కరీంనగర్ ఎడ్యుకేషన్: ‘అధికారులకు దయ్యం పట్టింది’ పేరిట గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్త అధికారుల్లో అలజడి రేపింది. జిల్లా విద్యాశాఖ, రెవెన్యూ శాఖల అధికారులు ఈ వార్తతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్వీట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీకి తాము ఇచ్చిన ప్రొసీడింగ్స్‌లో ఏమున్నాయో అనే అంశంపై గురువారం జిల్లా రెవెన్యూ అధికారి వీరబ్రహ్మయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి కె.లింగయ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబంధిత ఫైళ్లను తెప్పించుకుని పరిశీలించడంతోపాటు వీటికి అనుమతి ఎలా ఇచ్చామనే అంశంపై ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు.
దీంతోపాటు స్వీట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ ఎవరిది.. ఆ సంఘం తొలుత ఎవరికి దరఖాస్తు చేసుకుందనే అంశాలను ఆరా తీయగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి ఈ ఏడాది మే నెలలో తొలుత దరఖాస్తు చేసుకోగా, అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రోసీడింగ్స్ జారీ చేసినట్లు తేలింది. ఏయే సినిమాల ప్రదర్శనకు అనుమతిచ్చామనే విషయంపై నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు జరిగిందని గ్రహించిన అధికారులు అనుమతి ఇవ్వబోయే సినిమాలను ఒక్కసారైనా వీక్షిస్తే బాగుండేదనే అభిప్రాయానికి వచ్చారు.
దీనంతటికీ స్వీట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీయే కారణమని భావించిన అధికారులు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి హుస్సేన్‌ను వెంటనే డీఆర్‌ఓ కార్యాలయానికి రావాలని సమాచారం పంపారు. ఆయనతోపాటు షిరిడీసాయి ఫిల్మ్ సొసైటీ నిర్వాహకులను కూడా రావాలని ఆదేశించారు. అయితే హుస్సేన్ మినహా మిగిలిన వారంతా అక్కడికి వచ్చారు. మిగిలిన వారంతా తమకు అనుమతి ఇచ్చిన సినిమాలు, వాటి సారాంశాన్ని వివరించినప్పటికీ సాయంత్రం పొద్దుపోయే వరకు వేచిచూసినా హుస్సేన్ మాత్రం రాలేదు.
ఎవరీ హుస్సేన్?
అధికారులను ఒప్పించి, మెప్పించి ఉత్తర్వులు తీసుకుని హర్రర్ సినిమాలను ప్రదర్శించి పాఠశాల విద్యార్థుల నుంచి డబ్బులు దండుకున్న హుస్సేన్ అసలు ఎవరు...? ఎక్కడుంటాడనే అంశంపై అధికారులకే అంతుపట్టడం లేదు. అట్లాగే వారు ప్రదర్శిస్తున్న సినిమాలకు సంబంధించి హక్కులు తీసుకున్నారా? లేదా? అనే దానిపైనా ఆరా తీశారు.
కొందరు వ్యక్తులు డబ్బులు దండుకోవడానికి స్వీట్ చిల్డ్రన్స్ సొసైటీ ప్రధాన కార్యదర్శి హుస్సేన్ పేరిట దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. హర్రర్ సినిమాలకు సంబంధించి పైరసీ సీడీలను రూపొందించి ప్రదర్శనలు ఇచ్చినట్లు అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. దీనిపై మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయించినట్టు తెలిసింది.
పైవారు శాసించారు... మేం పాటించాం
హర్రర్ సినిమాలకు అనుమతి ఎలా ఇచ్చారనే దానిపై జిల్లా అధికారులు ఇస్తున్న జవాబు ఆశ్చర్యం కలిగిస్తోంది. డీఆర్‌ఓ నుంచి వచ్చిన ప్రొసీడింగ్స్ ఆధారంగానే ఉత్తర్వులు ఇచ్చామని డీఈఓ లింగయ్య చెబుతుండగా, అసలు ఇందులో రెవెన్యూ పాత్ర ఏమాత్రం లేదని డీఆర్‌ఓ కార్యాలయ అధికారులు వ్యాఖ్యానించారు.
రాష్ర్ట ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా డీఆర్‌ఓ కార్యాలయం ప్రొసీడింగ్స్‌ను జారీ చేసిందని వివరణ ఇవ్వడం గమనార్హం. ఇదే అంశంపై డీఆర్‌ఓ వీరబ్రహ్మయ్యను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. డీఈఓ లింగయ్య మాత్రం సినిమాను వీక్షించిన తరువాత ప్రదర్శనకు అనుమతి ఇవ్వాల్సి ఉందని, ఈ విషయంలో పొరపాటు చేశామనే భావనను వ్యక్తం చేశారు.
అందరి నోటా సినిమా మాటే...
సినిమాలకు వెళ్లచ్చామంటే ఆనందించిన విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు దయ్యాల సినిమాలను చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ నిర్వహకులు చూపించారన్న నిజాన్ని తెలుసుకుని నివ్వెరపోయారు.
పై అధికారుల ఆదేశానుసారమే..
పై అధికారుల ఆదేశానుసారమే మండల విద్యాధికారులతోపాటు, పాఠశాల నిర్వహకులకు ఆదేశాలిచ్చాం. కానీ ఇలాంటి సినిమాలు నడిచాయన్న ఫిర్యాదు రాలేదు. భవిష్యత్‌లో సినిమాను చూశాక అనుమతికి ఆలోచిస్తాం.
- కె.లింగయ్య, డీఈవో, కరీంనగర్
పెద్దసార్ ఎట్లంటే గట్లే...
పాఠశాలకు పెద్దసార్ డీఈవో. ఆయన ఇచ్చిన ఆదేశాల ఆధారంగానే మేము కొంతమంది పిల్లలను సినిమాకు పంపాం. ఎవరినీ కచ్చితంగా వెళ్లాలని ఆదేశాలు మా సంఘం నుంచి ఇవ్వలేదు.
- వై.శేఖర్‌రావు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు
‘హర్రర్’పై అలజడి!
Published Fri, Dec 5 2014 1:55 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement