
సీపీఐ రాష్ట్ర రెండో మహాసభల సందర్భంగా ఆదివారం నగరంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ప్రధాన కార్యదర్శి సురవరం
సాక్షి, హైదరాబాద్ : కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెట్టినట్టు సీఎం సీటులో కేసీఆర్‌ను కూర్చోబెట్టారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరమని, దౌర్భాగ్యమని... సిగ్గు, శరం, చీమూ నెత్తురు, నైతిక విలువలున్న వారెవరూ కేసీఆర్ లాంటి రాజకీయం చేయరని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర రెండో మహాసభల సందర్భంగా హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన బహిరంగసభలో సురవరం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిం చారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. లాఠీ చార్జీలు, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచైనా ప్రభుత్వాల నియంతృత్వ విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు..
ఎన్నికల ముందు కేసీఆర్ అనేక వాగ్దానాలు చేశారని, దళితుడిని సీఎం చేస్తానని తానే సీఎం అయ్యారని సురవరం పేర్కొన్నారు. ‘‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన కేసీఆర్.. అందరికీ ఇస్తానని తాను చెప్పలేదని మాట మారుస్తున్నాడు. ఆయన ఇచ్చిన లెక్కల ప్రకారమైతే రాష్ట్రంలో దళితులందరికీ భూమి కావాలంటే 300 ఏళ్లు పడుతుంది. మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కట్టే 100 రూపాయల పన్నులో 35 రూపాయలు అప్పులకు వడ్డీ కిందే కడుతున్నారు. కేసీఆర్ ఇంకో ఐదేళ్లు అధికారంలో ఉంటే పన్ను కింద కట్టే ప్రతి 100 రూపాయల్లో 75 రూపాయలు అప్పులకు వడ్డీ కిందే జమ చేయిస్తాడు. ఉద్యమాలు, పోరాటాల ద్వారా వచ్చిన తెలంగాణ పోరాట స్మృతులు మరువకముందే ఉద్యమాలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాడు. ధర్నాచౌక్ ఎత్తేశాడు. రాజధానిలో ఊరేగింపులు, సభలకు అనుమతివ్వడం లేదు. ప్రజా ఉద్యమాలకు భయపడే పిరికిపంద కేసీఆర్. దమ్ముంటే ప్రజా ఉద్యమాలను అంగీకరించాలి. అసలు కేసీఆర్ సీఎం స్థానంలో కూర్చోవడం తెలంగాణకే అవమానకరం..’’అని వ్యాఖ్యానించారు.
దమ్ముంటే రాజీనామాలు చేయించు
ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓట్ల ద్వారా టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే.. తమ పార్టీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను ప్రలోభపరుచుకుని టీఆర్‌ఎస్‌లోకి గుంజుకున్నాడని సురవరం ఆరోపించారు. ‘‘ఫిరాయించిన వారితో రాజీనామాలు చేయించి, ఎన్నికలు నిర్వహించకుండా సిగ్గులేని రాజకీయం చేస్తున్నాడు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కినట్టు ఇప్పుడు తానేదో జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. సొంత డబ్బాలు కొట్టుకుంటున్నాడు. కేసీఆర్ ప్రధాని అవుదామనే కలల్లో ఉన్నాడు. ఎక్కడ బోర్లా పడతాడో మున్ముందు చూస్తాం..’’అని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాల మధ్య విశాల ఐక్యత కోసం, అవగాహన కోసం సీపీఐ పనిచేస్తుందని చెప్పారు.
జనం విలవిల్లాడిపోతున్నారు
దేశానికి అచ్ఛే దిన్ (మంచి రోజులు) వచ్చాయంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఊదరగొడుతోందని.. అచ్ఛేదిన్ ఏమోగానీ దేశ ప్రజలకు బురే దిన్ (చెడ్డ రోజులు) మాత్రం వచ్చాయని సురవరం వ్యాఖ్యానించారు. దేశంలో నిరుద్యోగం ప్రబలిపోతోందని, నిత్యావసరాల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయని చెప్పారు. గోవధ నిషేధం పేరుతో 30 మందిని పొట్టనపెట్టుకున్నారని.. నిత్యం దళితులు, పీడిత వర్గాలపై ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రగతిశీల శక్తులపైనా దాడులకు పాల్పడుతున్నారని.. ఏం రాయాలో, ఏం తినాలో కూడా వారే నిర్దేశించే స్థితికి దేశాన్ని తీసుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల మధ్య వైరుధ్యం కారణంగానే కేంద్రంలో బీజేపీ ఆడింది ఆటగా, పాడింది పాటగా మారిందన్నారు. ఈ దేశాన్ని ఫాసిజం నుంచి రక్షించాలని, అలాంటి ప్రత్యామ్నాయం కోసం సీపీఐ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
కేసీఆర్ పనికిమాలిన సీఎం: నారాయణ
ప్రపంచంలో అత్యంత పనికిమాలిన సీఎం కేసీఆర్ అని, కేసీఆర్ పాలనను అంతం చేసేలా మహాసభల్లో నిర్ణయాలు తీసుకుంటామని జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. కేసీఆర్ చెబుతున్న థర్డ్ ఫ్రంట్ వల్ల బీజేపీకే లాభమని చెప్పారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఉధృతం కావాల్సిన అవసరం ఉందని మరో జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ పేర్కొన్నారు.
కేసీఆర్‌ను జనమే నిలదీస్తారు: చాడ
రాష్ట్రం ఏర్పడ్డ నాలుగేళ్లలోనే సీఎం కేసీఆర్ నిజ స్వరూపం బట్టబయలైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలు చేసిన కేసీఆర్‌ను నమ్మే రోజులు పోయాయన్నారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కాలనుకుంటే ప్రజలే కేసీఆర్ గొంతు పట్టుకుని నిలదీస్తారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల కోసం జేఏసీ, టీడీపీ, సీపీఎంలతో కలసి పనిచేసేందుకు సీపీఐ కృషి చేస్తుందన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. వామపక్ష ఉద్యమాలకు తానెప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో తన ఆటపాటలతో సభికులను ఉర్రూతలూగించారు. బహిరంగసభలో సీపీఐ రాష్ట్ర నేతలు అజీజ్ పాషా, పువ్వాడ నాగేశ్వరరావు, కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, విజయలక్ష్మి, పశ్య పద్మ, గుండా మల్లేశ్‌లతోపాటు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.