గ్రామస్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, విరాళాలు సేకరిస్తున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు అందిస్తూ.. మరుగుదొడ్లు కట్టించి విద్యార్థులు వాటిని వినియోగించేలా చేయడం, మధ్యాహ్న భోజన సమయంలో చేతులు కడుక్కునేందుకు అందుబాటులో వాష్‌బేసిన్‌లు ఉంచడం, అక్కడ హ్యాండ్‌వాష్ లిక్విడ్ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే తొలుత నీటి సమస్యను అధిగమించాలని భావించి మిషన్ భగీరథ ద్వారా చాలా పాఠశాలలకు కనెక్షన్లు తీసుకున్నారు. ఇక పాఠశాలల్లో ఆచరించే అంశాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు నేర్పించడం ద్వారా స్వచ్ఛ భారత్ కల సాకారం కానుంది.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇంతకాలం విద్యార్థులు తాగడానికి నీళ్లు లేక.. అత్యవసరమైన వెళ్లడానికి బాత్‌రూంలు కానరాక.. కళావిహీనమైన గోడలతో కనిపించిన పాఠశాలను నూతన రూపు దాలుస్తున్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న నిధులకు తోడు స్థానికుల భాగస్వామ్యంతో నిధులు సేకరించిన చేపడుతున్న పనులతో ఇలా జరుగుతోంది.. ప్రతీ పాఠశాలలో సంక్రాంతి పండుగ నాటికి అన్ని వసతులు కల్పించేందుకు చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయం’ (ఎస్‌బీఎస్‌వీ) కార్యక్రమాన్ని జిల్లా అధి కారులు వినూత్నంగా చేపడుతున్నారు. ఈ మేరకు ‘ఇంటికి రూ.వంద... బడికి చందా’ నినాదాన్ని కలెక్టర్ రొనాల్డ్‌రోస్, డీఈఓ సోమిరెడ్డి సూచనలతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రమంత చేపడుతున్నా మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే పూర్తి స్థాయిలో విస్తృతంగా జరుగతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులే...
సాధారణంగా పాఠశాలల్లో వసతుల కల్పన అనేది ప్రభుత్వం నుండి వచ్చే నిధులతోనే చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల వారిపై సామాజిక బాధ్యతగా పెరుగుతుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ భావించారు. ఈ మేరకు నిధుల సేకరణ కోసం గ్రామంలోని ప్రతి ఇళ్లు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, వ్యాపారవేత్తలు, అందుబాటులో ఉన్న కంపెనీలు, పూర్వ విద్యార్థుల సాయం తీసుకుంటున్నారు. ఇలా వారు ఇచ్చిన విరాళాలతో పాఠశాలలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు.
తద్వారా స్వగ్రామంలోని పాఠశాలను అందంగా తీర్చిదిద్దడంలో తమ భాగస్వామ్యం ఉందని వారు భావించి మరింత అభివృద్ధికి సహకరిస్తానని.. ఎప్పటికప్పుడు పనులను పరిశీలించే అవకాశముంటుందని కలెక్టర్ భావన. ఎస్‌బీఎస్‌వీ కార్యక్రమన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా కలెక్టర్ గతంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం కోసం పలు మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేశారు. ఫలితంగా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.87లక్షల వసూలైనట్లు సమాచారం. అత్యధికంగా జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట పాఠశాలకు రూ.70వేలు వసూలైనట్లు తెలుస్తోంది.
నిధుల సేకరణకు మార్గాలు
జిల్లాలో అన్ని యాజమానాల్లో కలిపి మొత్తం 1,356 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరికి పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం పెద్ద సవాల్‌గా ఉంటోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ‘స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంపై దృష్టి సారించారు. ఈ మేరకునిధుల కోసం కోసం ప్రతీ పాఠశాల ఆవరణలో హుండీ ఏర్పాటు చేయగా ఉపాధ్యాయులు, విద్యార్థులు తమకు తోచిన డబ్బు వేయొచ్చు.
అలాగే, గ్రామంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటి చందా వసూలు చేయాలి. ఇది రూ.100 మొదలు ఎంతైనా కావొచ్చు. ముఖ్యంగా గ్రామంలోని వ్యాపార సముదాయాలు, రిటైర్డ్ ఉద్యోగులు, పూర్వవిద్యార్థులు, ఉద్యోగులు, యువజన సంఘాల, గ్రామ పెద్దలతో పాటు ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ వ్యాపారుల నుంచి విరాళాల సేకరణ జరుగుతోంది. సేకరించిన విరాళాలు పాఠశాల ఖాతాలో జమచేసి, పాఠశాల అవసరాల కోసం ఎస్‌ఎంసీ కమిటీ ఆధ్వర్యాన మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తారు.
విరాళాలతో ప్రయోజనాలు
విరాళాలు సేకరించడం వల్ల చాలా ప్రయోజనాలు కనిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో వసతులు కల్పించినా పూర్తి భద్రత ఉండేది కాదు. ముఖ్యంగా మరుగుదొడ్లు, వాష్‌బేసిన్‌లు, పైపులు, ట్యాంకులను స్థానికులే ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నా యి. అయితే, ప్రస్తుతం గ్రామస్తుల నుంచే విరాళాలు సేకరించడం ద్వారా సొంత ఆస్తిగా భావించి నిర్మాణాలను వారే కాపాడుకుంటారన్నది అధికా రుల భావన. ఇక వాటర్‌ఫిల్టర్లు, కంప్యూటర్లు విరా ళాలుగా అందినా నిర్వహణ లేక మూలకు పడుతు న్నాయి. వీటి నిర్వహణ కూడా పాఠశాలల నిధుల తో గ్రామస్తులు, ఎస్‌ఎంసీ కమిటీలు చూసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని చెకబుతున్నారు.
విస్తృతంగా ఎస్‌బీ.. ఎస్‌వీ
స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు విరాళాల సేకరణ విస్తృతంగా కొనసాగుతుంది. అనుకున్న సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుని పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు స్వచ్ఛత అలవాటు చేస్తాం. అంతేకాకుండా మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొస్తాం. పాఠశాల అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భాగస్వాములను చేసి నాణ్యత పాటించేందుకు కృషి చేస్తాం. కలెక్టర్ చొరవతో కార్యక్రమం అనుకున్న దాని కంటే బాగా కొనసాగుతోంది. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment