దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి స్వైన్ ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. ఈ వ్యాధితో గత నెల రోజుల్లో 169మంది మరణించగా, 4,571మందికి వైరస్ సోకిందని గణాంకాలు చెబుతున్నాయి. రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్రల్లో ఇది అధికంగా ఉండగా, ఇతర రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈ కేసులు బయటపడుతున్నాయి. తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు పెరిగింది. ఈ నెలలోనే 150మంది దీని వాత పడ్డారు. ఈ మహమ్మారి మన దేశంలో మొదటిసారి బయటపడి పదేళ్లవుతోంది. కానీ పదే పదే ఇది విజృంభించడాన్ని చూస్తుంటే ఈ వ్యాధి విషయంలో మనం నేర్చుకున్నదేమీ లేదని అర్ధమవుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గే వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ వైరస్ విజృంభిస్తుందని తెలియనిదేమీ కాదు. మరీ ముఖ్యంగా ఈసారి ఉష్ణోగ్రతలు ఎన్నడూలేని స్థాయిలో బాగా తగ్గాయి.
రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ చాలాచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్ వరకూ వచ్చాయి. కానీ ముందస్తు చర్యల్లో, వ్యాధి ప్రబలుతున్నదని అర్ధమయ్యాక చేపట్టవలసిన చర్యల్లో అధికార యంత్రాంగాలు విఫలమవుతున్నాయి. కొంచెం హెచ్చుతగ్గులతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉండటం ఆందో ళన కలిగిస్తుంది. ఈ నిర్లక్ష్యం కారణంగా దేశవ్యాప్తంగా వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. నిరుడు వివిధ రాష్ట్రాల్లో 14,992 కేసులు బయటపడగా, 1,103మంది మరణించారు. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం(ఎన్‌సీడీసీ) గణంకాల ప్రకారం దేశంలో ఈ నెల రోజుల్లో బయటపడిన 4,571 స్వైన్‌ఫ్లూ కేసుల్లో 40 శాతం... అంటే 1,856 కేసులు రాజస్తాన్‌వే. మరణాలు కూడా అక్కడే అధికం. ఇంతవరకూ దేశవ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ బారినపడి మరణించిన 169 మందిలో 72 మంది ఆ రాష్ట్రంవారే.
ఢిల్లీలోనూ వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. అక్కడ 11 మంది చనిపోయారు. ఈ వైరస్ జాడ కనబడిన తర్వాత తక్షణం నియంత్రణ చర్యలు తీసుకోవా లని, లేనట్టయితే అది శరవేగంగా విస్తరించడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విస్తరణకు దారితీసే అంశాలేమిటో, అది సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలేమిటో విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప ప్రజానీకంలో అవగాహన కలగదు. గతంలో ఇది విజృంభించినప్పుడు ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాయి. అప్పట్లో వివిధ మార్గాల్లో అప్రమ త్తత పెంచారు. కానీ అది సరిపోదు. ప్రతియేటా వర్షాకాలం ప్రారంభమైంది మొదలుకొని వేసవి సమీపించేవరకూ ఈ విషయంలో ప్రభుత్వాలు చర్యలు తీసుకోక తప్పదు. స్వైన్ ఫ్లూను మూడు కేటగిరిలుగా విభజించారు. ఇందులో ఏ, బీ వైరస్‌ల వల్ల రోగికి తక్షణ ప్రమాదం ఉండదు. మూడో కేటగిరి వైరస్ సోకినవారికి మాత్రం అత్యవసర చికిత్స అవసర మవుతుందని, వెంటనే వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. వ్యాధి తీవ్రత ఉన్నదని ప్రకటించిన ప్రాంతాల్లో ఎక్కువ జనసమ్మర్థం ఉండేచోటకు వెళ్లరాదని కూడా వారి సలహా. అసలు పారిశుద్ధ్యం సక్రమంగా ఉంటే వ్యాధుల విస్తరణ ఇంతగా ఉండదు. అది కొరవ డినప్పుడే విషజ్వరాలైనా, మరే ఇతర అంటువ్యాధులైనా కాటేస్తాయి. ఆ విషయంలో కూడా చర్యలు అవసరమని గుర్తించాలి.
స్వైన్‌ఫ్లూ అయినా, మరేవిధమైన ప్రమాదకర అంటువ్యాధి అయినా ప్రబలడం మొదలైందంటే దాని నష్టం బహుముఖంగా ఉంటుంది. వెనువెంటనే కనబడే ప్రాణనష్టం మాత్రమే కాదు... సామాజికంగా, ఆర్థికంగా కూడా వాటి ప్రభావం ఉంటుంది. సకాలంలో చర్యలు తీసుకోనట్టయితే ప్రభుత్వాలు ఆసుపత్రి సౌకర్యాల కోసం, ఔషధాల కోసం భారీ మొత్తంలో వ్యయం చేయాల్సి ఉంటుంది. వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగేకొద్దీ ఉత్పాదకత ఆమేరకు కుంటుబడుతుంది. విదేశీ యాత్రీ కుల రాక, వారివల్ల వచ్చే రాబడి తగ్గుతుంది. కనుక ఈ విషయంలో శాశ్వత ప్రాతిపదికన చర్యలు తప్పనిసరి. అంటువ్యాధులు ప్రబలినప్పుడు పైనుంచి కిందివరకూ ఎవరికి ఏఏ బాధ్యతలుం టాయో తెలియజెప్పే మాన్యువల్ రూపొందాలి. మన దేశంలో సాంక్రమిక వ్యాధుల చట్టం, పశు సంపద దిగుమతి చట్టం వంటివి బ్రిటిష్ పాలకులు తీసుకొచ్చిన చట్టాలు. వాటి స్థానంలో వర్త మాన అవసరాలకు తగ్గట్టు సమర్ధవంతమైన కొత్త చట్టాలు రూపొందించాల్సిన అవసరాన్ని మన పాలకులు ఇంకా గుర్తించలేదు. ఒక రాష్ట్రంలో వ్యాధి సోకిందని తెలియగానే వెనువెంటనే అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేయడం, ఎటువంటి చర్యలు అమల్లోకి రావలసి ఉన్నదో వివరిస్తూ సూచ నలు జారీచేయడం జరగాలి. ఏ కాలంలో ఏఏ వ్యాధులు ప్రబలే అవకాశమున్నదో గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమే అయినా, అంతకుమించి బాధ్యతలను నిర్దిష్టంగా నిర్ణయిం చడం అవసరం. స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటే తక్కువ వ్యవధిలో ఎక్కువమంది ప్రజ లకు సమాచారం చేరేసే వీలుంటుంది.
నిజానికి నిరుడు ఆగస్టులోనే దేశంలో ఈ స్వైన్‌ఫ్లూ వైరస్ బయటపడింది. అప్పటినుంచీ ఒక్కొక్క రాష్ట్రాన్నీ తాకుతూ వస్తోంది. కానీ ప్రభుత్వాలు సకాలంలో పకడ్బందీ చర్యలు తీసు కోవడంలో విఫలమయ్యాయి. అదే జరిగి ఉంటే ఈ అంటువ్యాధి నియంత్రణ సాధ్యమయ్యేది. 2009 తర్వాత ఈ స్థాయిలో వైరస్ విజృంభించడం ఇదే మొదటిసారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పట్లోనే చెప్పింది. అయిదేళ్లలోపు పిల్లల్లోనూ, గర్భిణుల్లోనూ, సీనియర్ సిటిజన్లలోనూ ఈ వ్యాధి ప్రభావం ఎక్కువని వైద్య నిపుణులు చెబుతారు. మిగిలినవారికి సోకినా ప్రమాద తీవ్రత తక్కువ ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పుల తీవ్రంగా ఉన్నప్పుడు వైద్యుల్ని ఆశ్రయించాలని విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రజలకు దీనిపై అవగాహన ఏర్పడుతుంది. తెలంగాణలో మూడేళ్లక్రితం స్వైన్ ఫ్లూ సోకినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ చురుగ్గా వ్యవహరించి వివిధ రకాల చర్యలు తీసుకుంది. కానీ ఈసారి మాత్రం చేష్టలుడిగి ఉండిపోయింది. అన్ని స్థాయిల్లోనూ జవాబుదారీతనాన్ని స్పష్టంగా నిర్ణయించిప్పుడే ఇలాంటి నిర్లక్ష్యం విరగడవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment