తిమ్మాపూర్‌లో తల్లికి సేవలు అందిస్తున్న కూతురు
సాక్షి, ధర్మపురి (కరీంనగర్) : అనారోగ్యంతో బాధపడుతున్న వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఇరువురు పేద మహిళలకు వైద్య ఖర్చుల కోసం ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేష్ చొరవతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు రూ.1.15 లక్షలు సాయం అందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన మానెపెల్లి వరలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. భర్త ట్రాక్టర్ డ్రైవర్. వైద్య పరీక్షలకు కూడా డబ్బులు లేకపోవడంతో వైద్యానికి నోచుకోలేక పోయింది. అదేవిధంగా ధర్మపురి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన బోదినపు లక్ష్మి కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ మంచం పట్టింది. కొన్నేళ్ల క్రితం భర్త చనిపోగా, ఉన్న ఒక్క కూతురు చదువు మానేసి తల్లికి సేవలందిస్తోంది.
ఫేస్‌బుక్ పోస్టుతో దాతల సాయం
బాధితుల సమస్యలను వివరిస్తూ ధర్మపురికి చెందిన రమేష్ జూలై 4న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసి సాయం అందించాలని బాధితుల ఖాతా వివరాలను పొందుపర్చాడు. దాంతో మిత్రులు వరలక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.62 వేలు, బోదినపు లక్ష్మి బ్యాంకు ఖాతాకు రూ.53 వేలు సాయం పంపించారు. దాతలు అందించిన సాయంతో వైద్యం చేయించుకోవడం కోసం బాధితులు ఆస్పత్రికి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment