సిండి‘కేట్లు’ | syndicate leaders in shops allocation | Sakshi
Sakshi News home page

సిండి‘కేట్లు’

Published Tue, Jun 24 2014 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 9:16 AM

సిండి‘కేట్లు’

సిండి‘కేట్లు’

సాక్షి, ఖమ్మం: ముందస్తు సిండి‘కేట్లు’.. మద్యం మాఫియాకు కలిసివచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా చక్రం తప్పి మళ్లీ తాము అనుకున్నట్లుగానే మద్యం దుకాణాలను చేజిక్కించుకున్నారు మద్యం డాన్లు. దుకాణాల వారీగా మద్యం మాఫియా లీడర్లు సిండికేట్ చేయడంతో ఎక్కడా అనుమానం రాకుండా డ్రాలో దుకాణాల కేటాయింపు జరిగిపోయింది. ప్రధానంగా ఖమ్మం డివిజన్ పరిధిలో చాలా దుకాణాలు వీరికే దక్కాయి.
 జిల్లాలో మొత్తం 147 దుకాణాలకుగాను వీఎంబంజరలో రెండు, గుండాలలో ఒకటి, రుద్రంపూర్‌లో రెండు దుకాణాలు మినహా 142 దుకాణాలకు జిల్లా వ్యాప్తంగా 3,837 దరఖాస్తులు వచ్చాయి.

ఇందులో చాలా వరకు సండికేట్‌తో వచ్చినవే. లాటరీ ద్వారా దుకాణాలు కేటాయింపు పారదర్శకంగా జరుగుతుందని ఎక్త్సెజ్ శాఖ ప్రకటించినా సిండికేట్ దారులు అందివచ్చిన అడ్డదారులను అవకాశంగా మలుచుకొని మళ్లీ మద్యం వ్యాపారంలో పాగా వేశారు. గతంలో దుకాణాలు దక్కించుకున్న వారంతా ముందస్తుగా సిండికేట్‌గా ఏర్పడి దుకాణాల వారీగా టెండర్లు దాఖలు చేశారు. ఇదంతా మద్యం మాఫియా లీడర్ల కనుసన్నల్లోనే జరగడంతో టెండర్ల సమయంలో ఎలాంటి గడబిడా లేకుండా ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం, కొత్తగూడెం యూనిట్ల పరిధిలో గతంలో ఈ వ్యాపారంలో అనుభవం ఉన్నవారు దుకాణాల వారీగా వారి ఆడ్రస్‌లు సేకరించినట్లు సమాచారం.

వీరందరితో డ్రాకు మూడు రోజుల ముందుగానే మద్యం డాన్లు చర్చలు జరిపి సిండికేట్ చేసినట్లు తెలిసింది. సిండికేట్లో లేకుండా టెండర్ వేసి దుకాణం దక్కించుకున్న వారు వ్యాపారం చేయడం ఇష్టం లేకపోతే వారితో ‘గుడ్ విల్’ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక తమ బినామీలు, ఇతర వ్యక్తుల్లో ఎవరికి దక్కినా అంతా సిండికేటేనని రెండు ప్రాంతాలకు చెందిన పాత వ్యాపారులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో డ్రాలో అనుకున్నట్లుగానే వారికే దుకాణాలు దక్కాయి. ప్రధానంగా ఖమ్మం నగరం, చుట్టు పక్కల మండలాల్లో ఎక్కువగా ఈ దుకాణాలు మద్యం మాఫియా లీడర్లు చక్రం తిప్పినట్లుగానే ఈ తతంగం సాఫీగా ముగిసింది.
 
ఒక్కొక్కరి చేతిలోనే గుర్తింపు పత్రాలు..
టెండర్ దాఖలు సమయంలో ప్రతి దారఖాస్తుదారుడికి వారి ఫొటోతో ఉన్న గుర్తింపు పత్రం (హాల్ టికెట్) ఇస్తారు. దీన్ని చూపిస్తేనే వారిని డ్రా కేంద్రంలోకి అనుమతిస్తారు. అయితే ఎవరు టెండర్ దాఖలు చేసినా వారి దగ్గరే ఇవి ఉండాలి. కానీ డ్రా కేంద్రమైన సీక్వెల్ రిసార్ట్స్ సమీపంలో ఇవి ఒక్కొక్కరి దగ్గర ఐదు నుంచి పదివరకు ఉన్నాయి. దుకాణాల వారీగా మద్యం మాఫియా లీడర్ల అనుచరులు ఇవి తమవద్దే పెట్టుకొని డ్రా సమయంలో దరఖాస్తుదారులకు ఇచ్చి పంపారు.

ముందస్తుగానే మద్యం డాన్లు సిండికేట్ చేయడంతో ఇలా దరాఖాస్తుదారుల హాల్‌టికెట్లు అన్నీ వారి అనుచరులు తమ వద్దే పెట్టుకున్నారు. డ్రా ముగియగానే దుకాణం దక్కించుకున్న వారు మళ్లీ అనుచరుల వద్దకే వచ్చి చెప్పగా, ఇది వెంటనే తమ నేతలకు సమాచారం చేరవేశారు. మద్యం సిండికేట్‌లో భాగంగా గతంలో దుకాణాలు దక్కించుకున్న వారి బంధువులు, ఆ షాపుల్లో పనిచేసిన వారితో ఎక్కువగా టెండర్లు వేయించారు. అంతేకాకుండా సీక్వెల్ రిసార్ట్స్ సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో మద్యం డాన్లు మకాం వేసి డ్రా తీస్తున్న తీరు, ఏ దుకాణం ఎవరికి దక్కింది అనే విషయాలను తమ అనుచరుల ద్వారా ఆరా తీసినట్లు సమాచారం. టెండర్లు దాఖలు చేసిన వారిలో కూడా మద్యం మాఫియా లీడర్ల అనుచరులు ఉండడంతో ఏ దుకాణం ఎవరికి దక్కిందో క్షణాల్లో సమాచారం వారికి చేరింది.
 
గుడ్‌విల్‌గా రూ.లక్షలు..
కొన్ని దుకాణాలు తమ సిండికేట్ పరిధిలో లేనివారికి దక్కడంతో గుడ్‌విల్‌గా రూ.లక్షలు ముట్టజెప్పేందుకు డ్రా ముగిసిన వెంటనే మద్యం డాన్లు బేరాసారాలు చేశారు. నయానోభయానో నచ్చజెప్పి వెంటనే ఆయా దుకాణాల్లో చాలా వరకు తమకు దక్కేలా పావులు కదిపారు. మాట వినకుంటే డ్రాలో వచ్చిన వారు ఎవరికిదగ్గరో వారితో నచ్చజెప్పించి వాటిని కూడా తమ వశం చేసుకున్నట్లు తెలిసింది. సిండికేట్‌గా ఏర్పడితే ఒక్కో దుకాణం నుంచి రూ.లక్షల్లో ఆదాయం వస్తుండడంతో గుడ్‌విల్ ఎంత ఇచ్చేందుకైనా మద్యం డాన్లు వెనకాడలేదని తెలిసింది.

ఒక్కో దుకాణానికి డ్రా ముగియగానే తమ సిండకేట్‌కే వచ్చిందా..? లేదా..? సిండికేట్ లేకపోతే ఎవరికి వచ్చింది.. అంటూ తమ అనుచరుల ద్వారా ఆరా తీస్తూ.. వెంటనే వారిని ఫోన్ల మీదనే తమలైన్‌కి తీసుకొని గుడ్‌విల్ చర్చలు జరపడంలో మద్యం డాన్ చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాకుండా దరఖాస్తు ఫీజు, లెసైన్స్ ఫీజులో 10 శాతం వారే చెల్లించి తమ బినామీలతో టెండర్లు దాఖలు చేయించారు.

డ్రా దక్కని వారి డీడీ డబ్బులను వెంటనే తీసుకొని అక్కడే దుకాణాలు దక్కించుకున్న వారికి గుడ్‌విల్ కింద కొంతమందికి ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా మద్యం డాన్లు తమ కనుసన్నల్లోనే గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ మద్యం దుకాణాలు దక్కించుకోవడంతో ఎక్త్సెజ్ శాఖ పారదర్శకత గాలికి పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement