
సాక్షి, హైదరాబాద్ : రాజ్‌భవన్ వేదికగా ప్రజా సమస్యలకు సబంధించిన వినతిపత్రాలు స్వీకరించి... పరిష్కారానికై ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలుగులో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు మంచి మనస్సు ఉన్నవాళ్లని... పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా అభివృద్ధి, సుఖ, సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అదే విధంగా గవర్నర్‌గా వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని తమిళిసై హర్షం వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనపై రాష్ట్రపతికి నివేదిక ఇచ్చానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్, వ్యవసాయ విద్యారంగాల్లో అభివృద్ధి దిశగా పనిచేస్తోందని నివేదికలో తెలిపినట్లు పేర్కొన్నారు. 2019లో బతుకమ్మ ఆటలు, గిరిజనులతో మమేకం కావడం సంతృప్తినిచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల సందర్శించిన గిరిజనులను రాజ్ భవన్‌కు ఆహ్వానించానని తెలిపారు. రక్తదానం కోసం యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. రెడ్‌క్రాస్‌తో కలిసి దీనిని సంయుక్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.15 లక్షల మంది ఇందులో సభ్యులుగా ఉండడం సంతోషమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment