మెదక్: కాకతీయుల కోటగా.. నిజాం నవాబుల ఖిల్లాగా వినుతికెక్కిన మెదక్ సుభా మరో ఉద్యమానికి వేదికైంది. జిల్లా కేంద్రం కోసం 57ఏళ్లుగా పోరాటం చేస్తున్నా..తమకు న్యాయం జరగడం లేదంటూ మూడు రోజుల క్రితం మరోమారు పట్టణ ప్రజలు మహోద్యమానికి ఊపిరి పోశారు. ఇంకెన్నాళ్లు ఈ దగా..ఇకపై సహించేది లేదు, ప్రాణాలైన ఫణంగా పెడతాం..జిల్లా కేంద్రం సాధించి తీరుతాం అంటూ..నిరవధిక దీక్షలకు శ్రీకారం చుట్టారు. నిజాం కాలంలో మెదక్ పట్టణం నాలుగు జిల్లాలకు సుభాగా పరిపాలనా కేంద్రంగా విరాజిల్లింది. నేటి తెలంగాణ రాజధాని హైదరాబాద్ జిల్లా సైతం మెదక్ సుభాలోనే భాగమై ఉండేది.
కాని అధికారులు, పాలకుల స్వార్థంతో 1932లో జిల్లా కేంద్రాన్ని సంగారెడ్డి పట్టణానికి తరలించారు. నాటి నుంచి జిల్లా కేంద్రం కోసం పోరాటం జరుగుతూనే ఉంది. 1957లో సంఘ సేవకులు రాందాస్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ 43రోజుల పాటు దీక్షలు చేపట్టారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కళావెంకట్రావ్ ఇచ్చిన హామీ మేరకు దీక్ష విరమించారు. కానీ ఆ హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో 1976లో డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో మళ్లీ నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పటి మంత్రి బాగారెడ్డి బుజ్జగింపుతో దీక్షలు ఆగిపోయాయి. 1982లో తిరిగి మెదక్‌ను జిల్లా కేంద్రం చేయకుంటే ఎన్నికలను బహిష్కరిస్తామని పట్టణ ప్రజలు హెచ్చరించారు.
అప్పటి కేంద్ర మంత్రి శివశంకర్, బాగారెడ్డిలు మెదక్‌కి వచ్చి ఇందిరమ్మను గెలిపిస్తే ప్రధాన మంత్రి అవుతారని, అనంతరం మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది కూడా అమలుకు నోచుకోక పోవడంతో 2009లో రాంరెడ్డి కన్వీనర్‌గా మల్కాజి సత్యనారాయణ కార్యదర్శిగా జిల్లా కేంద్ర సాధన సమితి ఏర్పడింది. నాటి నుంచి పోరాటం కొనసాగుతూనే ఉంది. 2010లో 57 రోజుల పాటు రిలే దీక్షలు చేపట్టి, లక్ష సంతకాలు సేకరించి 14 డిసెంబర్ 2010న మెదక్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 23న అప్పటి ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కూడా వినతిపత్రం సమర్పించారు. అప్పటి నుంచి బైక్ ర్యాలీలు, జెండావిష్కరణలు, ప్రజాప్రతినిధుల తీర్మానాలు సేకరిస్తూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు.
సెప్టెంబర్ ప్రకటనతో అడియాశలు:
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ ఒక ప్రకటన వెలువడడంతో మెదక్ పట్టణ ప్రజల ఆశలు అడియాశలయ్యాయి. వెంటనే స్పందించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందన్న ప్రకటన వెలువడింది. అయినప్పటికీ మెదక్ ప్రజల్లో జిల్లా కేంద్రం ఏర్పాటుపై కమ్ముకున్న అనుమానపు నీడలు తొలగిపోలేదు.
నిరవధిక రిలేదీక్షలు ప్రారంభం:
మెదక్ జిల్లా కేంద్రం కోసం గురువారం పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో జిల్లా కేంద్ర సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరవధిక దీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు. ప్రజ సంఘాలు, మేధావులు ఉద్యమానికి మద్దతిస్తున్నారు.
జిల్లా కేంద్రం సాధించే వరకు పోరాటం
Published Sun, Oct 5 2014 1:29 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement