కళ్ల ముందే కన్నుమూస్తున్న బిడ్డలు
{పమాదాలకు నిలయంగా బావులు, చెరువులు
వరుసగా చోటు చేసుకుంటున్న మరణాలు
{పతీ వేసవిలో పెరుగుతున్న ప్రమాదాలు
‘అమ్మా ఆడుకోవడానికి వెళ్తున్నాం’ అని ఇంట్లో చెప్పి బయటకు వెళ్తున్న పిల్లలు అనంత లోకాలకు చేరుకుంటున్నారు. వేసవిలో ఈత కొట్టాలన్న సరదా వారి నూరేళ్ల జీవితాన్ని నీట ముంచేస్తోంది. కన్నవారి ప్రేమను కన్నీటి పాలు చేస్తోంది. జిల్లాలో వారం రోజుల వ్యవధిలో ఏడుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. - సాక్షి, హన్మకొండ
హన్మకొండ : ప్రస్తుతం వేసవి కావడం, సెలవులు ఉండడం వల్ల పిల్లలు చెరువుల్లో స్నానాలు చేసేందుకు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. చెరువుల స్వభావం దెబ్బతినేలా ఈ పనులు జరగడంతో చాలా చెరువులు గుంతల మయంగా మారాయి. దీనితో చెరువుల్లో ఎక్కడ గుంత ఉంది? ఎక్కడ మెరక ప్రాంతం ఉంది? అనేది గుర్తించలేని పరిస్థితి నెలకొంది. చెరువులో ఏ ప్రాంతంలో ఎక్కడ గుంత ఉన్న విషయం తెలియక పోవడంతో నీటిలో దిగిన చిన్నారులు ప్రమాదాలకు చేరువవుతున్నారు. మరోవైపు మిషన్ కాకతీయలో భాగంగా జరుగుతున్న పనుల్లో కొన్నిచోట్ల చెరువుల్లో నీటినిల్వలకు సమీపంలో మెత్తటిమట్టి ఉండే చోట హడావుడిగా పనులు చేపడుతున్నారు. ఈ గుంతలు సైతం ప్రమాదాలకు నెలవుగా మారే అవకాశాలు ఉన్నాయి.
గ్రామపంచాయతీలు పట్టించుకోవాలి..
వేసవిలో చెరువుల్లో దిగి చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నందున ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీలు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. చెరువుల్లో ఎక్కడ గుంతలు ఉన్నయో తెలిపే బోర్టులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వేసవిలో నీరున్న ప్రతీ చెరువుల పర్యవేక్షణ కోసం తాత్కాలిక ప్రతిపాదికన సిబ్బంది నియమించడం ద్వారా చెరువుల్లో ఈత కొట్టేందుకు వచ్చే వారిని నివారించేందుకు అవకాశం ఉంటుంది.
పోలీస్‌శాఖ స్పందించాలి
గతేడాది వారం రోజుల వ్యవధిలో తొమ్మిది మంది విద్యార్థులు ఈతకని వెళ్లి నీళ్లలో మునిగి చనిపోయారు. దానితో అప్పుడు ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న కిశోర్‌కుమార్ స్పందించారు. ఈత కోసం వెళ్తూ చనిపోతున్న చిన్నారుల మరణాలపై తల్లిదండ్రులకు జాగ్రత్త వహించేలా దండోరా వేయించాలంటూ మండల పరిధిలో ఉన్న గ్రామ సర్పంచ్‌లకు సలహా ఇచ్చారు. అదేవిధంగా గ్రామ రెవెన్యూ సహాయకులు చొరవ తీసుకుని చెరువులు, బావుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా తమ శాఖ తరఫున ప్రత్యేక పెట్రోలింగ్ చేశారు. ఈ వేసవిలోనూ ఈ తరహా కార్యక్రమాలను పోలీసుశాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలి.
తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి
వేసవి సెలవులు సమీపించడంతో చాలా మంది విద్యార్థులు, యువకులు తమ స్నేహితులతో కలిసి సరదాగా ఈత నేర్చుకునేందుకు లేదా ఈత కొట్టేందుకు చెరువులు, వ్యవసాయ బావులు, పంట కాల్వల వద్దకు వెళ్తున్నారు. ఇదే సమయంలో సూర్యుడి ప్రతాపానికి చెరువుల్లో నీటి మట్టం చాలా వరకు తగ్గి ఉంటోంది. దానితో నీటి లోతును తక్కువగా అంచనా వేసి నీళ్లలోకి దిగి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. దీనికితోడు ప్రమాదం జరిగే స్థలాల సమీపంలో బాగా ఈత వచ్చిన వ్యక్తులు అందుబాటులో లేకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించే అవకాశం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా తల్లిదండ్రులు త మ పిల్లలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈత నేర్చుకునేందుకు పిల్లలు మక్కువ చూపిస్తే వారి మనసు నొచ్చుకోకుండా నచ్చచెప్పాలి లేదా బాగా ఈత వచ్చిన వ్యక్తుల సమక్షంలో పిల్లలకు ఈత నేర్పించే ఏర్పాట్లు చేయాలి. తప్పితే పిల్లలను స్వేచ్ఛగా బావులు, చెరువుల వద్దకు పంపివ్వకపోవడం మేలు. ఊళ్లలో జట్లుగా ఏర్పడుతున్న పిల్లలు తమ సరదా కోసం ఎటువైపు వెళ్తున్నారనే అంశంపై పెద్దలు కన్నెసి ఉంచడం ఉత్తమం.
సరదా ఈత.. కారాదు కడుపుకోత!
Published Fri, May 1 2015 1:26 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
Advertisement
Advertisement