అయ్యో.. దేవయ్యా!
టీడీపీ సీనియర్ నేత, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. పార్టీ మారాలని ఆయన కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. గతంలో టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నా.. దేవయ్య పెట్టిన షరతులను ఆ పార్టీ ఒప్పుకోలేదు. అప్పటినుంచి టీడీపీలోనే బలవంతంగా కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా తన చూపును కాంగ్రెస్ వైపు మళ్లించారు. అయితే చొప్పదండి అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం.. శుక్రవారం కాంగ్రెస్‌లో చేరడంతో దేవయ్యకు దారులన్నీ మూసుకుపోయినట్లయ్యింది.
కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం ఫలితంగా పార్టీ గాడి తప్పింది. పరిస్థితిని ముందే ఊహించిన దేవయ్య.. ఇక పార్టీ మారితేనే మేలని భావించారు. రెండేళ్ల క్రితమే కరీంనగర్‌లోని తన నివాసంలో తన అనుచరులతో సమావేశమై టీఆర్‌ఎస్‌లో చేరికపై చర్చించారు. ద్వితీయశ్రేణి నాయకులు అడ్డుచెప్పడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దేవయ్యను పార్టీలోకి తీసుకునేందుకు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ప్రయత్నించినా.. ఆయన సరిగ్గా స్పందించలేదు. ఈ క్రమంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం.. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ప్రచారం సాగడంతో దేవయ్య కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు.
కాంగ్రెస్‌నో.. టీఆర్‌ఎస్ నో..
ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, డెప్యూటీ మాజీ సీఎం దామోదర రాజనరసింహ, మాజీ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ మద్దతు కూడగట్టుకుని పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కాంతం ముహూర్తం పెట్టుకున్న విషయం తెలుసుకున్న దేవయ్య.. చొప్పదండి సీటు చేజారుతుందని హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఎంపీ పొన్నంతో కలిసి శ్రీధర్‌బాబు నివాసానికి చేరుకుని పార్టీలో చేరుతున్న విషయాన్ని వెల్లడించేందుకు రెండుగంటలపాటు వేచిచూసినట్లు సమాచారం.
అప్పటికే కాంతంకు అధిష్టానం లైన్‌క్లియర్ చేయడంతో ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టొద్దని శ్రీధర్‌బాబు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. గతంలో పలుమార్లు కోరినా.. సమాధానం చెప్పలేదని గుర్తుచేసినట్లు తెలిసింది. తన చేరిక విషయమై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని దేవయ్య కోరినా.. శ్రీధర్‌బాబు హామీ ఇవ్వలేదని సమాచారం. చివరకు శ్రీధర్‌బాబు వాహనంలోనే ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి బయల్దేరినా.. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని పేర్కొనడంతో మధ్యలోనే వాహనం దిగి వెనుదిరిగినట్లు తెలిసింది. దీంతో దేవయ్య పరిస్థితి అటు టీఆర్‌ఎస్‌కు కాకుండా.. ఇటు కాంగ్రెస్‌లో చేరకుండా రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.