swin flu
-
మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభణ
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి స్వైన్ ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. ఈ వ్యాధితో గత నెల రోజుల్లో 169మంది మరణించగా, 4,571మందికి వైరస్ సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్రల్లో ఇది అధికంగా ఉండగా, ఇతర రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈ కేసులు బయటపడుతున్నాయి. తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు పెరిగింది. ఈ నెలలోనే 150మంది దీని వాత పడ్డారు. ఈ మహమ్మారి మన దేశంలో మొదటిసారి బయటపడి పదేళ్లవుతోంది. కానీ పదే పదే ఇది విజృంభించడాన్ని చూస్తుంటే ఈ వ్యాధి విషయంలో మనం నేర్చుకున్నదేమీ లేదని అర్ధమవుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గే వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ వైరస్ విజృంభిస్తుందని తెలియనిదేమీ కాదు. మరీ ముఖ్యంగా ఈసారి ఉష్ణోగ్రతలు ఎన్నడూలేని స్థాయిలో బాగా తగ్గాయి. రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ చాలాచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్ వరకూ వచ్చాయి. కానీ ముందస్తు చర్యల్లో, వ్యాధి ప్రబలుతున్నదని అర్ధమయ్యాక చేపట్టవలసిన చర్యల్లో అధికార యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. కొంచెం హెచ్చుతగ్గులతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటం ఆందో ళన కలిగిస్తుంది. ఈ నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. నిరుడు వివిధ రాష్ట్రాల్లో 14,992 కేసులు బయటపడగా, 1,103మంది మరణించారు. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్సీడీసీ) గణంకాల ప్రకారం దేశంలో ఈ నెల రోజుల్లో బయటపడిన 4,571 స్వైన్‌ఫ్లూ కేసుల్లో 40 శాతం... అంటే 1,856 కేసులు రాజస్తాన్వే. మరణాలు కూడా అక్కడే అధికం. ఇంతవరకూ దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారినపడి మరణించిన 169 మందిలో 72 మంది ఆ రాష్ట్రంవారే. ఢిల్లీలోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. అక్కడ 11 మంది చనిపోయారు. ఈ వైరస్ జాడ కనబడిన తర్వాత తక్షణం నియంత్రణ చర్యలు తీసుకోవా లని, లేనట్టయితే అది శరవేగంగా విస్తరించడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విస్తరణకు దారితీసే అంశాలేమిటో, అది సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలేమిటో విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప ప్రజానీకంలో అవగాహన కలగదు. గతంలో ఇది విజృంభించినప్పుడు ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాయి. అప్పట్లో వివిధ మార్గాల్లో అప్రమ త్తత పెంచారు. కానీ అది సరిపోదు. ప్రతియేటా వర్షాకాలం ప్రారంభమైంది మొదలుకొని వేసవి సమీపించేవరకూ ఈ విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోక తప్పదు. స్వైన్ ఫ్లూను మూడు కేటగిరిలుగా విభజించారు. ఇందులో ఏ, బీ వైరస్ల వల్ల రోగికి తక్షణ ప్రమాదం ఉండదు. మూడో కేటగిరి వైరస్ సోకినవారికి మాత్రం అత్యవసర చికిత్స అవసర మవుతుందని, వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యాధి తీవ్రత ఉన్నదని ప్రకటించిన ప్రాంతాల్లో ఎక్కువ జనసమ్మర్థం ఉండేచోటకు వెళ్లరాదని కూడా వారి సలహా. అసలు పారిశుద్ధ్యం సక్రమంగా ఉంటే వ్యాధుల విస్తరణ ఇంతగా ఉండదు. అది కొరవ డినప్పుడే విషజ్వరాలైనా, మరే ఇతర అంటువ్యాధులైనా కాటేస్తాయి. ఆ విషయంలో కూడా చర్యలు అవసరమని గుర్తించాలి. స్వైన్‌ఫ్లూ అయినా, మరేవిధమైన