
టీడీపీకి సుధీష్ రాంరాం
పార్టీకి, పదవికి రాంభొట్ల రాజీనామా
త్వరలో బీజేపీలో చేరే అవకాశం
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల ఆ పార్టీకి, తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆయన గత ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీలో కాంగ్రెస్ సంస్కృతి పెరిగిపోతోందన్నారు. ప్రజాబలం లేని, ప్రజా సమస్యల పట్ల అవగాహన లే ని నేతల పెత్తనం ఇప్పుడు తెలుగుదేశంలో ఎక్కువైందని, వారే అధినేత చుట్టూ చేరి ప్రజాబలం ఉన్న నేతలను పార్టీకి దూరం చేస్తున్నారని ఆరోపించారు. తమ వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగపడే వారిని పార్టీలో చేర్పిస్తున్నారని, గత కొద్ది రోజులుగా ఇదే జరుగుతోందని మండిపడ్డారు. టీడీపీ ఉపాధ్యక్షుడు, ఎంపీ సీఎం రమేష్ వంటి నేతల వల్ల పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
చంద్రబాబు చుట్టూ తొట్టిగ్యాంగ్ చేరిందని, వారి మాటే ఆయనకు వేదవాక్కుగా మారిందని పేర్కొన్నారు. తొట్టిగ్యాంగ్‌లోని సభ్యులు పార్టీ కోసం కష్టపడే వారిని కాకుండా తమ అడుగులకు మడుగులొత్తే వారిని పెంచి పోషిస్తున్నారని దుయ్యబట్టారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ అనుయాయులకు సీట్లు ఇప్పించుకోవడానికి వారు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన విషయంలో కూడా పార్టీ వైఖరి స్పష్టంగా లేదని రాంభొట్ల విమర్శించారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వారికి రక్షణ కల్పించాలని, హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తే.. తనను పార్టీ ద్రోహిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు. పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి ఉన్న బ్రాహ్మణ సామాజికవర్గానికి టీడీపీలో ప్రాధాన్యత లేకపోవటం పట్ల పలువురు నేతల వద్ద సుధీష్ ఆవేదన వ్యక్తంచేశారు. కాగా, రెండు మూడ్రోజుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ సమక్షంలో సుధీష్ ఆ పార్టీలో చేరతారని తెలుస్తోంది.