
ఇలాంటి సరదాలే ప్రమాదాలకు నెలవు
బొంరాస్‌పేట : ఈత ఒక మానవ నైపుణ్యం. జలచరాలతోపాటు ప్రతి ప్రాణికి ఈదటం(ఈత) దేవుడిచ్చిన వరం. పుట్టుకతోనే నీటిలో ఈదే గుణం మానవునికితప్ప ప్రతి జీవికి సహజత్వంగా వస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. అందుకు ప్రత్యేక సాధన, నైపుణ్యం సంపాదించాల్సిందే. ఈదటం రాకపోవడం వల్ల మానవాళికి ప్రమాదాలు, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటున్నాయి.
నేటి ఆధునిక తరానికి ఈదటం (ఈత) అంటే ఏమిటో అర్థంకాని పరిస్థితిని చూసి వెనుకటి తరాలు ఆశ్చర్యపోతున్నాయి. పట్టణాల్లో వేసవి ఉపశమనానికి ప్రజలు స్విమ్మింగ్ ఫూల్స్‌ను ఆ శ్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాతాల్లో బావులు, చెరువులు, కుం టలే స్విమింగ్‌ఫూల్స్. పూర్వం నదులు, వాగులు, చెరువులు దాటాలంటే మనుషులు ప్రత్యేకంగా ఈత నేర్చుకోవలసిందే.
ఈతరం.. ఈతకు దూరం
వర్షాభావ పరిస్థితులు ప్రభావం చూపడంతో భూగర్భజలం అ డుగంటి పోయింది. దీంతో బావులు పాడుబడిపోయాయి. చెరువులు, కుంటలు, వాగులు ఒట్టిపోతున్నాయి. ఈతరం ఈతనేర్చుకునే ఛాన్స్ లేకుండా పోతోంది. కొన్ని ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాం తాల్లో ఊరు పొలిమెరలో బావులు, చెరువులు, కుంటలు నీటితో కళకళలాడేవి. గ్రామీణులు వేసవి ఉపశమనానికి, ఈదటం నేర్చుకోవడానికి ఆశ్రయించే వారు.
ఆడ, మగ, చిన్న, పెద్ద తేడాలు లేకుండా ఈదటం నేర్చుకునేవారు. ఈత రానివారు ఆనాడు అరుదు. కాని నేడు ఈత వచ్చేవారు చాలా అరుదు. అందుకే అప్పుడుప్పుడు వర్షాకాలంలో నీటి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి.
పాటించాల్సిన జాగ్రత్తలు
నీటి వనరులైన చెరువులు, బావులు కుంటలకు తమ పిల్లల్ని తల్లిదండ్రులు దూరంగా ఉంచాలి. ఈత నేర్పాలంటే ప్రత్యేక సాధనాలైన గాలి నింపిన రబ్బరు ట్యూబ్‌లు, బెండ్లు(ఈత నేర్చే కట్టెలు), ప్లాక్టిక్ డబ్బాలను వాడాలి. ఈత కొత్తగా నేర్చేవారు సహాయకులు లేని సమయంలో నీటి లోకి దిగి నేర్చే ప్రయత్నం చేయకూడదు. దమ్ము, మూర్చవ్యాధి ఉన్న వారు నీటి వనరులకు దూరంగా ఉండాలి. మద్యం, తదితర మత్తు పదార్థాలు సేవించి ఈదటం చేయకూడదు. ప్రమాద స్థలాలను గుర్తించి వాటికి దూరంగా పనులు చేసుకోవాలి. సరదా కోసం నీటిలో సాహసాలు, ప్రమాదకర విన్యాసాలు చేయకూడదు. లోతైన ప్రదేశాలున్న నీటి వనరుల్లో చిన్నారులు పరాచకం లాంటి వాటికి దూరంగా ఉండాలి. శుభ్రమైన నీటిలో మాత్రమే ఈదటం ఆరోగ్యకరమని ఈత నిపుణులు సలహాలిస్తున్నారు.
ప్రయోజనాలు
స్వచ్ఛమైన నీటిలో ఈదేవారిలో రోగనిరోధక శక్తి ఎక్కువ అని పరిశోధన ఆధారంగా తెలిసిందంటున్నారు వైద్యులు. రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఈతకు మాత్రమే ఉందని ఆయన సలహా ఇస్తున్నారు. శారీరక దారుఢ్యానికి సర్వరోగ నివారిణిగా ఈత పని చేస్తోంది. ఈదటం వల్ల పొట్ట, నడుమ తదితర అవయవాల్లోని కొవ్వుపదార్థాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. ఈదటంవల్ల చేపలో కనిపించే చురుకుదనం వలే మానవునిలోని అన్ని అవయవాలు పని చేయడంతో రక్త ప్రసరణతో పాటు , గాలిపీల్చే సామర్థ్యం, వద్ధి చెందుతుందని డాకర్లంటున్నారు.
ఊపిరితిత్తుల వ్యాధులు, గుండెపోటు తదితర వ్యాధులకు ఈత దివ్యౌషధంగా పని చేస్తుందని చెబుతున్నారు.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈత సర్వరోగ నివారిణి. నేటి కాలంలో పని ఒత్తిడి వల్ల సమయంలేక వ్యాయామం చేయలేని వారికి ఈత చాలా ఉపకరిస్తుంది. మానవ శరీరంలోని ప్రతి అవయవానికి పని కల్పించి చురుకుగా ఉంచుతుంది. గ్రామాల్లో అక్కడక్కడా బావులు, వ్యవసాయ పొలాల సాగునీటి కాల్వలు గ్రామీణ ప్రజల వేసవి తాపాన్ని తీర్చడమేకాకుండా ఈతను నేర్పుతున్నాయి. పట్టణాల్లో స్విమ్మింగ్‌ఫూల్స్, కృత్రిమ బావులు ఉన్నప్పటికీ అహ్లాదాన్ని పంచుతున్నాయే తప్ప మనిషికి ఈతను నేర్పి ప్రమాదాలనుంచి కాపాడే ప్రయత్నం జరగడంలేదని చెప్పకతప్పదు. – రవీంద్రయాదవ్, మండల వైద్యాధికారి, బొంరాస్‌పేట

