స్వైన్‌ఫ్లూపై కదలిక
కర్నూలు(హాస్పిటల్) : తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర జిల్లాలకు పరిమితమైన స్వైన్‌ఫ్లూ జిల్లాకు తాకింది. సోమవారం ఆదోని మండలంలో ఓ గర్భిణి స్వైన్‌ఫ్లూతో మృతిచెందడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్‌లో మూడు వార్డులను బాధితుల కోసం కేటాయించారు. ఆయా వార్డులకు నర్సింగ్ సిబ్బందిని నియమించారు.
ఈ మేరకు ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణానాయక్ ఆయా వార్డులను పరిశీలించారు. మందులు, ఆక్సిజన్ సిలిండర్లను వార్డులో ఏర్పాటు చేయాలని చెప్పారు. స్వైన్‌ప్లూ అనుమానిత కేసులు వచ్చే అవకాశం ఉండటంతో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మొదటి విడతగా 10 బెడ్‌లను ఏర్పాటు చేశారు.
స్వైన్‌ఫ్లూ నివారణ కమిటీ ఏర్పాటు...
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్‌ఫ్లూ నివారణ కమిటీని నియమించారు. కమిటీలో ఆసుపత్రిలోని ఊపిరితిత్తుల విభాగం అధిపతి డాక్టర్ శైలజ, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ పి.సుధాకర్, చిన్నపిల్లల వైద్యుల విభాగం అధిపతి డాక్టర్ జి.సుధాకర్, మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ స్వర్ణలత, ఈఎన్‌టీ విభాగం అధిపతి డాక్టర్ శేషప్రసాద్‌లు కమిటీలో ఉన్నారు.
నేడు ప్రత్యేక సమావేశం...
బుధవారం ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ ఛాం బర్‌లో స్వైన్‌ఫ్లూ నివారణ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. స్వైన్‌ఫ్లూపై తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలు, సౌకర్యాల కల్పన తదితర విషయాలపై చర్చిస్తున్నట్లు ఆసుపత్రి అధికారులు వెల్లడించారు.