దోమ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిర్వహిస్తున్నారు. ‘స్వచ్ఛ్ భారత్- స్వచ్ఛ్ విద్యాలయ’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విద్యా శాఖ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. నేటి నుంచి 27వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఇందులో పరిశుభ్ర భారత్‌ను రూపొందించాల్సిన ఆవశ్యకతను, దాని కోసం ప్రతిఒక్కరూ తమ వంతుగా చేయాల్సిన కృషిని వివరిస్తూ పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి శాఖలు విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం రోజుకో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాలల ఆవరణ, పరిసరాలు, క్రీడా పరికరాలు, గదులను శుభ్రం చేయడంతో మొదలు పెడతారు.
నేటి నుంచి 4 రోజులపాటు పరిశుభ్రతా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం 14వ తేదీన పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు, నిర్వహణ కోసం విద్యార్థుల భాగస్వామ్యంలో ఎకో క్లబ్‌లను ఏర్పాటు చేస్తారు. 15 నుంచి 18వ తేదీ వరకు వరుసగా తాగునీరు, జీవ వైవిధ్య సంబంధిత అంశాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, వాటిని సద్వినియోగం చేసుకునే విధానం, శక్తి ఉత్పత్తి, వినియోగం తదితర అంశాలపై ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి సమీక్షలు, చర్చా వేదికలు నిర్వహిస్తారు. 20న భూ అభివృద్ధి పనులు, భూ పరిరక్షణ, కాలుష్య సంబంధిత అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. 21, 22, 24 తేదీల్లో విద్యార్థులకు పరిశుభ్రత, పారిశుద్ధ్య సంబంధిత అంశాలపై వ్యాసరచన, నినాద రచన, పద్య పఠనం, క్విజ్ తదితర పోటీలను నిర్వహిస్తారు. 25న ఎస్‌ఎంసీ కమిటీ సమావేశాలు, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు.
ఈ క్రమంలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఏర్పడిన అనంతరం 27న విద్యార్థుల ఆధ్వర్యంలో గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రజలకు స్వచ్ఛ్ భారత్ లక్ష్యాలను వివరించనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై విద్యార్థులు, పాఠశాల సిబ్బంది కలిసి సర్వే నిర్వహించి ఓ నివేదికను రూపొందించడంతో పాఠశాలల్లో ‘స్వచ్‌ఛ భారత్- స్వచ్‌ఛ విద్యాలయ’ కార్యక్రమం ముగుస్తుంది.
నేటి నుంచి పాఠశాలల్లో ‘స్వచ్ఛ్ భారత్’
Published Tue, Oct 7 2014 11:40 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement