బోగీలు భగభగ | Summer Effect on Train Journey | Sakshi
Sakshi News home page

బోగీలు భగభగ

Published Thu, Jun 13 2019 7:44 AM | Last Updated on Mon, Jun 17 2019 1:18 PM

Summer Effect on Train Journey - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: వేసవి ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది.జనరల్, స్లీపర్‌ బోగీలు నిప్పుల కుంపట్లను తలపిస్తున్నాయి. వడగాలులు, ఉక్కుపోతలతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న  ఉష్ణోగ్రతలతో బోగీలు  భగ్గుమంటున్నాయి. దీంతో  ప్రయాణికులు  ఏసీ బోగీలపై ఆసక్తి చూపుతున్నారు. స్లీపర్‌ బోగీల్లో  కంటే  థర్డ్‌ ఏసీ బోగీల్లోనే  వెయింటింగ్‌ లిస్టు వందల్లో నమోదవుతోంది. అయితే ప్రయాణికుల డిమాండ్‌ మేరకు  అధికారులు అదనంగా  ఏసీ బోగీలను మాత్రం  ఏర్పాటు చేయడం లేదు. కొన్ని రైళ్లకు మాత్రం  అరకొరగా  అదనపు ఏసీ బోగీలను ఏర్పాటు చేసి  చేతులు దులుపేసుకున్నారు. ప్రయాణికుల  డిమాండ్‌ మేరకు  ఏసీ బోగీలు  అందుబాటులో లేకపోవడంతో  స్లీపర్‌ బోగీల్లోనే  ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ బోగీల్లో బయటి ఉష్ణోగ్రతల కంటే ఒకటి,. రెండు డిగ్రీలు ఎక్కువే ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి  న్యూఢిల్లీ, పట్నా, కోల్‌కత, విశాఖ, భువనేశ్వర్, ముంబయి, చెన్నై,  తదితర  దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే  ప్రయాణికులు స్లీపర్‌ బోగీల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా  మహిళలు, పిల్లలు, వయోధికుల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపతోంది. ఒకవైపు  బోగీల్లో వేడి, మరోవైపు  బయటి నుంచి వచ్చే వడగాలుల కారణంగా  అవస్థలు పడుతున్నారు.‘ ఏసీ బోగీల్లో  రిజర్వేషన్లు దొరకడం లేదు.  వెయిటింగ్‌ లిస్టు వందల్లోకి చేరిపోయింది. దీంతో  స్లీపర్‌ బోగీలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ బోగీల్లో  పైన ఫ్యాన్‌లు తిరిగినా అర్ధరాత్రి వరకు వేడిగాలులే  వీస్తున్నాయి. రైలెక్కాలంటేనే  భయమేస్తోందంటూ  ప్రయాణికులు ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. 

ఏసీలు అరకొర...
హైదరాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి మూడు వేల కిలోమీటర్లు రాకపోకలు సాగించే తెలంగాణ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–విశాఖ మధ్య నడిచే  గోదావరి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌ తదితర రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ బోగీలు 14  ఉండగా థర్డ్‌ ఏసీ బోగీలు 3 మాత్రమే ఉంటాయి. సెకెండ్‌ ఏసీ  2 బోగీలు మాత్రమే ఉంటాయి. దీంతో ఎక్కువ మంది  స్లీపర్‌ పైనే ఆధారపడుతారు. ప్రయాణ చార్జీల విషయంలో  థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ మధ్య వ్యత్యాసం తక్కువగానే ఉంటుంది. అన్ని వేళల్లో కాకపోయినా  వేసవి కాలంలోనైనా  స్లీపర్‌ బోగీలను కొన్నింటిని తగ్గించి  థర్డ్‌ ఏసీ బోగీలను పెంచితే  ప్రయాణికులకు ఎంతో ఊరట లభిస్తుంది. మరోవైపు  ఇటీవల కాలంలో చాలామంది  ప్రయాణికులు స్లీపర్‌ కంటే ఏసీ బోగీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. 24 గంటలకు పైగా స్లీపర్, జనరల్‌ బోగీల్లో  ప్రయాణం చేసే దూరప్రాంత రైళ్లలో  వేడిగాలుల  కారణంగా ప్రయాణికులు తరచూ వడదెబ్బకు గురవుతూ డీహైడ్రేషన్‌ బారిన పడుతున్నారు. ప్రయాణికుల డిమాండ్, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బోగీ సదుపాయాల్లో మార్పులు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ఏడాది వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని  దక్షిణమధ్య రైల్వే వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కానీ అన్నింటిలోనూ  ఏసీ బోగీలు పరిమితంగానే ఉన్నాయి.  

ఐదింటికే పరిమితం...
వేసవి ఉష్ణోగ్రతలు, ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని కేవలం 5 రైళ్లలో మాత్రమే థర్డ్‌ ఏసీ బోగీలను ఏర్పాటు చేశారు. తిరుపతి–లింగంపల్లి మధ్య నడిచే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–గూడూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–ముంబై మధ్య నడిచే దేవగిరి ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి,.లింగంపల్లి–కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో మాత్రం థర్డ్‌ ఏసీ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. కానీ సికింద్రాబాద్‌ నుంచి పట్నాకు రాకపోకలు సాగించే  పట్నా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌–న్యూదిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్, ధానాపూర్, గోదావరి తదితర రైళ్లకు ప్రయాణికుల డిమాండ్‌ ఎక్కువగా ఉన్నా ఏసీ బోగీలను పెంచకపోవడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement