తప్పు చేసి.. తప్పించుకోలేరు | Strengthening to Take Actions On Sadists Who Involves In Molestation Attacks | Sakshi
Sakshi News home page

తప్పు చేసి.. తప్పించుకోలేరు

Published Tue, Apr 23 2019 2:54 AM | Last Updated on Tue, Apr 23 2019 2:54 AM

Strengthening to Take Actions On Sadists Who Involves In Molestation Attacks - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితులు సకాలంలో పోలీసులను ఆశ్రయించినా.. శాస్త్రీయ ఆధారాలు సేకరించడంలో జరిగే జాప్యం వల్ల చాలాసార్లు నిందితులు తప్పించుకుంటున్నారు. నిందితుల పీచమణచడానికి తెలంగాణ పోలీసుశాఖ ఇకపై ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని నిర్ణయించింది. లైంగిక దాడి లేదా హత్యజరిగినపుడు ఘటనాస్థలం నుంచి సెమెన్, రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, తదితరాలను సేకరించి తక్షణమే విశ్లేషించి పకడ్బందీగా కేసు నమోదు చేసేందుకు ప్రత్యేకమైన మెడికల్‌ కిట్‌ను రూపొందించారు. దీనిపై ప్రభుత్వ వైద్యులకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. త్వరలోనే వీటిని రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు పంపనున్నారు. వీటి ఆధారంగా సేకరించిన శాంపిల్స్‌తో నేరనిరూపణ, నిందితులకు శిక్ష వంటివి వేగంగా అమలు జరిగి, బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. ఈ కిట్‌ను ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమం మొత్తం మహిళా రక్షణ విభాగ చీఫ్, ఐజీ స్వాతిలక్రా నేతృత్వంలో జరుగుతోంది. మొత్తం కార్యక్రమాన్ని ఎస్పీ సుమతి పర్యవేక్షిస్తున్నారు.

కార్పొరేట్‌ సదస్సు 27న
ఆఫీసుల్లో ఉద్యోగం చేసుకునే మహిళలకు ఎదురయ్యే వేధింపులపై అవగాహన కల్పించడానికి మహిళా రక్షణ విభాగం నిర్ణయించింది. ఈనెల 27న మాదాపూర్‌లో తెలంగాణ విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు పలు ప్రముఖ ఐటీ కంపెనీల ముఖ్యులు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పనిచేసే చోట మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, బెదిరింపులు వాటిని ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు.

గ్రామీణ ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు..
గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. నం 100కు డయల్‌ చేసి ఫిర్యాదు చేసినపుడు పోలీసులు వేగంగా స్పందించి, సమీపంలోని వారు 5 నిమిషాలలోపు సంఘటనా స్థలికి చేరుకునే విధంగా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. గృహహింస, వేధింపులు, లైంగిక దాడి ఘటన ఎలాంటిదైనా, నేర తీవ్రతతో సంబంధం లేకుండా.. అన్ని ఫిర్యాదులపై ఒకే రకంగా స్పందించేలా చర్యలు చేపట్టనున్నారు.

మహిళల రక్షణ మా భరోసా
తెలంగాణలో మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే మా ధ్యేయం. ముఖ్యంగా పలు రకాల దాడులకు గురైన కేసుల్లో బాధితుల నుంచి శాస్త్రీయ ఆధారాల సేకరణ ఇకపై పకడ్బందీగా ఉండనుంది. నేరస్తులకు వీలైనంత వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం.
– స్వాతి లక్రా ఐజీ,చీఫ్‌ విమెన్స్‌ సేఫ్టీ వింగ్‌

బాధితులకు వేగంగా న్యాయం
శాస్త్రీయ ఆధారాల సేకరణతోపాటు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వేధింపులు, దాడులపై అవగాహన కల్పిస్తున్నాం. దీని వల్ల నేర నియంత్రణ సాధ్యమవుతుంది.
– సుమతి, ఎస్పీ, విమెన్స్‌ సేఫ్టీ వింగ్‌

ప్రతీరోజు డీజీపీకి నివేదిక..
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను ఎప్పటికపుడు విమెన్‌ సేఫ్టీ వింగ్‌ పర్యవేక్షిస్తోంది. నేరాల దర్యాప్తు, నిందితులను కోర్టుకు పంపడం తదితర విషయాలన్నీ నిత్యం డీజీపీకి నివేదిక పంపుతున్నారు. ముఖ్యంగా ఫోక్సో కేసుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేయడంలో చాలా వరకు సఫలీకృతులవుతున్నారు.

త్వరలో స్కూళ్లు,కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ సదస్సుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులపై మహిళా ప్రజాప్రతినిధుల్లోనూ అవగాహన పెంచేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకు కూడా మహిళా పోలీసులు శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే వీటి తేదీలు ఖరారు చేస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement