ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి
సాక్షి, హైదరాబాద్: గత కొద్దిరోజులుగా ఫీవర్ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. నగరంలో స్వైన్ ఫ్లూ తీవ్రత అధికంగా ఉండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ఏమాత్రం ఒంట్లో నలతగా అన్పించినా, సాధారణ జలుబు చేసినా స్వైన్ ఫ్లూ వచ్చిందేమో అని ఆందోళనతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు గాంధీలో స్వైన్ ఫ్లూ కేసులు అధికమవడంతో అక్కడికి వెళ్లడానికి సాధారణ రోగులు జంకుతున్నారు. వీరంతా ఫీవర్ ఆస్పత్రికి వస్తుండడంతో ఇక్కడ రద్దీ విపరీతంగా పెరిగింది.
ఓపీలో వెయ్యికిపైగా రోగులు..
సాధారణ రోజుల్లో రోజుకు 400 నుంచి 700 మంది రోగులు ఫీవర్‌కు వస్తారు. అలాంటిది గత వారం రోజులుగా రోజుకు 1100 మందికి తగ్గకుండా ఔట్ పేషంట్ విభాగంలో చికిత్సల కోసం వస్తున్నారు. వీరిలో చాలా మంది జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చే వారే ఉంటున్నారు. సాయంత్రం 3 గంటల వరకు ఆస్పత్రి ఆవరణలో ఎక్కడ చూసినా రోగులే కనిపిస్తున్నారు.
స్వైన్‌ఫ్లూ రోగులకు ప్రత్యేక వార్డు...
రోగుల తాకిడి పెరగడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ స్వైన్ ఫ్లూ అనుమానిత కేసులకు చికిత్సలు అందించేందుకై ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయించారు. అదే విధంగా ఫ్లూ పాజిటివ్‌గా వచ్చిన కేసులను సాధారణ వార్డులకు దూరంగా ఉన్న 7వ వార్డులోకి మార్చి ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నారు. స్వైన్ ఫ్లూ రోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ వైపు స్వైన్‌ఫ్లూ కేసులతోపాటు సాధారణ రోగులు, కుక్కకాటు బాధితులు పెద్దఎత్తున చికిత్సల కోసం వస్తుండడంతో సిబ్బందికి క్షణం తీరికలేక అలసిపోతున్నారు.