
అనాథలకు అండ
‘నోటు’కాడి కూడూ రద్దు’అనే శీర్షికతో బుధవారం ‘సాక్షి’దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అనూహ్య స్పందన లభించింది.
- ‘నోటు’కాడి కూడూ రద్దు కథనంపై స్పందించిన సర్వ్ నీడీ స్వచ్ఛంద సంస్థ
- రోజూ 200 మందికి మేం భోజనం పెడతాం
- చౌటుప్పల్ అమ్మానాన్న అనాథాశ్రమానికి దాతల చేయూత
- అన్నపూర్ణ పథకం పునరుద్ధరించేందుకు సన్నద్ధం
చౌటుప్పల్: ‘నోటు’కాడి కూడూ రద్దు’అనే శీర్షికతో బుధవారం ‘సాక్షి’దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి అనూహ్య స్పందన లభించింది. అర్ధాకలితో అలమటిస్తున్న అనాథల కడుపు నింపేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. సగం కడుపుతో కాలం వెళ్లదీస్తున్న విధివంచితులకు అండగా నిలిచేందుకు సికింద్రాబాద్‌లోని కార్ఖానా ప్రాంతానికి చెందిన సర్వ్ నీడీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ముందుకొచ్చారు. నోట్ల రద్దు ప్రభావంతో తలెత్తిన ఇబ్బందులను తొలగించి ఆశ్రమంలో ఉన్న ప్రతిఒక్కరికీ కడుపునిండా భోజనం పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తామన్నారు.
సాక్షి ప్రచురించిన కథనానికి చలించిపోయిన వారు వెంటనే స్పందించి ఆశ్రమ వివరాలను తెలుసుకున్నారు. ఆశ్రమంలో ఉన్న అనాథలందరికీ అవసరమైన పండ్లు, స్వీట్లు, దుస్తులు, భోజనం తీసుకువచ్చారు. స్వయంగా అనాథలకు అందజేశారు. ఇక నుండి ఇక్కడి అనాథలు అర్ధాకలితో అలమటించే పరిస్థితులు రాకుండా ఉండేందుకు చేయూత అందిస్తామని సర్వ్ నీడీ సంస్థ నిర్వాహకులైన సి.వెంకటరమణా రెడ్డి కుటుంబం హామీ ఇచ్చింది. 200 మందికి తగ్గకుండా ప్రతిరోజూ ఒకపూట భోజన వసతి కల్పిస్తామని వారు పేర్కొన్నారు. అవసరమైతే ఇక్కడ ఉన్న అనాథలందరికీ భోజనాన్ని సమకూర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి స్పష్టత ఇస్తామని చెప్పారు.
సూర్యాపేట దాత బియ్యం అందజేత
సాక్షి కథనానికి సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఒక దాత చలించిపోయాడు. తన వంతుగా చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చాడు. 100 కిలోల బియ్యాన్ని వాహనంలో ఆశ్రమానికి పంపించి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. ఆయన తన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.
పునరుద్ధరణ దిశగా అన్నపూర్ణ
సాక్షి కథనంతో అధికారులు స్పందించారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్, జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు సాక్షి క«థనాన్ని చదివి వెంటనే సివిల్ సప్లయ్ రాష్ట్ర కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టికి తీసుకువెళ్లారు. అనాథ ఆశ్రమంలోని 237 మంది అనాథలకు గతంలో అన్నపూర్ణ పథకం ద్వారా బియ్యం అందిన విషయాన్ని తెలిపారు. జిల్లాల విభజన తర్వాత బియ్యం సరఫరా నిలిచిపోయిన పరిస్థితిని కమిషనర్ వివరించారు. దీంతో స్పందించిన కమిషనర్ సీవీ ఆనంద్ అమ్మానాన్న అనాథ ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్ వచ్చి తన కార్యాలయంలో కలవాలని చెప్పారు. బియ్యం పథకం పునరుద్ధరించేందుకు నిర్ణయించారు.