‘స్వైన్’.. వణికించెన్ !
షాద్‌నగర్‌లో ఒకరి మృతి
స్వైన్‌ఫ్లూ పాలమూరు పట్టణవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. ఇటీవల జిల్లా ప్రధాన ఆస్పత్రికి చెందిన ఇద్దరు స్టాఫ్‌నర్సులతో పాటు మరో 12మంది స్వైన్‌ఫ్లూ బారినపడ్డారు. తాజాగా మంగళవారం షాద్‌నగర్‌లో ఒకరు దీనిబారిన పడి మరణించారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు జంకుతున్నారు. క్లాస్‌రూముల్లో ఇది త్వరగా వ్యాపించే అవకాశం ఉండటంతో విద్యార్థులు మాస్క్‌లు ధరించి పాఠశాలలకు వెళ్తున్నారు.
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: స్వైన్‌ఫ్లూ జిల్లావాసులను వణికిస్తోంది.. ఇటీవల పాలమూరు పట్టణవాసులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ అంటువ్యాధి జిల్లాకు విస్తరించింది. స్వైన్‌ఫ్లూతో షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మృత్యువాతపడ్డాడు. దీంతో తీవ్ర కలకలం చెలరేగింది. జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన ఒకే కుటుంబంలోని ఐదుగురు స్వైన్‌ఫ్లూబారిన పడటం, కేవలం రెండునెలల్లోనే 14 కేసులు నమోదుకావడంతో పట్టణవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
దీనికితోడు వెనువెంటనే జిల్లా ఆస్పత్రిలో ఇద్దరు సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో స్వైన్‌ప్లూ నిర్ధారణకు కిట్‌ల కొరత వేధిస్తోంది. సామగ్రి హైదరాబాద్ నుంచి సరఫరా కావడం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. జిల్లాలో స్వైన్‌ఫ్లూ భయం పట్టుకుంది. విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాలన్నా మాస్కులు ధరించి వెళ్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు జంకుతున్నారు.
వాతావరణంలో మార్పుల కారణంగా చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు బారినపడుతున్నారు. ఇదిలాఉండగా, ప్రతినెలా పీహెచ్‌సీల పరిధిలో వైద్యులు సంబంధిత పాఠశాలల్లో వైద్యశిబిరాలు నిర్వహించాల్సి ఉన్నా..ఎక్కడా నిర్వహించడం లేదు. విద్యార్థులకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కనీస అవగాహన కార్యక్రమాలను మరిచిపోయారు. వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడి పాఠశాలల్లో విద్యార్థులకు స్వైన్‌ఫ్లూ, ఇతర వ్యాధులపై అవగాహన కల్పిస్తామని డీఈఓ ఎన్.రాజేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైద్యశిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు.
అందుబాటులో స్వైన్‌ప్లూ మందులు
స్వైన్‌ఫ్లూ మందులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్యులు సూచిస్తున్నారు. మొత్తం 500 మాత్రలకు ప్రతిపాదనలు పంపగా, 250 పంపించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ గోవింద్ వాగ్మోరే తెలిపారు. జిల్లావ్యాప్తంగా స్వైన్‌ఫ్లూ, ఇతర సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలు పరిశుభ్రత పాటించాలని సూచించారు.