
సర్కారీ దవాఖానాల్లో కానరాని ‘స్వచ్ఛ’త
ప్రభుత్వాసుపత్రుల్లో తాండవిస్తున్న అపరిశుభ్రత
సాక్షి నెట్‌వర్క్: స్వచ్ఛ భారత్ మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది! ఈ కార్యక్రమంలో భాగంగా చేతుల్లో చీపుర్లు పట్టుకొని రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో చెత్తాచెదారాన్ని ఊడుస్తూ ఫొటోలకు ఫోజులిచ్చిన అధికారులు ఆ తర్వాత అటు వైపే తొంగి చూడడం లేదు. ఒక్కరోజు హడావుడి చేసి చేతులు దులుపుకోవడంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఫలితంగా సర్కారీ ఆసుపత్రులు ఎప్పట్లాగే కంపు కొడుతున్నాయి! జిల్లా, ప్రాంతీయ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. ఒకటేమిటి అన్నిచోట్లా అపరిశుభ్రత తాండవిస్తోంది. వార్డుల్లో, ఆసుపత్రుల ఆవరణలో పరిశుభ్రత మచ్చుకైనా కనిపించడం లేదు.
ఆసుపత్రి చుట్టూ ఉండే కాలువలు మురుగుతో నిండిపోయాయి. మరుగుదొడ్లు ఉపయోగించడానికి వీల్లేనంత అధ్వాన్నంగా ఉన్నాయి. ఆసుపత్రుల ఆవరణల్లో పందులు, పశువులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. దవాఖానాలో వినియోగించిన పరికరాలు, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. పారిశుధ్యం కోసం ఏటా కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. ‘స్వచ్ఛ’త కానరావడం లేదు. చెత్తాచెదారం నిండిపోయి ప్రాంగణాలన్నీ దుర్గంధం వెదజల్లుతున్నా.. ఆసుపత్రుల ఉన్నతాధి కారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై అంతా బాగుందంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్, స్వచ్ఛ తెలంగాణ అంటూ నినాదాలిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. సిబ్బంది కొరత కూడా ప్రభుత్వ ఆసుపత్రులను పీడిస్తోంది. డాక్టర్లు, నర్సులు, నాలుగో తరగతి ఉద్యోగులు తగిన సంఖ్యలో కనిపించడం లేదు.
ఆదిలాబాద్: పారిశుధ్యం సున్నా
ఆదిలాబాద్ రిమ్స్‌లో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఎమర్జెన్సీ వార్డు, గైనిక్ వార్డు, మరుగుదొడ్లు, బాత్‌రూంలు, అబ్జర్వేషన్ గది, ఆపరేషన్ థియేటర్లను ప్రతి రోజూ నాలుగు నుంచి ఆరు సార్లు శుభ్రం చేయాల్సిన ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి నెలా లక్షల రూపాయలు వెచ్చిస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో ఆసుపత్రి ఆవరణ చెత్త డంపింగ్ యార్డును తలపిస్తోంది.
రంగారెడ్డి: ఒక్కరోజే స్వచ్ఛత
స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం ఫోటోలకే పరిమితమైంది. జిల్లాలోని ఆరోగ్య కేంద్రాల ఆవ రణలో పారిశుధ్యం మచ్చుకు కూడా కనిపించడం లేదు. పరిగి మండల కేంద్రంలోని ఆసుపత్రిలో మురుగు నీరు పేరుకుపోవడంతో పందులు నివాసం ఏర్పర్చుకున్నాయి. మంచాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సెలైన్, మందు బాటిళ్లు కుప్పలుగా పేరుకుపోయాయి. రోగుల కోసం వాడిన సిరంజీలు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి.
నల్లగొండ: ముక్కుపుటాలు అదరాల్సిందే..
నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌లో వైద్యశాల ప్రాంగణం పందులకు నిలయంగా మారింది. ఆసుపత్రి చుట్టూ డ్రైనేజీలు మురుగుతో నిండిపోయాయి. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వైద్యశాలలోని మరుగుదొడ్లు, మూత్రశాలలు సగానికి పైగా వినియోగించుకోవడానికి వీల్లేని స్థితిలో ఉన్నాయి. రామన్నపేట ఆసుపత్రిలో అంతే. గేట్ల వద్ద గార్డ్ లేకపోవడంతో పందులు ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నాయి. రోగుల సహాయకులు భోజనాలు చేస్తుంటే వారి మధ్య నుంచే పందులు సంచరిస్తున్నాయి.
నిజామాబాద్: సిబ్బందే లేరు
8 అంతస్తులు ఉన్న నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో కేవలం 36 మంది మాత్రమే పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. గర్భిణీ వార్డు, చిన్న పిల్లల వార్డు, ఎముకల వార్డు, జనరల్ సర్జన్ వార్డు, అత్యవసర విభాగాలు కంపుకొడుతున్నాయి. బోధన్, బాన్సువాడ, కామారెడ్డి ఏరియా ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు 136 మంది పనిచేయాల్సి ఉంటే కేవలం 42 మందితో నడిపిస్తున్నారు.
కరీంనగర్: అధ్వానంగా మరుగుదొడ్లు
జిల్లాలో ఏ ఆసుపత్రికి వెళ్లినా అపరిశుభ్రత తాండవిస్తోంది. చాలా ఆసుపత్రులకు ప్రహారీ గోడలు లేకపోవడంతో పందులు, పశువులు ప్రవేశిస్తున్నాయి. ఆసుపత్రుల్లో నీటి కోరత వల్ల మరుగుదొడ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. వేములవాడ, సిరిసిల్ల, చందుర్తి, హుజురాబాద్, మంథని, హుస్నాబాద్, కోహెడ ఆసుపత్రుల ఆవరణలు ముళ్ల పోదలు, తుమ్మచెట్లు, పిచ్చిమొక్కలతో అడవులను తలపిస్తున్నాయి. చాలా ఆసుపత్రుల్లో రోగులు, సిబ్బంది కోసం నిర్మించిన టాయిలెట్లను స్టోర్‌రూములుగా మార్చారు.
వరంగల్: చెత్తకు కేరాఫ్
జిల్లాలోని మానుకోట ఏరియా ఆసుపత్రి చెత్తాచెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఆసుపత్రి ఆవరణలోని కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి కంపు వాసనతో రోగులు ఇబ్బం దులు పడుతున్నారు. ఆసుపత్రిలోని మరుగుదొడ్లు సక్రమంగా శుభ్రం చేయడం లేదు. వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలోనూ కూడా పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉంది.
మెదక్: వ్యర్థాలు ఎక్కడివక్కడే..
మెదక్‌లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఆసుపత్రి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ఇక పీహెచ్‌సీల్లోని మరుగుదొడ్ల వైపు వెళ్లాలంటేనే పేషెంట్లు, వారి సహాయకులు జంకుతున్నారు. చాలా వాటికి ప్రహరీలు లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో కుక్క లు, పందులు, ఇతర జంతువులు సంచరిస్తున్నాయి. దోమ లు విజృంభించడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
మహబూబ్‌నగర్: ఆవరణంతా కంపు
మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌లోని ఏరియా ఆసుపత్రుల్లో పరిశుభ్రత మచ్చుకు కూడా కానరావడం లేదు. విధిగా మూడు రోజులకు ఒకసారి పడకల్లో దుప్పట్లు, బెడ్ షీట్లను మార్చాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జిల్లా ప్రధాన ఆసుపత్రి పందులకు నిలయంగా మారింది. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి.
లేని రోగాలు వచ్చేట్టు ఉన్నాయి
జ్వరమొచ్చిందని సర్కారు దవాఖానకు వస్తే ఈడ ఉండడానికి తావిచ్చిండ్రు. కానీ వాసన వశపడ్తలేదు. ఆ రూంలకు ఎట్ల పోయత్తుండ్రో ఏమో.. కంపు వాసన వస్తుంది. దవాఖానకు వస్తే లేని రోగాలు వచ్చేటట్టున్నాయి.
- వరదయ్య, దాచారం, సిరిసిల్ల, కరీంనగర్