
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో పద్నాలుగు గిరిజన కుటుంబాలు దుర్గా పూజ ఉత్సవాలకు తగినంత విరాళం ఇవ్వనందున సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశాయి. సహాయం కోసం స్థానిక పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. న్యాయం కోసం బాలాఘాట్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఈ ఘటన మోటెగాన్ గ్రామంలో చోటుచేసుకుంది. దీని గురించి గ్రామస్తుడు మున్సింగ్ మస్రం మాట్లాడుతూ.. ‘‘మా కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేక గత నెలలో గ్రామంలో నిర్వహించిన దుర్గా పూజ వేడుకులకు చందా రూ.151 కంటే ఎక్కువ చెల్లించలేకపోయాం. అందువలన గ్రామ పెద్ద సామాజికంగా బహిష్కరించాలని గ్రామస్తులపై ఒత్తిడి తెచ్చారు. అలాగే పశువులను మేపడానికి , వైద్య ,ఆరోగ్య సేవలను కూడా నిరాకరించారు’’ అని ఆరోపించాడు.
ఇక.. ‘‘కరోనా మహమ్మారి వలన ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది, ఇప్పటికి ఆ సమస్యనుంచి బయటపడలేదు. అందుకే చందా చెల్లించలేక పోయాం, మేము ఈ విషయాన్ని లామ్టా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. తరువాత పోలీసులు ఏకాభిప్రాయంతో మా సమస్యను పరిష్కరించాలని చూశారు కానీ అది జరగలేదు’’ అని మరో బాధితుడు ధన్సింగ్ పార్టే తెలిపారు. కాగా గిరిజన కుటుంబాల సామాజిక బహిష్కరణను విధించడంపై మధ్యప్రదేశ్ హోంమంత్రి డాక్టర్ నరోత్తం మిశ్రా స్పందించారు.
ఆయన మాట్లాడుతూ.. "సబ్ డివిజనల్ ఆఫీసర్, పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి గ్రామస్తులను ఒప్పించటానికి ప్రయత్నిస్తున్నారని, ఒకవేళ గిరిజనులపై బహిష్కరణ ఉపసంహరించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని మీడియాతో అన్నారు.నిక ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేసింది. రైతులు, గిరిజనులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసన సభలో చర్చించడానికి తాము ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం మాత్రం అతి తక్కువ సమయంలో సమావేశాలు ముగించడానికి ప్రయత్నిస్తోందని మండిపడింది. బీజేపీ ఎప్పుడు ప్రజలకు దూరంగానే ఉంటుందని మాజీ మంత్రి సజ్జార్ సింగ్ వర్మ విమర్శించారు. కాగా కొన్ని రోజుల క్రితం 28 ఏళ్ల గిరిజన యువకుడు వాయిదా కట్టలేక సజీవ దహనమైన విషయం విదితమే. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం అతను నిర్భంధ కూలి అని 5000 రూపాయలు చెల్లించక పోవడంతో హత్య చేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment