పోట్ల గిత్తల వీధి పోరాటం
రంగారెడ్డి: పోట్ల గిత్తల వీధి పోరాటంతో స్థానికులు బెంబేలెత్తారు. ఈ సంఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. పట్టణంలోని శాంతినగర్ మార్గంలో సుమారు రెండు గంటలపాటు ‘బుల్‌పైట్’ కొనసాగింది. అప్పటి వరకు కలిసి తిరిగిన రెండు పోట్లగిత్తలు ఉన్నట్టుండి కుమ్మలాటకు దిగాయి. ఢీ అంటే ఢీ అన్నట్టు పోట్లగిత్తలు కుమ్ములాడుకున్నాయి. కాసేపు పక్కకు వెళ్లినట్టు చేస్తూ మళ్లీ మళ్లీ కయ్యానికి కాలుదువ్వాయి.
శాంతినగర్ మార్గంలో పోట్లగిత్తల పోరాటంతో వాహనదారులు, పాదచారులు హడలెత్తిపోయారు. కొందరు వాటిని విడగొట్టేందుకు రాళ్లు రువ్వారు. రాళ్లు రువ్విన వారిపైకి పోట్లగిత్తలు దూసుకువచ్చే ప్రయత్నం చేయడంతో జనాలు పరుగులు తీశారు. ఉదయం సుమారు 7.45 గంటల నుంచి 10 గంటల వరకు బుల్‌పైట్ కొనసాగింది. తరువాత అలసిపోయామనుకున్నాయో.. లేదా పోరాటం చాలనుకున్నాయో రెండు పోట్లగిత్తలు చేరో దారిలో వెళ్లిపోయాయి.
(తాండూరు)