తన భార్య సునందది హత్య అంటూ ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేయడంపై దిగ్భ్రాంతికి గురయ్యానని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మంగళవారం వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ/తిరువనంతపురం: తన భార్య సునందది హత్య అంటూ ఢిల్లీ పోలీసులు కేసు రిజిస్టర్ చేయడంపై దిగ్భ్రాంతికి గురయ్యానని కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలతో ఈ నిర్ధారణకు వచ్చారనే సమాచారం కావాలని దర్యాప్తు అధికారులను కోరారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికల కాపీలను ఇవ్పటివరకు తనకు ఇవ్వలేదని, ఇప్పుడైనా వాటిని తక్షణమే తనకందించాలని పోలీసులను అభ్యర్థించారు. ‘నా భార్య సునంద మృతిపై నాకెలాంటి అనుమానాలు లేవు. అయినా, ఎలాంటి ముసుగులు లేని నికార్సైన నిజం వెల్లడయ్యేలా సమగ్ర దర్యాప్తు జరగాలి. అందుకు కేసు దర్యాప్తులో పోలీసులకు పూర్తిగా సహకరిస్తాను’ అని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అంశంపై ఇంకా ఎవరేమన్నారంటే..
దోషులను త్వరగా శిక్షించాలి
‘సునంద మృతిపై హత్య కేసు నమోదు చేయడంతో గందరగోళానికి తెరపడింది. దర్యాప్తు త్వరగా ముగిసి దోషులకు శిక్ష పడాలి’
- బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు
హత్యో, ఆత్మహత్యో ఇంకా తేలలేదు
‘చనిపోయిన ఏడాది తర్వాత హత్యకేసు నమోదు చేయడం అనుమానాలకు తావిస్తోంది. హత్యో లేక ఆత్మహత్యో ఇంకా నిర్ధారణ కాలేదు. దర్యాప్తు ప్రక్రియలో ఇది ప్రారంభం మాత్రమే. ముగింపు కాదు. దీన్ని సంచలనాత్మకం చేయాల్సిన అవసరం లేదు’
- కాంగ్రెస్ పతినిధి అభిషేక్ సింఘ్వీ
థరూర్ రాజీనామా చేయాలి: కేరళ ప్రతిపక్షం
సునందది హత్యేనని పోలీసులు తేల్చిన నేపథ్యంలో తన లోక్‌సభ సభ్యత్వానికి శశిథరూర్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం, బీజేపీలు డిమాండ్ చేశాయి. థరూర్‌ను రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశించాలి. 2014 ఎన్నికల్లో ఆయనను పోటీలో నిలిపినందుకు ఆ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని సీపీఎం సీనియర్ నేత, కేరళ ప్రతిపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు. బీజేపీ కేరళ రాష్ట్ర శాఖ కూడా థరూర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.