ఆలంపల్లి, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా ప్రత్యేక బృందాలతో గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ అమ్రపాలి తెలిపారు. గురువారం ఆమె తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో ఫారెస్టు, ఎక్సైజ్, పీఆర్ అధికారులు, ఇతర శాఖల గెజిటెడ్ అధికారులను నియమిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి టీంలో పోలీసు, రెవెన్యూ ఎక్సైజ్ అధికారులతో పాటు ఓ వీడియోగ్రాఫర్ ఉంటారని, వారికి ప్రత్యేక వాహనం కేటాయించినట్లు ఆమ్రపాలి తెలిపారు.
తాండూరు, వికారాబాద్ అతి దగ్గరలో కర్ణాటక సరిహద్దు ఉంటడం కారణంగా జిల్లాకు మద్యం వచ్చే ప్రమాదం ఉందని, దీనిపై నిఘా వేయాలని అధికారులకు సూచించారు. వికారాబాద్ డీఎస్పీ నర్సింలు మాట్లాడుతూ.. ప్రవేటు వాహనాలే కాకుండా అంబులెన్సులు, పోలీసు వాహనాలను కూడా తనిఖీ చేస్తామన్నారు. రూ.40 వేలకు మించి నగదుకు తగిన వివరాలు లే కుంటే ఐటీకింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ‘మీ కోసం’ అనే సెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు.. సమస్యలు ఏమైనా ఉంటే ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం అందించవచ్చన్నారు. రాంగ్ కాల్స్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఆరు వాహనాలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నామని మర్పల్లి, మోమిన్‌పేట్, ధారూరు, బంట్వారం, వికారాబాద్‌లో ప్రత్యేకంగా నిఘా పెంచుతున్నామన్నారు. అనుమతులు లేకుండా వాహనాలకు బ్యానర్లు, పోస్టర్లు అంటిచరాదని సూచించారు. గ్రామాల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తాండూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరీష్, వికారాబాద్ సీఐ లచ్చిరాంనాయక్, ఎక్సైజ్ సీఐ సుధాకర్, గోపీనాథ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
మున్సి‘పోల్స్’కు గట్టి నిఘా
Published Thu, Mar 13 2014 11:24 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement