రాస్ వెళ్లాక నాలుగైదు రోజులు పాండీబజార్ ఫుట్‌పాత్‌లపై కాలం వెళ్లదీశాడు. ఎన్టీఆర్ ఇల్లు జాడ తెలుసుకొని అక్కడ పని మనిషిగా చేరాడు. సమయం చూసి తన మనసులోని మాటను ఎన్టీఆర్‌కు చెప్పాలనుకున్నాడు. ఎన్టీఆర్ భార్య బసవతారకం ఓసారి మాటల సందర్భంలో రామారావు ఎందుకొచ్చాడో తెలుసుకొని... ‘సినిమాల్లో చేరాలంటే ఇళ్లల్లో కాదు పనిచేయాల్సింది. స్టూడియోల్లో అవకాశాలు వెతుక్కోవాల’ని సూచించి పంపించింది. అయితే రామారావుకు స్టూడియోల్లోనూ చుక్కెదురైంది. ఇక లాభం లేదని ఏఎన్నార్ ఇంటికి వెళ్లాడు. అక్కడో మూడు రోజులు పని చేసిన తర్వాత అవకాశాలు ఏమాత్రం దక్కవని అర్థమైంది. అప్పటి నటీనటులు జయలలిత, ఆర్.నాగేశ్వర్‌రావు, గీతాంజలి తదితరుల ఇళ్లలోనూ పనిచేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. సినిమాల్లో వేషాల కోసం సరిగ్గా దశాబ్ద కాలం తిరిగినా ఎక్కడా అవకాశం రాలేదు.
మద్రాస్ టు హైదరాబాద్
చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడంతో... రామారావు కూడా ఇందిరానగర్‌కు మకాం మార్చి జూనియర్ ఆర్టిస్ట్‌గా చేరాడు. చిన్న చిన్న వేషాలు వేస్తే కడుపుకింత తిండి దొరికేది తప్పితే.. సరైన అవకావం రాలేదు. ఈలోపు భార్య అంజమ్మ చనిపోవడం, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయి వెళ్లిపోవడంతో రామారావు జీవితం ఒంటరైంది. సినిమా అవకాశాల కోసం తిరగడానికి, కుటుంబ పోషణకు, పిల్లల పెళ్లిళ్లకు ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు అయిపోయాయి. ఇక ఫుట్‌పాతే ఆయనకు పూలపాన్పు అయింది. అదే ఆయన కథలకు వేదికయింది. తరచూ సినిమాలు చూస్తుంటే ఆ కథలపై వైరాగ్యం పుట్టుకొచ్చిందని, ఈ దిక్కుమాలిన కథలేంటంటూ నిర్వేదానికి గురై తానే ఫుట్‌పాత్‌పై కథలకు శ్రీకారం చుట్టానన్నాడు. అయితే వర్షం వచ్చినప్పుడల్లా రాసుకున్న కథలన్నీ తడిసిపోవడం జరిగిందన్నారు. 20 ఏళ్ల కాలంలో వందకు పైగా కథలు రాసి ఉంటానని చెప్పారు. సాంఘీకం, పౌరాణికం, చారిత్రాత్మకం, బయోపిక్స్ ఇలా ఏదైనా సరే అవలీలగా రాసే రామారావు... ఇప్పటికీ ఫిలింనగర్ శంకర్‌విలాస్ చౌరస్తాలోని ఓ బస్టాప్‌లో ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో కథలు రాస్తూ తన కోరిక నెరవేర్చుకుంటున్నాడు.
ఆనందం
నాకిప్పుడు ఏ బాధా లేదు. రాత్రి 12గంటల వరకు ప్రశాంతంగా కథలు రాసుకుంటాను. కథా రచనలోనే నాకెంతో ఆనందం ఉంటుంది. ఇవి సినిమా రూపంలో రాకపోయినా... నేను నా కోరికను ఇలా తీర్చుకుంటున్నాను. కథలు సినిమాలకు పనికిరాకపోయినా ఇలాగే రాస్తుంటాను. ప్రతిరోజు రెండు పత్రికలుచదువుతాను. ఆదివారమైతే నాలుగు కొంటాను.ఎప్పటికైనా ఎవరైనా దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించకపోతారా? అనే ఆశతో ఎదురుచూస్తున్నాను.
ఆకలి
ఆకలి తీర్చుకునేందుకు ఫిలింనగర్‌లోని రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద ప్రతిరోజు 3గంటల పాటుకూర్చుంటాను. ఆ సమయంలో కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. వాటిని పుస్తకంలో రాసుకుంటాను. రోజూ రూ.50 మాత్రమే చేతిలో పడ్డాక తిరిగి వెళ్తాను. అవి నా తిండికి సరిపోతాయి. అంతకన్నా ఎక్కువఅవసరం లేదు.
Comments
Please login to add a commentAdd a comment