ప్రమాదకర అంటువ్యాధి అయినా ప్రబలడం మొదలైందంటే దాని నష్టం బహుముఖంగా ఉంటుంది. వెనువెంటనే కనబడే ప్రాణనష్టం మాత్రమే కాదు... సామాజికంగా, ఆర్థికంగా కూడా వాటి ప్రభావం ఉంటుంది. సకాలంలో చర్యలు తీసుకోనట్టయితే ప్రభుత్వాలు ఆసుపత్రి సౌకర్యాల కోసం, ఔషధాల కోసం భారీ మొత్తంలో వ్యయం చేయాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగేకొద్దీ ఉత్పాదకత ఆమేరకు కుంటుబడుతుంది. విదేశీ యాత్రీ కుల రాక, వారివల్ల వచ్చే రాబడి తగ్గుతుంది. కనుక ఈ విషయంలో శాశ్వత ప్రాతిపదికన చర్యలు తప్పనిసరి. అంటువ్యాధులు ప్రబలినప్పుడు పైనుంచి కిందివరకూ ఎవరికి ఏఏ బాధ్యతలుం టాయో తెలియజెప్పే మాన్యువల్ రూపొందాలి. మన దేశంలో సాంక్రమిక వ్యాధుల చట్టం, పశు సంపద దిగుమతి చట్టం వంటివి బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన చట్టాలు. వాటి స్థానంలో వర్త మాన అవసరాలకు తగ్గట్టు సమర్ధవంతమైన కొత్త చట్టాలు రూపొందించాల్సిన అవసరాన్ని మన పాలకులు ఇంకా గుర్తించలేదు. ఒక రాష్ట్రంలో వ్యాధి సోకిందని తెలియగానే వెనువెంటనే అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేయడం, ఎటువంటి చర్యలు అమల్లోకి రావలసి ఉన్నదో వివరిస్తూ సూచ నలు జారీచేయడం జరగాలి. ఏ కాలంలో ఏఏ వ్యాధులు ప్రబలే అవకాశమున్నదో గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమే అయినా, అంతకుమించి బాధ్యతలను నిర్దిష్టంగా నిర్ణయిం చడం అవసరం. స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటే తక్కువ వ్యవధిలో ఎక్కువమంది ప్రజ లకు సమాచారం చేరేసే వీలుంటుంది. నిజానికి నిరుడు ఆగస్టులోనే దేశంలో ఈ స్వైన్‌ఫ్లూ వైరస్ బయటపడింది. అప్పటినుంచీ ఒక్కొక్క రాష్ట్రాన్నీ తాకుతూ వస్తోంది. కానీ ప్రభుత్వాలు సకాలంలో పకడ్బందీ చర్యలు తీసు కోవడంలో విఫలమయ్యాయి. అదే జరిగి ఉంటే ఈ అంటువ్యాధి నియంత్రణ సాధ్యమయ్యేది. 2009 తర్వాత ఈ స్థాయిలో వైరస్ విజృంభించడం ఇదే మొదటిసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పట్లోనే చెప్పింది. అయిదేళ్లలోపు పిల్లల్లోనూ, గర్భిణుల్లోనూ, సీనియర్ సిటిజన్లలోనూ ఈ వ్యాధి ప్రభావం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతారు. మిగిలినవారికి సోకినా ప్రమాద తీవ్రత తక్కువ ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పుల తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల్ని ఆశ్రయించాలని విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలకు దీనిపై అవగాహన ఏర్పడుతుంది. తెలంగాణలో మూడేళ్లక్రితం స్వైన్ ఫ్లూ సోకినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ చురుగ్గా వ్యవహరించి వివిధ రకాల చర్యలు తీసుకుంది. కానీ ఈసారి మాత్రం చేష్టలుడిగి ఉండిపోయింది. అన్ని స్థాయిల్లోనూ జవాబుదారీతనాన్ని స్పష్టంగా నిర్ణయించిప్పుడే ఇలాంటి నిర్లక్ష్యం విరగడవుతుంది. -
స్వైన్‌ఫ్లూ పంజా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై మళ్లీ స్వైన్‌ఫ్లూ పంజా విసురుతోంది. చలితీవ్రత పెరగడం, రెండ్రోజులుగా కురుస్తున్న చిరుజల్లుల కారణంగా హెచ్1ఎన్1 వైరస్ మరింత బలపడుతోంది. ఈ పరిణామాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క జనవరిలోనే ఇప్పటి వరకు 150 మందికిపైగా ఫ్లూ బారిన పడ్డారు. రెండ్రోజుల్లోనే 25 మందికి పాజిటివ్‌గా తేలగా.. ఒక్క సోమవారమే 14 కేసులు నమోద వడం ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సూచిస్తోంది. గాంధీలో జ్వరం కోసం చికిత్స పొందుతున్న 9 మందికి ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణైంది. మరో