పూరీ జగన్నాథస్వామి ఆలయం
భువనేశ్వర్ : తమ ఆదాయానికి అడ్డంకులు సృష్టించి పూట గడవకుండా చేస్తున్నారని పేర్కొంటూ పూరి జగన్నాథస్వామి ఆలయ పూజారి నరసింఘ పుజపంద ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించి చచ్చే బదులు ఆత్మహత్యే శరణ్యమనీ, చనిపోయేందుకు తనకు అనుమతివ్వాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి బుధవారం లేఖ రాశారు. భక్తుల నుంచి కానుకలు స్వీకరించొద్దనే నియమం వల్ల ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తున్న తమ ఏకైక ఆదాయ వనరును నాశనం చేశారని నరసింఘ వాపోయారు. తమకు బతికే ఆధారమే లేదనీ, తమ హక్కులపై ఉక్కుపాదం మోపడం దారుణమని ఒడిషా ప్రభుత్వం, సుప్రీం కోర్టుపై ఆయన నిరసన వెళ్లగక్కారు.
సుప్రీం ఆదేశాలు..
దేవాలయాల్లో పూజరుల ఆగడాలు పెరిగిపోయాయనీ, పాలనా వ్యవహారాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటూ కటక్‌కు చెందిన న్యాయవాది మృణాళిని పధి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఆలయాల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు జూలై నెలలో పలు ఆదేశాలు జారీ చేసింది. పూజారులెవరూ భక్తుల నుంచి కానుకలు స్వీకరించొద్దని స్పష్టం చేసింది. అలాగే, ఇష్టానుసారం వ్యవహరించి భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దనీ, వరసక్రమంలో (క్యూ) భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించాలని వెల్లడించింది. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా అక్టోబర్ 1 నుంచి జగన్నాథ ఆలయంలోకి క్యూ పద్ధతిలో భక్తులను అనుమతిస్తున్నారు.
ఇదిలాఉండగా.. జగన్నాథస్వామి ఆలయంలోకి పురావస్తు శాఖ అధికారులు ప్రవేశించడాన్ని నిరసిస్తూ గత మార్చిలో నరసింఘ ప్రాణత్యాగం చేస్తానని బెదిరింపులకు దిగడం గమనార్హం. ఆలయ కోశాగారం (రత్న భండార్)లోని ఆభరణాల వాస్తవస్థితిని తెలుసుకునేందు పురావస్తు శాఖ ఒడిషా హైకోర్టు అనుమతి తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment