suddala devaiah
-
బీజేపీలోకి మాజీ మంత్రి సుద్దాల దేవయ్య!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి సుద్దాల దేవయ్య బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. శుక్రవారం కరీంనగర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఆయన పార్టీలో చేరతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు నల్గొండ జిల్లా నుంచి మరో ఇద్దరు ముఖ్య నేతలు, మహబూబ్‌నగర్ నుంచి మరొక ముఖ్య నాయకుడు, పెద్దపల్లికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
నీళ్లిచ్చి మా పంటల్ని బతికించండి: రైతులు
సాక్షి, కరీంనగర్: రైతు శ్రేయస్సే తమకు ముఖ్యమని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం తమ పంటలు నీళ్లు లేక ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆందోళనబాట పట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల వద్ద జగిత్యాల-కరీంనగర్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఎల్లంపల్లి నీటిని ఎస్సారెస్పీ వరద కాలువకు విడుదల చేసి ఎండుతున్న పంటల్ని కాపాడాలని కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నా నిర్వహిస్తున్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సుద్దాల దేవయ్య, మేడిపల్లి సత్యం, గజ్జెల కాంతం తదితరుల్ని అరెస్టు చేశారు. రాస్తారోకో కారణంగా జగిత్యాల-కరీంనగర్ రూట్లో ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
సొంతగూటికి ‘సుద్దాల’?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సొంత గూటి వైపు కన్నేశారు. తిరిగి టీడీపీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారు. అధిష్టానం ఎప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే అప్పుడు వచ్చి వాలుతానన్నట్లుగా జిల్లాలోని పార్టీ ముఖ్యులతో ఇప్పటికే తన రాయబారం పంపించినట్లు తెలిసింది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన మహానాడు సమావేశాల సందర్భంగా ఈ విషయం పార్టీ శ్రేణుల్లో గుప్పుమంది. గతంలో మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుద్దాల దేవయ్య చంద్రబాబు హయాంలోమంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది... తెలంగాణ ఉద్యమం పోటెత్తిన సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు. తీరా... ఎన్నికల ముందు పార్టీని వదిలి కాంగ్రెస్‌లో చేరారు. చొప్పదండి నుంచి కాంగ్రెస్ టిక్కెట్టు తెచ్చుకొని పోటీకి దిగారు. టీఆర్ఎస్ ప్రత్యర్థి బొడిగె శోభపై దాదాపు 55 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దేవయ్య తన సొంత నియోజకవర్గంలో కేవలం 31,860 ఓట్లు సాధించారు. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఆయన కుమారుడు గౌతమ్ సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిపోయారు. రిజర్వుడు నియోజకవర్గం కావటం.. సొంత నియోజకవర్గం కావటం తనకు కలిసొచ్చినా.. ఓటమి చవిచూడటంతో దేవయ్య పునరాలోచనలో పడ్డారు. కాంగ్రెస్‌లో చేరటం వల్ల తనకు కలిసి వచ్చిందేమీ లేదని... అప్పటికే తన వెంట ఉన్న కేడర్ కేడర్ కూడా టీఆర్ఎస్లో చేరిందని.. దేవయ్య ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకున్నట్లుగా ఆయన సన్నిహితవర్గాల ద్వారా తెలిసింది. టీడీపీలో సీనియర్ నేతగా తనకు ఉన్న గుర్తింపు కాంగ్రెస్‌లో లేకపోవటంతోపాటు ఆ పార్టీ అధికారంలోకి రాకపోవటంతో.. అందులో ఉండీ ప్రయోజనమేమీ లేదని దేవయ్య నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు సీఎం కావటంతో గతంలో తనకున్న పరిచయాలు.. కనీస సంబంధాలు కొనసాగించేందుకు టీడీపీలో చేరడమే సరైందనే కోణంలో పావులు కదిపినట్లు సమాచారం. రెండు రోజుల మహానాడు సమావేశాలకు దేవయ్య తన కుమారుడు గౌతమ్‌ను పంపించటం.. తనవంతుగా తిరిగి పార్టీలో చేరే రాయబారం పంపినట్లు తెలిసింది. వరుసగా రెండు రోజులు గౌతమ్ మహానాడుకు హాజరవటంతో దేవయ్య పార్టీలో చేరే సంకేతాలు కూడా బలపడ్డాయి. -
సైకిల్ దిగిన సుద్దాల
జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి ప్రాతి నిథ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటిలో చేరారు. గురువారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీడీపీతో ఆయన మూడు దశాబ్దా ల అనుబంధం ముగిసినట్టైంది. చొప్పదండి నియోజకవర్గం లో ఆపార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గత ఐదు రోజులు గా ఢిల్లీలో మకాం వేసిన సుద్దాల కాంగ్రెస్ సీనియర్ నేతలతో చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేసుకుం టూ పార్టీలో చేరడానికి చర్చలు జరుపుతూ వచ్చారు. జిల్లా స్థాయి నేతల్లో ఎంపీ పొన్నం ప్రభాకర్ మాత్రమే సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖంగా ఉండగా, మరో కీలక నేత వ్యతిరేకించడంతో పదిహేను రోజులుగా సుద్దాల రాజకీయ జీవితం పై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా దేవయ్య హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కలిసినా ఫలితం లేకపోవడంతో ఢిల్లీ వెళ్లారు. ఎంపీ పొన్నంతో పాటు ఇతర నాయకులతో కలిసి కాంగ్రె స్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. సుదీర్ఘ మం తనాల అనంతరం సుద్దాలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ‘దేశం’ కోటకు బీటలు టీడీపీతో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న ఎమ్మెల్యే సుద్దాల కాంగ్రెస్‌లో చేరికతో చొప్పదండి నియోజకవర్గంలో టీడీపీకి గడ్డుకాలం దాపురించింది. టీడీపీ ఏర్పడిన అనంతరం ఏడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఆరు సార్లు గెల వడం గమనార్హం. కొద్ది రోజులుగా సుద్దాల కాంగ్రెస్ వైపు దృష్టి సారించి ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్న తరుణంలోనే, నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. టీడీపీలోని అనుచర గణమంతా టీఆర్ఎస్లో చేరగా, మిగిలిన కొద్ది మంది పార్టీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించారు. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులుగా జెడ్పీటీసీ, ఎం పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. టీడీపీలోని ముఖ్య అనుచరగణమంతా టీఆర్ఎస్ వైపు వెళ్లగా ప్రస్తుతం ఎమ్మెల్యే సుద్దా ల ఒంటరిగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఆయన వెంట తన కొడుకు గౌతంతో పాటు, మల్యాలకు చెందిన మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి ఒక్కరే ఉండడం గమనార్హం. -
అయ్యో.. దేవయ్యా!
టీడీపీ సీనియర్ నేత, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. పార్టీ మారాలని ఆయన కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. గతంలో టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నా.. దేవయ్య పెట్టిన షరతులను ఆ పార్టీ ఒప్పుకోలేదు. అప్పటినుంచి టీడీపీలోనే బలవంతంగా కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా తన చూపును కాంగ్రెస్ వైపు మళ్లించారు. అయితే చొప్పదండి అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం.. శుక్రవారం కాంగ్రెస్‌లో చేరడంతో దేవయ్యకు దారులన్నీ మూసుకుపోయినట్లయ్యింది. కరీంనగర్, న్యూస్‌లైన్ : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రెండు కళ్ల సిద్ధాంతం ఫలితంగా పార్టీ గాడి తప్పింది. పరిస్థితిని ముందే ఊహించిన దేవయ్య.. ఇక పార్టీ మారితేనే మేలని భావించారు. రెండేళ్ల క్రితమే కరీంనగర్‌లోని తన నివాసంలో తన అనుచరులతో సమావేశమై టీఆర్ఎస్లో చేరికపై చర్చించారు. ద్వితీయశ్రేణి నాయకులు అడ్డుచెప్పడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. దేవయ్యను పార్టీలోకి తీసుకునేందుకు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ ప్రయత్నించినా.. ఆయన సరిగ్గా స్పందించలేదు. ఈ క్రమంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం.. టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారని ప్రచారం సాగడంతో దేవయ్య కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారు. కాంగ్రెస్‌నో.. టీఆర్ఎస్ నో.. ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ గజ్జెల కాంతం ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, డెప్యూటీ మాజీ సీఎం దామోదర రాజనరసింహ, మాజీ మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ మద్దతు కూడగట్టుకుని పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు కాంతం ముహూర్తం పెట్టుకున్న విషయం తెలుసుకున్న దేవయ్య.. చొప్పదండి సీటు చేజారుతుందని హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఎంపీ పొన్నంతో కలిసి శ్రీధర్‌బాబు నివాసానికి చేరుకుని పార్టీలో చేరుతున్న విషయాన్ని వెల్లడించేందుకు రెండుగంటలపాటు వేచిచూసినట్లు సమాచారం. అప్పటికే కాంతంకు అధిష్టానం లైన్‌క్లియర్ చేయడంతో ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టొద్దని శ్రీధర్‌బాబు సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. గతంలో పలుమార్లు కోరినా.. సమాధానం చెప్పలేదని గుర్తుచేసినట్లు తెలిసింది. తన చేరిక విషయమై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని దేవయ్య కోరినా.. శ్రీధర్‌బాబు హామీ ఇవ్వలేదని సమాచారం. చివరకు శ్రీధర్‌బాబు వాహనంలోనే ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో కలిసి బయల్దేరినా.. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని పేర్కొనడంతో మధ్యలోనే వాహనం దిగి వెనుదిరిగినట్లు తెలిసింది. దీంతో దేవయ్య పరిస్థితి అటు టీఆర్ఎస్కు కాకుండా.. ఇటు కాంగ్రెస్‌లో చేరకుండా రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.