నలుగురు అనుమానితులు చికిత్స పొందుతున్నారు. నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు నలుగురు (అర్జున్ ప్రసాద్ కోయిరాల, మనీష్‌సింగ్, సత్యేంద్ర పర్వారీ, రమేష్‌చంద్ మీనా) ఫీవర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలోనూ ఒక పాజిటివ్ కేసుతో పాటు మరో నలుగురు అనుమానితులు చికిత్స పొందుతున్నారు. ఓవైపు హెచ్1ఎన్1 వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. పరిస్థితిని ముందే ఊహించి అప్రమత్తం కావాల్సిన వైద్య ఆరోగ్య శాఖ.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. అధికారులు కనీస సమీక్ష నిర్వహించడం లేదు. అసలు.. ఫ్లూ నియంత్రణ, రోజువారీ పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మూడేళ్ల క్రితం ఇదే తరహాలో స్వైన్‌ఫ్లూ విజృంభించినపుడు.. వైద్య ఆరోగ్యశాఖ కరపత్రాలు, స్లైడ్లు, ఫ్లెక్సీలు, మీడియా ప్రకటనలు తదితర పద్దతుల్లో విస్త్రృత ప్రచారం నిర్వహించింది. దీంతో పిల్లలు, పెద్దలు మాస్క్‌లు ధరించి బయటకు వచ్చేవారు. తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈసారి మాత్రం కనీస ప్రచారం, అప్రమత్తత లేకపోవడంతో.. స్వైన్‌ఫ్లూ వచ్చే వరకు కూడా ప్రజలు గుర్తించలేకపోతున్నారు. మంత్రిలేక.. ఇష్టారీతిన కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర పూర్తవుతున్నా.. వైద్య ఆరోగ్యశాఖకు మంత్రి లేకపోవడంతో అధికారులకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. హైదరాబాద్ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యాలయంలో అధికారులు స్వైన్‌ఫ్లూకు సంబంధించిన కనీస సమాచారం ఇవ్వడం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంపై పూర్తిగా విఫలమయ్యారు. చాలాచోట్ల వైద్యాధికారులు అందుబాటులో కూడా ఉండటంలేదు. సెక్రటేరియట్లో ఏదో సమావేశం ఉందని.. కిందిస్థాయి సిబ్బందికి చెప్పి. సెక్రటేరియట్‌కు వెళ్లకుండా సొంత పనులు చూసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఎవరేం చేస్తున్నారో కూడా అర్థంకాని పరిస్థితి. ప్రజలకు, సిబ్బందికి అందుబాటులో ఉండటంలేదన్న ఆరోపణలున్నాయి. పైపెచ్చు స్వైన్‌ఫ్లూపై ఏం చేయాలో సిబ్బందికి సూచించడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణే.. స్వైన్‌ఫ్లూ విజృంభణకు కారణంగా కనిపిస్తోందని కిందిస్థాయి వైద్య సిబ్బంది విమర్శిస్తున్నారు. ఈ ఒక్క నెలలోనే 150 మందికి శీతాకాలంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తుంది. రాత్రితోపాటు పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఫ్లూ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ జనవరి నెలలోనే ఏకంగా 150 వరకు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో కేవలం 12 రోజుల వ్యవధిలోనే 131 కేసులు నమోదవడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. అంతేకాదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు 483 మందిని పరీక్షిస్తే, అందులో 83 మందికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు తేలింది. ఇవిగాక కొందరు బాధితులు నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడంతో అవి రికార్డుల్లోకి రావడం లేదు. అటు ప్రైవేటు ఆసుపత్రులు స్వైన్‌ఫ్లూ భయం పెట్టి వేలకు వేలు గుంజుతున్నారు. చివరకు అక్కడ తగ్గకపోవడంతో కొన్ని కేసులు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి గాంధీ, ఫీవర్ (కోరంటి) ఆసుపత్రికి వస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో శాంపిళ్లను పరీక్షించేందుకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో మూడు షిఫ్ట్‌ల్లో వైద్య సిబ్బంది పనిచేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 12 నుంచి 15 డిగ్రీల నమోదు కావడం, కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల వరకు పడిపోవడం స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందంటున్నారు. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి సాధారణంగా 500–600 మంది రోజూ ఔట్ పేషెంట్ రోగులు వస్తుంటారు. అలాంటిది 3,4 రోజులుగా రోజూ వెయ్యి మంది రోగులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఐదేళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు... తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. జ్వరం ఒక్కోసారి అధికంగా ఉంటుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. పిల్లల్లోనైతే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన శ్వాస సమస్య ఎదురువుతుంది. ఒక్కోసారి చర్మం బ్లూ లేదా గ్రే కలర్లోకి మారుతుంది. దద్దుర్లు వస్తాయి. కొన్ని సందర్భాల్లో వాంతులు అవుతాయి. ఒక్కోసారి నడవడమే కష్టమవుతుంది. పెద్దల్లోనైతే కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఛాతీ నొప్పి, కడుపునొప్పి ఉంటుంది. ఆగకుండా వాంతులు అవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: జనాలు ఎక్కువగా ఉన్న చోట తిరగకుండా చూసుకోవాలి. గుంపుల్లో తిరిగితే ఒకరి నుంచి మరొకరికి స్వైన్‌ఫ్లూ వైరస్ సోకే ప్రమాదముంది. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసకోవాలి. అవకాశముంటే రక్షణ కవచంగా గ్లౌవ్స్ తొడుక్కోవాలి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, అధిక జ్వరం ఉండి, స్వైన్‌ఫ్లూ అనుమానం వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. రక్తపోటు, స్థూలకాయం, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి స్వైన్‌ఫ్లూ త్వరగా సోకడానికి అవకాశముంది. కాబట్టి అలాంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. -
స్వైన్‌ఫ్లూ పంజా విసరకుండా చర్యలు
శ్రీకాకుళం అర్బన్: స్వైన్‌ఫ్లూ వ్యాధి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.చెంచయ్య చెప్పారు. వ్యాధి ప్రబలకుండా ఉం డేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం వైద్యాధికారులు, డె మో అధికారులు, ఎపిడిమిక్ సిబ్బం దితో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ జిల్లాలో ఎనిమిది స్వైన్‌ఫ్లూ వ్యాధి కేసులు నమోదయ్యావన్నారు. వీటిలో నాలుగు శ్రీకాకుళం అర్బన్ ప్రాంతంలో, మిగిలిన నాలుగు రూర ల్ ప్రాంతాల్లో గుర్తించామన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వారికి విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లోనే వైద్యసేవలు అందించడం జరుగుతోందన్నారు. జిల్లాలోస్వైన్ఫ్లూ వ్యాధితో బాధపడే వారికి వైద్యసేవలు అందించేందుకు రిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. వ్యాధి వ్యాపించకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, మార్కెట్ కూడళ్ల వద్ద ఫ్లెక్సీలు అతికించి, కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీల్లోనూ, సామాజిక ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ వ్యాధి మందులను అందుబాటులో ఉంచామన్నారు. ఈ వ్యాధిపై ఏఎన్ఎం, ఆశావర్కర్లు, ఫీల్డ్ వర్కర్లకు అవగాహన కల్పించామని, వారు గ్రామీణస్థాయి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆడియో విజువల్స్‌ను ప్రతి గంటకు ఒకసారి ఆయా ముఖ్య కూడళ్ల వద్ద వినిపించడం జరుగుతోందన్నారు. సమీక్షా సమావేశంలో డాక్టర్ గిరిధర్, డీఎం వీర్రాజు, డెమో మురళి పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ విజృంభణ
-
మహిళలకు ‘ఫ్లూ’ భయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. జిల్లాలతో పోలిస్తే నగరంలోనే అత్యధిక కేసులు నమోదు అవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. బాధితుల్లో 50 శాతం మంది 45 ఏళ్లు దాటిన మహిళలే కావడం విశేషం. పురుషులతో పోలిస్తే మహిళల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల ఫ్లూ సులభంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంత కాలంగా ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేసిన హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాలిఫోర్నియా స్ట్రెయిన్‌గా పిలవ బడే ‘మిషిగావ్ స్ట్రెయిన్’గా రూపాంతరం చెందినట్లు ఇటీవల పుణే వైరాలజీ విభాగం గుర్తించింది. హెచ్1ఎన్1 వైరస్‌తో పోలిస్తే ఇది మరింత శక్తివంతంగా ఉన్నట్లు నిర్ధారించారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, గర్భిణులు, చిన్నారులపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతోంది. గ్రేటర్‌లోనే అత్యధిక కేసులు.. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 12 మంది స్వైన్‌ఫ్లూ బాధితులు చికిత్స పొందుతుండగా, మరో ఆరుగురు అనుమానితులకు వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,876 ఫ్లూ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే 1,450 కేసులు నమోదైనట్లు సమాచారం. ఇప్పటి వరకు 40 మంది చనిపోగా, వీరిలో హైదరాబాద్‌కు చెందిన వారే 30 మంది ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఒకరి నుంచి మరొకరికి ఠి ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ రోగి శరీరం నుంచి గాలిలోకి ప్రవేశిస్తుంది. ఠి ఇలా ఒకసారి బయటకు వచ్చిన వైరస్ వాతావరణంలో రెండు గంటలకుపైగా జీవిస్తుంది. ఠి సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కనిపించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ఠి ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు వస్తాయి. ఠి కళ్లవెంట నీరుకారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఠి ముక్కుకు మాస్కు ధరించడంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ఠి వీలైనంత వరకు నీరు ఎక్కువ తాగాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. ఠి సాధ్యమైనంత వరకు తీర్థయాత్రలకు వెళ్లకపోవడమే ఉత్తమం. – డాక్టర్ మనోహర్, డైరెక్టర్, నిమ్స్ -
స్వైన్ ఫ్లూతో వర్ధన్నపేట ఏసీపీ మృతి!
-
వరంగల్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసు
రఘునాథపల్లి: వరంగల్ జిల్లాలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. తాజాగా రఘునాథపల్లి మండలంలోని ఇబ్రహీంపూర్లో ఉప్పోజు స్వరూప (42) అనే మహిళకు స్వైన్‌ప్లూ సోకింది. రెండు రోజుల క్రితం ఆమెకు జ్వరం, జలుబు, దగ్గు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని కిమ్స్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు జరిపి స్వరూపకు స్వైన్‌ప్లూ సోకినట్లుగా నిర్ధారించారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యశాఖ డైరెక్టర్‌కు తెలిపారు. అక్కడి నుంచి వరంగల్ వైద్యాధికారులకు సమాచారం అందించగా.. జిల్లా అధికారులు అప్రమత్తమై గురువారం ఆ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామస్తుల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.