సైకిల్ దిగిన సుద్దాల
జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం నుంచి ప్రాతి నిథ్యం వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటిలో చేరారు. గురువారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో టీడీపీతో ఆయన మూడు దశాబ్దా ల అనుబంధం ముగిసినట్టైంది. చొప్పదండి నియోజకవర్గం లో ఆపార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
గత ఐదు రోజులు గా ఢిల్లీలో మకాం వేసిన సుద్దాల కాంగ్రెస్ సీనియర్ నేతలతో చొప్పదండి ఎమ్మెల్యే టికెట్ ఖాయం చేసుకుం టూ పార్టీలో చేరడానికి చర్చలు జరుపుతూ వచ్చారు. జిల్లా స్థాయి నేతల్లో ఎంపీ పొన్నం ప్రభాకర్ మాత్రమే సుద్దాల దేవయ్య కాంగ్రెస్‌లో చేరడానికి సుముఖంగా ఉండగా, మరో కీలక నేత వ్యతిరేకించడంతో పదిహేను రోజులుగా సుద్దాల రాజకీయ జీవితం పై సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. పట్టువదలని విక్రమార్కుడిలా దేవయ్య హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను కలిసినా ఫలితం లేకపోవడంతో ఢిల్లీ వెళ్లారు. ఎంపీ పొన్నంతో పాటు ఇతర నాయకులతో కలిసి కాంగ్రె స్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. సుదీర్ఘ మం తనాల అనంతరం సుద్దాలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
‘దేశం’ కోటకు బీటలు
టీడీపీతో మూడు దశాబ్దాల అనుబంధం ఉన్న ఎమ్మెల్యే సుద్దాల కాంగ్రెస్‌లో చేరికతో చొప్పదండి నియోజకవర్గంలో టీడీపీకి గడ్డుకాలం దాపురించింది. టీడీపీ ఏర్పడిన అనంతరం ఏడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ ఆరు సార్లు గెల వడం గమనార్హం. కొద్ది రోజులుగా సుద్దాల కాంగ్రెస్ వైపు దృష్టి సారించి ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్న తరుణంలోనే, నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు, వారి అనుచరులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. టీడీపీలోని అనుచర గణమంతా టీఆర్‌ఎస్‌లో చేరగా, మిగిలిన కొద్ది మంది పార్టీని వీడే ప్రసక్తి లేదని ప్రకటించారు.
పలు చోట్ల టీడీపీ అభ్యర్థులుగా జెడ్పీటీసీ, ఎం పీటీసీ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. టీడీపీలోని ముఖ్య అనుచరగణమంతా టీఆర్‌ఎస్ వైపు వెళ్లగా ప్రస్తుతం ఎమ్మెల్యే సుద్దా ల ఒంటరిగానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఆయన వెంట తన కొడుకు గౌతంతో పాటు, మల్యాలకు చెందిన మాజీ ఎంపీపీ రాంలింగారెడ్డి ఒక్కరే ఉండడం గమనార్హం.