స్వైన్‌ఫ్లూ పంజా | Swine Flu Attack On Telenanga | Sakshi
Sakshi News home page

స్వైన్‌ఫ్లూ పంజా

Published Tue, Jan 29 2019 1:01 AM | Last Updated on Tue, Jan 29 2019 1:08 PM

Swine Flu Attack On Telenanga - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంపై మళ్లీ స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. చలితీవ్రత పెరగడం, రెండ్రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా హెచ్‌1ఎన్‌1 వైరస్‌ మరింత బలపడుతోంది. ఈ పరిణామాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క జనవరిలోనే ఇప్పటి వరకు 150 మందికిపైగా ఫ్లూ బారిన పడ్డారు. రెండ్రోజుల్లోనే 25 మందికి పాజిటివ్‌గా తేలగా.. ఒక్క సోమవారమే 14 కేసులు నమోద వడం ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. గాంధీలో జ్వరం కోసం చికిత్స పొందుతున్న 9 మందికి ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణైంది. మరో నలుగురు అనుమానితులు చికిత్స పొందుతున్నారు. నల్సార్‌ యూనివర్సిటీ విద్యార్థులు నలుగురు (అర్జున్‌ ప్రసాద్‌ కోయిరాల, మనీష్‌సింగ్, సత్యేంద్ర పర్వారీ, రమేష్‌చంద్‌ మీనా) ఫీవర్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యారు. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలోనూ ఒక పాజిటివ్‌ కేసుతో పాటు మరో నలుగురు అనుమానితులు చికిత్స పొందుతున్నారు.

ఓవైపు హెచ్‌1ఎన్‌1 వైరస్‌ రోజురోజుకూ విజృంభిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పరిస్థితిని ముందే ఊహించి అప్రమత్తం కావాల్సిన వైద్య ఆరోగ్య శాఖ.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. అధికారులు కనీస సమీక్ష నిర్వహించడం లేదు. అసలు.. ఫ్లూ నియంత్రణ, రోజువారీ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం ఇదే తరహాలో స్వైన్‌ఫ్లూ విజృంభించినపుడు.. వైద్య ఆరోగ్యశాఖ కరపత్రాలు, స్లైడ్లు, ఫ్లెక్సీలు, మీడియా ప్రకటనలు తదితర పద్దతుల్లో విస్త్రృత ప్రచారం నిర్వహించింది. దీంతో పిల్లలు, పెద్దలు మాస్క్‌లు ధరించి బయటకు వచ్చేవారు. తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం కనీస ప్రచారం, అప్రమత్తత లేకపోవడంతో.. స్వైన్‌ఫ్లూ వచ్చే వరకు కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు.  
 
మంత్రిలేక.. ఇష్టారీతిన 

కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర పూర్తవుతున్నా.. వైద్య ఆరోగ్యశాఖకు మంత్రి లేకపోవడంతో అధికారులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్‌ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయంలో అధికారులు స్వైన్‌ఫ్లూకు సంబంధించిన కనీస సమాచారం ఇవ్వడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై పూర్తిగా విఫలమయ్యారు. చాలాచోట్ల వైద్యాధికారులు అందుబాటులో కూడా ఉండటంలేదు. సెక్రటేరియట్‌లో ఏదో సమావేశం ఉందని.. కిందిస్థాయి సిబ్బందికి చెప్పి. సెక్రటేరియట్‌కు వెళ్లకుండా సొంత పనులు చూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఎవరేం చేస్తున్నారో కూడా అర్థంకాని పరిస్థితి. ప్రజలకు, సిబ్బందికి అందుబాటులో ఉండటంలేదన్న ఆరోపణలున్నాయి. పైపెచ్చు స్వైన్‌ఫ్లూపై ఏం చేయాలో సిబ్బందికి సూచించడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణే.. స్వైన్‌ఫ్లూ విజృంభణకు కారణంగా కనిపిస్తోందని కిందిస్థాయి వైద్య సిబ్బంది విమర్శిస్తున్నారు. 
 
ఈ ఒక్క నెలలోనే 150 మందికి 
శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. రాత్రితోపాటు పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ జనవరి నెలలోనే ఏకంగా 150 వరకు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో కేవలం 12 రోజుల వ్యవధిలోనే 131 కేసులు నమోదవడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. అంతేకాదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు 483 మందిని పరీక్షిస్తే, అందులో 83 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఇవిగాక కొందరు బాధితులు నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి రావడం లేదు. అటు ప్రైవేటు ఆసుపత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నారు. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి గాంధీ, ఫీవర్‌ (కోరంటి) ఆసుపత్రికి వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో శాంపిళ్లను పరీక్షించేందుకు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో మూడు షిఫ్ట్‌ల్లో వైద్య సిబ్బంది పనిచేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల నమోదు కావడం, కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల వరకు పడిపోవడం స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందంటున్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి సాధారణంగా 500–600 మంది రోజూ ఔట్‌ పేషెంట్‌ రోగులు వస్తుంటారు. అలాంటిది 3,4 రోజులుగా రోజూ వెయ్యి మంది రోగులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.  
 
స్వైన్‌ఫ్లూ లక్షణాలు... 

  • తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. 
  • తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. 
  • పిల్లల్లోనైతే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సమస్య ఎదురువుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్‌లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు అవుతాయి. ఒక్కోసారి నడవడమే కష్టమవుతుంది. 
  •  పెద్దల్లోనైతే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీ నొప్పి, కడుపునొప్పి ఉంటుంది. ఆగకుండా వాంతులు అవుతాయి.  

  • తీసుకోవాల్సిన జాగ్రత్తలు:  
  •  జనాలు ఎక్కువగా ఉన్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్‌ సోకే ప్రమాదముంది. 
  • చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్‌ తొడుక్కోవాలి.
  • దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. 
  • రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకడానికి అవకాశముంది. కాబట్టి అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement