![Talasani Srinivas Yadav Demand For Free Trains To Migrant labourers - Sakshi](/styles/webp/s3/article_images/2020/04/30/Modi.jpg.webp?itok=9ZR8CEKW)
సాక్షి, హైదరాబాద్ : లాక్‌డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆంక్షల నుంచి సడలింపు ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం సడలింపుల ప్రకటన జారీచేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వలస కార్మికుల తరలింపుకు ఉచితంగా రైళ్ళను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను గమ్య స్థానాలకు చేర్చే బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని కోరారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి.. తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఓ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బస్సుల్లో తరలించాలని నిర్ణయించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. (ప్రత్యేక రైళ్లు నడపాలి : మోదీకి సీఎం లేఖ)
తెలంగాణలో బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన సుమారు 15 లక్షల మంది వలస కూలీలు ఉన్నారని తెలిపారు. తెలంగాణ నుంచి బీహార్, జార్ఖండ్, చత్తీస్‌గడ్‌కు బస్సుల్లో వెళ్లేందుకు సుమారు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుందన్నారు. ఇది కూలీలకు చాలా ఇబ్బందికరమైన ప్రయాణమని తలసాని పేర్కొన్నారు. రైళ్ళలో వలస కూలీలను వారి స్వరాష్ట్రాలకు చేర్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా బస్సులతో స్వగ్రామాలకు తరలించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. (సొంతూళ్లకు వెళ్లేందుకు ఓకే)
కాగా అలాగే, లాక్‌డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు, పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లిన భక్తులు, పర్యాటకులు తదితరులకూ ఊరట కల్పిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీచేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు లోబడి వారు తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతించింది. అయితే కూలీల తరలింపుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా బస్సులను పంపాలన్న నింబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే యూపీ, ఉత్తరాఖండ్, గుజ రాత్, పంజాబ్, అస్సాం, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన తమ విద్యార్థులు, పర్యాటకులను వెనక్కు తీసుకువెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment