యూని‘ఫామ్‌’లోకి రానివ్వరా? | Women Priority Less In Telangana Police Department Positions | Sakshi
Sakshi News home page

యూని‘ఫామ్‌’లోకి రానివ్వరా?

Published Tue, Dec 21 2021 3:08 AM | Last Updated on Tue, Dec 21 2021 6:00 PM

Women Priority Less In Telangana Police Department Positions - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆకాశంలో సగం, అర్ధాంగి.. మహిళల గురించి తరచూ చెప్పుకునే, వినే పదాలివి. రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం.. ప్రతీ రం గంలోనూ పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారు. ఉద్యోగాల్లోనూ ఉన్నత స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. కానీ తెలంగాణ పోలీస్‌ శాఖలో మాత్రం చాలామంది మహిళా అధికారులకు ప్రాధాన్యత లభించడం లేదని, శాంతి భద్రతల విభాగంలో అవకాశంతో పాటు ఫోకల్‌ (ప్రాధాన్యత కలిగిన) పోస్టులు దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొంతమంది ఎప్పుడో ఉద్యోగంలో చేరిన కొత్తలో శాంతి భద్రతల విభాగంలో డ్యూటీ చేశారంటే.. ఇప్పటివరకు మళ్లీ పోలీస్‌ యూనిఫామ్‌ వేసింది లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. నియామకాల్లో భాగంగా సివిల్‌ కేటగిరీలో 33% రిజర్వేషన్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌లో 10% రిజర్వేషన్‌ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్య భారీగా పెంచాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ మహిళా పోలీస్‌ అధికారులకు పోస్టింగుల విషయంలో మాత్రం న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది.  

నల్లగొండ, సూర్యాపేటల్లో మహిళా ఎస్‌ఐలే లేరు 
తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన నియామకాలతో మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే ట్రైనింగ్‌లో పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వర్తించడంతో పాటు ప్రొబేషన్‌ పూర్తయ్యే లోపు ఒక పోలీస్‌స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓగా పనిచేయాల్సి ఉం టుంది. ఈ నిబంధనలను సైతం పోలీస్‌ శాఖ పక్కన పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 60లోపు మాత్రమే మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబరాబాద్‌ పరిధిలోని మాదాపూర్‌ జోన్‌లో నలుగురు, బాలానగర్‌ జోన్‌లో ఇద్దరు మహిళా ఎస్‌ఐలు ఉండగా.. శంషా బాద్‌ జోన్‌లో ఒకే ఒక్కరు ఉన్నారు. రాచకొండ పరిధిలో ఎల్‌బీనగర్‌ జోన్‌లో ఇద్దరు ఉండగా.. మల్కా జ్‌గిరి జోన్‌లో ఒక్క మహిళా ఎస్‌ఐ కూడా లేకపోవడం గమనార్హం.

భువనగిరి జోన్‌లో ఒకే ఒక్కరు ఈ విభాగంలో ఉన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో సెంట్రల్‌ జోన్, ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్‌లో ఒక్కొక్కరు చొప్పున ఉండగా, వెస్ట్‌జోన్‌లో ఇద్దరు, నార్త్‌జోన్‌లో నలుగురు ఉన్నారు. నల్లగొండ, సూర్యా పేట జిల్లాల్లో ఒక్క మహిళా ఎస్‌ఐ కూడా లేరు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, సంగారెడ్డి, రామగుండం, మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కరు మాత్రమే ఉండగా ఖమ్మంలో ఎనిమిది మంది, మెదక్‌లో ఇద్దరు, వనపర్తిలో ముగ్గురు, జోగులాంబ గద్వాలలో ఆరుగురు, సిద్దిపేటలో ఇద్దరు, నిర్మల్‌లో ముగ్గురు మహిళా ఎస్‌ఐలు పనిచేస్తున్నారు.  

ఈ జిల్లాల్లో ఎక్కువమంది.. 
మహిళా ఎస్‌ఐలు శాంతి భద్రతల విభా గాల్లో పనిచేస్తున్న జిల్లాల్లో జగిత్యాల, ఆదిలాబాద్, వరంగల్‌ కమిషనరేట్లు టాప్‌లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 9 మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో 8 మంది, వరంగల్‌ కమిషనరేట్‌ లో 9 మంది మహిళా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు లా అండ్‌ ఆర్డర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1996 బ్యాచ్‌లో ఎస్‌ఐగా పోలీస్‌ శాఖలో అడుగుపెట్టిన అధికారుల నుంచి 2012 బ్యాచ్‌ వరకు మహిళా అధికారులు మొదట్లో ఒక రెండు పోలీస్‌స్టేషన్లలో లా అండ్‌ ఆర్డర్‌ విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కనీ సం మహిళా ఠాణాలో కూడా అవకాశం రాకపోవ డం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐడీ, ఏసీబీ, సీసీఎస్, డీసీఆర్‌బీ, ఐటీ కోర్‌టీం, షీటీమ్స్, సైబర్‌ క్రైమ్, కొన్ని చోట్ల ట్రాఫిక్‌ విభాగాల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారు.  

డీసీపీలు, అదనపు డీసీపీలదీ అదే పరిస్థితి 
గ్రూప్‌ వన్, ప్రమోషన్ల ద్వారా పోలీస్‌ శాఖలోకి అడుగుపెట్టిన మహిళా అధికారులదీ అదే పరిస్థితి కేవలం వరంగల్‌ మినహా ఎక్కడా కూడా శాంతి భద్రతల విభాగంలో మహిళా అధికారులకు పెద్దగా ప్రాధాన్యత దక్కింది లేదు. ట్రాఫిక్‌తో పాటు క్రైమ్, ఇతర విభాగాల్లో ఎస్పీ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిలోనూ అవకాశం లేకపోవడం అధికారులను ఆవేదనకు గురిచేస్తోంది. అదే విధంగా అదనపు డీసీపీ శాంతి భద్రతలు, ట్రాఫిక్, క్రైమ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా మహిళలకు అవకాశం కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌/ఇన్‌స్పెక్టర్, సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఏసీపీ/డీఎస్‌పీ స్థాయిలో మహిళా అధికారులకు ఫోకల్‌ పోస్టింగులు ఇవ్వాలని పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా.. రాజకీయ పలుకుబడితో జరిగే బదిలీల కారణంగా ఇది సాధ్యపడటం లేదనే ఆరోపణలున్నాయి.  

356లో ఇద్దరే ఇద్దరు
రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగంలో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌/ఇన్‌స్పెక్టర్‌(సీఐ) హోదా కల్గిన స్టేషన్‌ హౌస్‌అధికారి (ఎస్‌హెచ్‌ఓ) పోలీస్‌స్టేషన్లు 356 ఉన్నాయి. వీటిల్ల కేవలం ఇద్దరు మాత్రమే మహిళా ఇన్‌స్పెక్టర్లు (రాజన్న సిరిసిల్లా జిల్లా, మహబూబ్‌నగర్‌) మాత్రమే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీస్‌స్టేషన్లలోనూ పురుష అధికారులే ఎక్కువ ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. మహిళల వేధింపుల కేసులు, భార్యాభర్తల కేసులతో పాటు సంబంధిత కేసులను పర్యవేక్షించాల్సిన స్థానాల్లో పురుషులుండటం వివాదాస్పదంగా మారుతోంది.

మొత్తం 17 మహిళా పోలీస్‌స్టేషన్లు ఉండగా.. 13 చోట్ల పురుషులే ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని మూడు ఠాణాల్లో, సరూర్‌నగర్‌ ఠాణాలో మాత్రమే మహిళా ఇన్‌స్పెక్టర్లు విధులు నిర్వస్తున్నారు. కనీసం నూతన జిల్లాల్లో అయినా మహిళా ఠాణాలు ఏర్పాటు చేస్తే కాస్తో కూస్తో యూనిఫాం వేసుకొని డ్యూటీలు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అందని ద్రాక్షగా కమిషనర్‌ పోస్టు 
ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుతం తెలంగాణలో ఏ ఒక్క మహిళ ఐపీఎస్‌కూ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసే అవకాశం రాలేదు. అదనపు డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ హోదాల్లో ఐపీఎస్‌ అధికారులున్నా కమిషనర్‌గా మాత్రం అవకాశం దక్కడం లేదు. తమకు అవకాశం కల్పిస్తే సత్తా చాటుతామని మహిళా అధికారులంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement