Donations Collecting
-
సినీ తారల వరదసాయం...
-
ట్రంప్‌కు 34 మిలియన్ డాలర్ల విరాళాలు
న్యూయార్క్: మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024 అధ్యక్ష ఎన్నికలకు విరాళంగా ఇప్పటి వరకు 34 మిలియన్ డాలర్లను సేకరించినట్లు ఆయన మద్దతుదారులు తెలిపారు. విరాళాలను ఎలా సంపాదించిందీ వివరిస్తూ ఆయన ఫెడరల్ ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇవ్వనున్నారు. మొత్తం 34 మిలియన్ డాలర్లలో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 18.8 మిలియన్ డాలర్లు అందాయి. హష్ మనీ కేసులో ట్రంప్‌పై నేరారోపణల ప్రక్రియ మొదలుకొని కోర్టు దోషిగా ప్రకటించే వరకు రెండు వారాల వ్యవధిలోనే 15.4 మిలియన్ డాలర్లు విరాళంగా అందినట్లు మద్దతుదారులు తెలిపారని పొలిటికో పేర్కొంది. -
మూడేళ్లలో రూ.2,430 కోట్లు
న్యూఢిల్లీ: గత మూడేళ్లకాలంలో భారతీయ ఎన్జీవో సంస్థలు విదేశాల నుంచి విరాళాల రూపంలో రూ.2,430.80 కోట్లను స్వీకరించాయని కేంద్రం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ వివరాలు చెప్పారు. 2019–20లో రూ.727.1 కోట్లు, 2020–21కాలంలో రూ.798.1 కోట్లు, 2021–22కాలంలో రూ.905.5 కోట్ల విరాళాలు పొందాయని పేర్కొన్నారు. ఈ నెల పదోతేదీ నాటికి దేశవ్యాప్తంగా 16,383 ఎన్జీవో సంస్థలు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయని తెలిపారు. వీటిలో దాదాపు 15వేల సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తమ వార్షిక నివేదికలను సమర్పించాయి. కొన్ని సంస్థల నిధుల దుర్వినియోగం/ నిధుల మళ్లింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో చర్యల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. -
మహిళామణులలో ఆనందోత్సాహాలు నింపిన 'తానా లేడీస్ నైట్'
మహిళా మణుల ఆనందోత్సాహాల నడుమ తానా లేడీస్ నైట్ ఘనంగా జరిగింది. అక్టోబర్ 21 శుక్రవారం రాత్రి అమెరికాలోని మిషిగన్‌లో ఈ మహిళా ఉత్సవం జరిగింది. మహిళలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 80 వేల డాలర్లు విరాళాలు అందించారు. ఆటపాటలతో, విందు వినోదాలతో, ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం మహిళలలో నూతన ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమం తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, తానా ఫౌండేషన్ ట్రస్టీ సురేష్ పుట్టగుంట, మను గొంది సారధ్యంలో జరిగింది. నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి మహిళల నుంచి మంచి స్పందన వచ్చింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అంటారు. మహిళలను గౌరవించడం అందరి కర్తవ్యం. వారి శక్తి అసాధారణమైనది. మహిళా మణులు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. మహిళల్లో చైతన్యం కలిగించడానికి వారికి వినోదంతో పాటు వికాసం కలిగించటానికి తానా ఫౌండేషన్ ఈ లేడీస్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తానా చేస్తున్న చారిటీ కార్యక్రమాలలో మహిళలు పాల్గొని సహాయం అందించాలని ఆయన అన్నారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చైర్మన్ హనుమయ్య బండ్ల మాట్లాడుతూ.. తానా మొదటి నుంచి మహిళా సేవలకు పెద్దపీట వేయడం జరిగింది. మహిళా సాధికారత దిశగా తానా తాన వంతు కృషి చేస్తుందని అన్నారు. సురేష్ పుట్టగుంట గారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన 80,000 డాలర్లు విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు (ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్య ఉచిత అన్నదాన కార్యక్రమం) ఒక సంవత్సరం కాలం పాటు కొనసాగించేందుకు ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. తానా ఉమెన్ కో ఆర్డినేటర్ ఉమా కటికి మాట్లాడుతూ.. సహనానికి- సాహసానికి, ఓర్పుకి- నేర్పుకి ప్రతిబింబాలు స్త్రీలు. ఇటీవల కాలంలో వారు అన్ని రంగాల్లో ముందుకు దూసుకొని పోవడం అభినందనీయమన్నారు. మను గొంది మాట్లాడుతూ.. మా ఆహ్వానం మన్నించి ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పని చేసిన వారికి ధన్యవాదాలు అన్నారు. తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కార్యక్రమం సమన్వయ కర్తగా వ్యవహరించారు. నమస్తే ఫ్లేవేర్ రెస్టారెంట్ వారు చక్కని విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి ప్రత్యేక అతిథులుగా యాంకర్ ఉదయభాను, సినీ గాయని మంగ్లీ హాజరై అలరించారు. ఈ కార్యక్రమం తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారి ప్రోత్సాహంతో జరిగింది. తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ గోగినేని, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లక్ష్మీ దేవినేని తదితరుల పర్యవేక్షించారు. చివరగా, రాణి అల్లూరి వందన సమర్పణ చేస్తూ.. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లకు, స్పా న్సర్లకు, డోనర్లకు, ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. -
మిషనరీస్ ఆఫ్ చారిటీకి లైసెన్స్ పునరుద్ధరణ
న్యూఢిల్లీ: మదర్ థెరిస్సా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ(ఎంఓసీ)’ ఎన్జీవోకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశీ విరాళాల స్వీకరణకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌ను కేంద్ర హోం శాఖ శుక్రవారం పునరుద్ధరించింది. విదేశీ విరాళాల స్వీకరణ నియంత్రణ(ఎఫ్సీఆర్ఏ యాక్ట్) చట్టం కింద సంస్థ లైసెన్స్‌ను పునరుద్ధరించిన నేపథ్యంలో ఇకపై విదేశీ విరాళాలను అందుకునే హక్కులు ఎంఓసీకి దక్కాయి. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే ఎంఓసీ సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకుల ఖాతాలో నిల్వ ఉన్న నగదు మొత్తాలను వినియోగించుకునే అవకాశం చిక్కింది. నిరుపేదలకు శాశ్వత సేవే ఆశయంగా నోబెల్ గ్రహీత మదర్ థెరిస్సా 1950లో కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. ‘నాటి నుంచి దశాబ్దాలుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమాలు ఇకమీదటా కొనసాగుతాయి. లైసెన్స్ పునరుద్ధరించారనే వార్త మా సంస్థకు నిజంగా పెద్ద ఊరట. లైసెన్స్ రాని ఈ రెండు వారాలూ దేశీయ విరాళాలతో మాకు పూర్తి సహాయసహకారాలు అందించిన దాతల దాతృత్వం అమూల్యం’ అని ఎంఓసీ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎంఓసీకి వచ్చిన గత విదేశీ విరాళాలకు సంబంధించి కొంత ప్రతికూల సమాచారం ఉందనే కారణంతో 2021 డిసెంబర్ 25న క్రిస్మస్ రోజునే ఆ సంస్థ లైసెన్స్ రెన్యువల్ దరఖాస్తును కేంద్ర హోం శాఖ తిరస్కరించడం తెల్సిందే. దీంతో దేశవ్యాప్తంగా విపక్షాలతోపాటు భిన్న వర్గాల నుంచి మోదీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇన్నాళ్లూ ముస్లింలను వేధించిన బీజేపీ సర్కార్ తాజాగా క్రిస్టియన్ మైనారిటీలను లక్ష్యంగా చేసుకుందని విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్‌ను పునరుద్ధరించడం గమనార్హం. భారత్‌లోని ఏదైనా ఎన్జీవో.. విదేశీ విరాళాలను పొందాలంటే లైసెన్స్ తప్పనిసరి. తప్పుగా కనబడింది.. 15 రోజుల్లో ఒప్పయిందా?: తృణమూల్ ఎంపీ డిరెక్ విరాళాల్లో అసంబద్ధ సమాచారం ఉందంటూ దరఖాస్తును తిరస్కరించిన 15 రోజుల్లోనే మళ్లీ లైసెన్స్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటని మోదీ సర్కార్‌ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డిరెక్ ఓబ్రియన్ సూటిగా ప్రశ్నించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లను రాబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం యూ టర్న్ తీసుకుందన్నారు. క్రైస్తవుల ప్రేమకు మోదీ తలొగ్గారన్నారు. ‘పవర్ ఆఫ్ లవ్ గ్రేటర్ దన్ ది పవర్ ఆఫ్ 56 ఇంచెస్’ అని ట్వీట్‌చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీనుద్ధేశిస్తూ 56 అంగుళాల ఛాతి అని గతంలో వ్యాఖ్యానించడం తెల్సిందే. -
నా ఇంటికొచ్చి నన్నే బెదిరిస్తారా? మాజీ సీఎం
బెంగళూరు: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సేకరిస్తున్న విరాళాలు వివాదాస్పదమవుతున్నాయి. శాంతియుతంగా సేకరించాల్సిన విరాళాలను బెదిరింపులకు పాల్పడుతూ.. ఇవ్వని వారిపై దాడి చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అలాంటి పరిస్థితి తాను ఎదుర్కొన్నట్లు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. తన ఇంటికి వచ్చి తననే బెదిరించారని తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. రామ మందిరం పేరుతో కొందరు బెదిరించి విరాళాలు వసూలు చేస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆరోపణలు చేశారు. తాను కూడా ఒక బాధితుడినేనని తెలిపారు. ఓ మహిళతోపాటు మరో ఇద్దరు తన ఇంటికి వచ్చారని చెప్పారు. తాను విరాళం ఎందుకు ఇవ్వడం లేదని బెదిరించారని వాపోయారు. అసలు ఆమె ఎవరు..? మా ఇంటికి వచ్చి నన్ను అడిగే అధికారం ఆమెకు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నించారు. ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతూ విరాళాలు సేకరించడం సరికాదని పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడంపై మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కుమారస్వామి స్పష్టం చేశారు. తాను కూడా విరాళం ఇస్తాను. మా పార్టీ నాయకులు చాలా మంది ఇచ్చారు. అయితే విరాళాల వసూళ్లలో పారదర్శకత ఎక్కడ ఉంది? అని కుమారస్వామి ప్రశ్నించారు. ఇంటింటికొచ్చి అడిగే అనుమతి ఎవరిచ్చారని నిలదీశారు. ‘రామ మందిరం హిందువుల భక్తిమనోభావాలకు సంబంధించిన అంశం. అయితే దాని పేరుతో కొనసాగుతున్న విభజనపై నేను వ్యతిరేకం’’ అని కుమారుస్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ వారిని నాజీలుగా పేర్కొన్నారు. జర్మనీలో హిట్లర్ చేసిన మాదిరి దేశంలో ఆర్ఎస్ఎస్ చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వానికి బాధ్యత ఉండదా అని ప్రశ్నించారు. విశ్వ హిందూ పరిషత్‌ను ఒక్కటే కోరుతున్నా.. డొనేషన్స్ వసూలు చేసే వాళ్లు నిజాయితీగా ఉండేలా చూడండి అని కుమారస్వామి విజ్ఞప్తి చేశారు. -
విరాళం ఇవ్వలేదని దారుణం..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో పద్నాలుగు గిరిజన కుటుంబాలు దుర్గా పూజ ఉత్సవాలకు తగినంత విరాళం ఇవ్వనందున సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశాయి. సహాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. న్యాయం కోసం బాలాఘాట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ ఘటన మోటెగాన్ గ్రామంలో చోటుచేసుకుంది. దీని గురించి గ్రామస్తుడు మున్సింగ్ మస్రం మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేక గత నెలలో గ్రామంలో నిర్వహించిన దుర్గా పూజ వేడుకులకు చందా రూ.151 కంటే ఎక్కువ చెల్లించలేకపోయాం. అందువలన గ్రామ పెద్ద సామాజికంగా బహిష్కరించాలని గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చారు. అలాగే పశువులను మేపడానికి , వైద్య ,ఆరోగ్య సేవలను కూడా నిరాకరించారు’’ అని ఆరోపించాడు. ఇక.. ‘‘కరోనా మహమ్మారి వలన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది, ఇప్పటికి ఆ సమస్యనుంచి బయటపడలేదు. అందుకే చందా చెల్లించలేక పోయాం, మేము ఈ విషయాన్ని లామ్టా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. తరువాత పోలీసులు ఏకాభిప్రాయంతో మా సమస్యను పరిష్కరించాలని చూశారు కానీ అది జరగలేదు’’ అని మరో బాధితుడు ధన్సింగ్ పార్టే తెలిపారు. కాగా గిరిజన కుటుంబాల సామాజిక బహిష్కరణను విధించడంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి డాక్టర్ నరోత్తం మిశ్రా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. "సబ్ డివిజనల్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి గ్రామస్తులను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారని, ఒకవేళ గిరిజనులపై బహిష్కరణ ఉపసంహరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని మీడియాతో అన్నారు.నిక ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేసింది. రైతులు, గిరిజనులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభలో చర్చించడానికి తాము ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం అతి తక్కువ సమయంలో సమావేశాలు ముగించడానికి ప్రయత్నిస్తోందని మండిపడింది. బీజేపీ ఎప్పుడు ప్రజలకు దూరంగానే ఉంటుందని మాజీ మంత్రి సజ్జార్ సింగ్ వర్మ విమర్శించారు. కాగా కొన్ని రోజుల క్రితం 28 ఏళ్ల గిరిజన యువకుడు వాయిదా కట్టలేక సజీవ దహనమైన విషయం విదితమే. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అతను నిర్భంధ కూలి అని 5000 రూపాయలు చెల్లించక పోవడంతో హత్య చేశారని ఆరోపించారు. -
ఫేస్బుక్ మిత్రుల ఔదార్యం
సాక్షి, ధర్మపురి (కరీంనగర్) : అనారోగ్యంతో బాధపడుతున్న వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇరువురు పేద మహిళలకు వైద్య ఖర్చుల కోసం ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ చొరవతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు రూ.1.15 లక్షలు సాయం అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మానెపెల్లి వరలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్. వైద్య పరీక్షలకు కూడా డబ్బులు లేకపోవడంతో వైద్యానికి నోచుకోలేక పోయింది. అదేవిధంగా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోదినపు లక్ష్మి కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోగా, ఉన్న ఒక్క కూతురు చదువు మానేసి తల్లికి సేవలందిస్తోంది. ఫేస్బుక్ పోస్టుతో దాతల సాయం బాధితుల సమస్యలను వివరిస్తూ ధర్మపురికి చెందిన రమేష్ జూలై 4న ఫేస్బుక్లో పోస్టు చేసి సాయం అందించాలని బాధితుల ఖాతా వివరాలను పొందుపర్చాడు. దాంతో మిత్రులు వరలక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.62 వేలు, బోదినపు లక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.53 వేలు సాయం పంపించారు. దాతలు అందించిన సాయంతో వైద్యం చేయించుకోవడం కోసం బాధితులు ఆస్పత్రికి వెళ్లారు. -
ఇంటికి రూ.వంద బడికి చందా !
ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు అందిస్తూ.. మరుగుదొడ్లు కట్టించి విద్యార్థులు వాటిని వినియోగించేలా చేయడం, మధ్యాహ్న భోజన సమయంలో చేతులు కడుక్కునేందుకు అందుబాటులో వాష్బేసిన్లు ఉంచడం, అక్కడ హ్యాండ్‌వాష్ లిక్విడ్ ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే తొలుత నీటి సమస్యను అధిగమించాలని భావించి మిషన్ భగీరథ ద్వారా చాలా పాఠశాలలకు కనెక్షన్లు తీసుకున్నారు. ఇక పాఠశాలల్లో ఆచరించే అంశాలను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు నేర్పించడం ద్వారా స్వచ్ఛ భారత్ కల సాకారం కానుంది. మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు కొత్త శోభను సంతరించుకుంటున్నాయి. ఇంతకాలం విద్యార్థులు తాగడానికి నీళ్లు లేక.. అత్యవసరమైన వెళ్లడానికి బాత్రూంలు కానరాక.. కళావిహీనమైన గోడలతో కనిపించిన పాఠశాలను నూతన రూపు దాలుస్తున్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న నిధులకు తోడు స్థానికుల భాగస్వామ్యంతో నిధులు సేకరించిన చేపడుతున్న పనులతో ఇలా జరుగుతోంది.. ప్రతీ పాఠశాలలో సంక్రాంతి పండుగ నాటికి అన్ని వసతులు కల్పించేందుకు చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయం’ (ఎస్‌బీఎస్‌వీ) కార్యక్రమాన్ని జిల్లా అధి కారులు వినూత్నంగా చేపడుతున్నారు. ఈ మేరకు ‘ఇంటికి రూ.వంద... బడికి చందా’ నినాదాన్ని కలెక్టర్ రొనాల్డ్‌రోస్, డీఈఓ సోమిరెడ్డి సూచనలతో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్తున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రమంత చేపడుతున్నా మహబూబ్‌నగర్ జిల్లాలో మాత్రమే పూర్తి స్థాయిలో విస్తృతంగా జరుగతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ నిధులే... సాధారణంగా పాఠశాలల్లో వసతుల కల్పన అనేది ప్రభుత్వం నుండి వచ్చే నిధులతోనే చాలా కాలంగా నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం చేపట్టిన కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో ఉండడం వల్ల వారిపై సామాజిక బాధ్యతగా పెరుగుతుందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ భావించారు. ఈ మేరకు నిధుల సేకరణ కోసం గ్రామంలోని ప్రతి ఇళ్లు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు, వ్యాపారవేత్తలు, అందుబాటులో ఉన్న కంపెనీలు, పూర్వ విద్యార్థుల సాయం తీసుకుంటున్నారు. ఇలా వారు ఇచ్చిన విరాళాలతో పాఠశాలలను ఆహ్లాదంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు. తద్వారా స్వగ్రామంలోని పాఠశాలను అందంగా తీర్చిదిద్దడంలో తమ భాగస్వామ్యం ఉందని వారు భావించి మరింత అభివృద్ధికి సహకరిస్తానని.. ఎప్పటికప్పుడు పనులను పరిశీలించే అవకాశముంటుందని కలెక్టర్ భావన. ఎస్‌బీఎస్‌వీ కార్యక్రమన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా కలెక్టర్ గతంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం కోసం పలు మండలాల్లో సమావేశాలు ఏర్పాటుచేశారు. ఫలితంగా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొనడంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.87లక్షల వసూలైనట్లు సమాచారం. అత్యధికంగా జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట పాఠశాలకు రూ.70వేలు వసూలైనట్లు తెలుస్తోంది. నిధుల సేకరణకు మార్గాలు జిల్లాలో అన్ని యాజమానాల్లో కలిపి మొత్తం 1,356 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 1.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరికి పూర్తి స్థాయిలో వసతులు కల్పించడం పెద్ద సవాల్‌గా ఉంటోంది. ఇందుకోసం జిల్లా కలెక్టర్ ‘స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమంపై దృష్టి సారించారు. ఈ మేరకునిధుల కోసం కోసం ప్రతీ పాఠశాల ఆవరణలో హుండీ ఏర్పాటు చేయగా ఉపాధ్యాయులు, విద్యార్థులు తమకు తోచిన డబ్బు వేయొచ్చు. అలాగే, గ్రామంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటి చందా వసూలు చేయాలి. ఇది రూ.100 మొదలు ఎంతైనా కావొచ్చు. ముఖ్యంగా గ్రామంలోని వ్యాపార సముదాయాలు, రిటైర్డ్ ఉద్యోగులు, పూర్వవిద్యార్థులు, ఉద్యోగులు, యువజన సంఘాల, గ్రామ పెద్దలతో పాటు ఎన్జీఓలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ వ్యాపారుల నుంచి విరాళాల సేకరణ జరుగుతోంది. సేకరించిన విరాళాలు పాఠశాల ఖాతాలో జమచేసి, పాఠశాల అవసరాల కోసం ఎస్ఎంసీ కమిటీ ఆధ్వర్యాన మౌలిక వసతుల కల్పనకు వెచ్చిస్తారు. విరాళాలతో ప్రయోజనాలు విరాళాలు సేకరించడం వల్ల చాలా ప్రయోజనాలు కనిస్తున్నాయి. గతంలో పాఠశాలల్లో వసతులు కల్పించినా పూర్తి భద్రత ఉండేది కాదు. ముఖ్యంగా మరుగుదొడ్లు, వాష్బేసిన్లు, పైపులు, ట్యాంకులను స్థానికులే ధ్వంసం చేసిన ఘటనలు ఉన్నా యి. అయితే, ప్రస్తుతం గ్రామస్తుల నుంచే విరాళాలు సేకరించడం ద్వారా సొంత ఆస్తిగా భావించి నిర్మాణాలను వారే కాపాడుకుంటారన్నది అధికా రుల భావన. ఇక వాటర్ఫిల్టర్లు, కంప్యూటర్లు విరా ళాలుగా అందినా నిర్వహణ లేక మూలకు పడుతు న్నాయి. వీటి నిర్వహణ కూడా పాఠశాలల నిధుల తో గ్రామస్తులు, ఎస్ఎంసీ కమిటీలు చూసుకుంటే ఎలాంటి నష్టం ఉండదని చెకబుతున్నారు. విస్తృతంగా ఎస్బీ.. ఎస్వీ స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు విరాళాల సేకరణ విస్తృతంగా కొనసాగుతుంది. అనుకున్న సమయంలోనే లక్ష్యాన్ని చేరుకుని పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు స్వచ్ఛత అలవాటు చేస్తాం. అంతేకాకుండా మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకొస్తాం. పాఠశాల అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భాగస్వాములను చేసి నాణ్యత పాటించేందుకు కృషి చేస్తాం. కలెక్టర్ చొరవతో కార్యక్రమం అనుకున్న దాని కంటే బాగా కొనసాగుతోంది. – సోమిరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి -
చచ్చేందుకు అనుమతించండి మహా ప్రభో..!
భువనేశ్వర్ : తమ ఆదాయానికి అడ్డంకులు సృష్టించి పూట గడవకుండా చేస్తున్నారని పేర్కొంటూ పూరి జగన్నాథస్వామి ఆలయ పూజారి నరసింఘ పుజపంద ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించి చచ్చే బదులు ఆత్మహత్యే శరణ్యమనీ, చనిపోయేందుకు తనకు అనుమతివ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బుధవారం లేఖ రాశారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించొద్దనే నియమం వల్ల ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తున్న తమ ఏకైక ఆదాయ వనరును నాశనం చేశారని నరసింఘ వాపోయారు. తమకు బతికే ఆధారమే లేదనీ, తమ హక్కులపై ఉక్కుపాదం మోపడం దారుణమని ఒడిషా ప్రభుత్వం, సుప్రీం కోర్టుపై ఆయన నిరసన వెళ్లగక్కారు. సుప్రీం ఆదేశాలు.. దేవాలయాల్లో పూజరుల ఆగడాలు పెరిగిపోయాయనీ, పాలనా వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటూ కటక్‌కు చెందిన న్యాయవాది మృణాళిని పధి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఆలయాల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు జూలై నెలలో పలు ఆదేశాలు జారీ చేసింది. పూజారులెవరూ భక్తుల నుంచి కానుకలు స్వీకరించొద్దని స్పష్టం చేసింది. అలాగే, ఇష్టానుసారం వ్యవహరించి భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దనీ, వరసక్రమంలో (క్యూ) భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించాలని వెల్లడించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా అక్టోబర్ 1 నుంచి జగన్నాథ ఆలయంలోకి క్యూ పద్ధతిలో భక్తులను అనుమతిస్తున్నారు. ఇదిలాఉండగా.. జగన్నాథస్వామి ఆలయంలోకి పురావస్తు శాఖ అధికారులు ప్రవేశించడాన్ని నిరసిస్తూ గత మార్చిలో నరసింఘ ప్రాణత్యాగం చేస్తానని బెదిరింపులకు దిగడం గమనార్హం. ఆలయ కోశాగారం (రత్న భండార్)లోని ఆభరణాల వాస్తవస్థితిని తెలుసుకునేందు పురావస్తు శాఖ ఒడిషా హైకోర్టు అనుమతి తీసుకుంది. -
నేను..నాతోపాటు మరో పదిమంది
విరాళాల సేకరణ కోసం ఆప్ సరికొత్త కార్యక్రమం సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల కోసం పెద్దఎత్తున విరాళాల సేకరణకు ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన క్లీన్ ఇండియా తరహాలో ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఐ ఫండ్ ఫర్ హానెస్ట్ పార్టీ’ పేరిట విరాళాల వసూలు కార్యక్రమాన్ని ప్రారంభించింది. పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ పది వేల చందా ప్రకటించడంతోపాటు మరో పది మంది పేర్లను దాతల పేర్లను వెల్లడించడం ద్వారా ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. కేజ్రీవాల్ మాదిరిగానే వీరు కూడా మరో పది మంది పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. పార్టీకి విరాళాల కోసం తాము అందరి ఎదుట ఈ సవాలు ఉంచుతున్నామని, తాను మొట్టమొదటి సవాలును స్వీకరించి పది వేల రూపాయలను ఇస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వేలాదిమంది ఈ సవాలును స్వీకరిస్తారని ఆయన చెప్పారు. దీంతోపాటు చందా ఇచ్చే సవాలు స్వీకరించడం కోసం ఆయన మరో పది మంది పేర్లను ప్రతిపాదించారు. వారిలో కేజ్రీవాల్ సోదరి, సోదరుడితో పాటు అమెరికాలో నివసించే భారతీయుడు డా. మనీష్, సినీనటి గుల్ పనాగ్ కూడా ఇందులోఉన్నారు. కేజ్రీవాల్‌కు గొంతునొప్పి.. ప్రచారానికి విరామం న్యూఢిల్లీ: చల్లటి వాతావరణం కారణంగా గొంతునొప్పితో బాధపడుతున్న ఆమ్ఆద్మీపార్టీ అధినేత కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారానికి విరామం ప్రకటించారు. మాజీ ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ కనీసం రెండు బహిరంగ ర్యాలీల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. కాగా, కొంతకాలంగా కేజ్రీవాల్‌ను గొంతు నొప్పి పీడిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. అయితే సమస్య మరింత తీవ్రరూపం దాల్చడంతో వైద్యుల సలహా మేరకు ఆయన కొంత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. గొంతునొప్పి తగ్గిన వెంటనే తమ పార్టీ అధినేత కేజ్రీవాల్ తిరిగి ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా, నగరంలో శీతలగాలుల ప్రభావం ఆప్ జనసభలపై పడుతోంది. చలితోపాటు మంచు పడుతుండటంతో ర్యాలీలకు ప్రజలు తగిన సంఖ్యలో హాజరు కావడంలేదని ఆప్ భావిస్తోంది. అలాగే నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలోనూ ప్రజలతోపాటు తమ పార్టీ కార్యకర్తలు చాలామంది ర్యాలీలకు అధికసంఖ్యలో హాజరు కాకపోవచ్చనే భావనతో ప్రచార ర్యాలీలకు మూడు, నాలుగు రోజుల విరామం ప్రకటించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్ చివరిసారిగా డిసెంబర్ 30వ తేదీన రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక విడత ర్యాలీలు నిర్వహించామని పార్టీ నాయకులు తెలిపారు. కాగా, పార్టీ అధినేత కేజ్రీవాల్ గొంతునొప్పి వల్ల ర్యాలీలకు విరామం ప్రకటించిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో శని, ఆదివారాల్లో ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని పార్టీ అభ్యర్థులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ఇకపై ఢిల్లీ గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టిపెట్టేందుకు ఆప్ నాయకులు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఛతర్పూర్ నియోజకవర్గంతోపాటు గ్రేటర్ కైలాష్,మెహ్రోలీ,ఆర్కేపురం, కస్తూర్బానగర్ తదితర నియోజకవర్గాల్లో తమ అధినేత పర్యటి స్తారని ఆప్ నాయకులు తెలిపారు.