కంటిలోకి దూసుకొచ్చిన రాకెట్‌ | Student injured in Fire Crackers accident in Hyderabad | Sakshi
Sakshi News home page

కంటిలోకి దూసుకొచ్చిన రాకెట్‌

Published Sat, Oct 21 2017 2:48 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

Student injured in Fire Crackers accident in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అందరితోపాటే దీపావళి వేడుకల్లో పాల్గొంటున్న ఆ విద్యార్థినిపైకి ఒక్కసారిగా రాకెట్‌ దూసుకొచ్చింది. కనుగుడ్డుకు తగలడంతో తీవ్రంగా గాయపడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం సమీపంలోని గురునానక్‌ ఇంజనీరింగ్‌ విద్యా సంస్థ క్యాంపస్‌లో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్‌ మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ఎం. స్వప్న కళాశాల క్యాంపస్‌లో ఉంటూ బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. దీపావళి సందర్భంగా హాస్టల్లోని విద్యార్థులు బాణాసంచా కాలుస్తూ ఆనం దంగా క్యాంపస్‌ ఆవరణలో గడుపుతున్నారు.

అనుకోకుండా ఓ రాకెట్‌ విద్యార్థినుల వైపు దూసుకొచ్చి స్వప్న కుడి కంటికి తాకింది. కనుగుడ్డుకు తగలడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే స్పందించిన కళాశాల సిబ్బంది స్వప్నను స్థానికంగా ప్రథమ చికిత్స చేయించి.. నగరంలోని సరోజినీదేవి ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని కంటికి ఆపరేషన్‌ చేసిన వైద్యులు చూపుపై హామీ ఇవ్వలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కావాలనే రాకెట్‌ విద్యార్థినుల వైపు కాల్చారని కొందరు అనుమానిస్తున్నారు. మరోవైపు యాజమాన్య నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 700 మంది విద్యార్థులు దీపావళి వేడుకల్లో పాల్గొంటున్నప్పుడు సరైన చర్యలు తీసుకోలేదని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. కనీసం బాణాసంచా కాల్చేటప్పుడైనా జాగ్రత్తలు పాటించలేదని అంటున్నారు. ఇదిలా ఉండగా దీపావళి వేడుకల్లో పాల్గొన్న తనవైపు రాకెట్‌ దూసుకొచ్చిందని, నేరుగా కన్నును తాకిందని స్వప్న పేర్కొంది. ఒక్కసారిగా కంటి నుంచి రక్తం దారలా కారి ఏమీ కనిపించలేదని వివరించింది.

పండుగ వాతావరణం నెలకొల్పేందుకే..
కుటుంబ సభ్యులకు దూరంగా హాస్టల్‌లో వుంటూ చదువుకుంటున్న విద్యా ర్థులకు దీపావళి పండుగ వాతావరణం కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వ హించాం. ఇందులో భాగంగానే బాణా సంచా కాల్చేందుకు అనుమతిచ్చాం. దుర దృష్టవశాత్తు ఈ ఘటన చోటుచేసుకుంది. స్వప్నను వెంటనే అస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నాం.
                       – రాజేశ్‌ గోవిందన్,  హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement