
సాక్షి, హైదరాబాద్: చేపల విక్రయాల కోసం రాష్ట్రంలో త్వరలోనే మొబైల్ ఫిష్ ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.18 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేస్తామని, ప్రయోగాత్మకంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఈ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్‌తో కలసి మత్స్య సహకార సంఘాల అభివృద్ధి, సభ్య త్వ నమో దు తదితర అంశాలపై మత్స్య శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పందుల పెంపకంపై ఆసక్తి ఉన్న వారికి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తలసాని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేయదగిన సాయాన్ని అధ్యయనం చేసేందుకు పందుల పెంపకం దారులు, అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment