సాక్షి, సిటీబ్యూరో: తెలిసీ తెలియని వయస్సులో వాహనాలపై దూసుకెళుతూ మొగ్గలోనే రాలిపోతున్న మైనర్ల మరణాలు, ప్రమాదాలను తగ్గించడానికి నగర ట్రాఫిక్ విభాగం అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది ఇలాంటి కేసుల్లో మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారి తల్లిదండ్రుల పైనా కేసుల నమోదుకు నిర్ణయించారు. ఈ రకంగా దాదాపు 50 మంది తండ్రులు జైలుకు వెళ్లిన విషయం విదితమే. ఈ విధానం తమిళనాడులోని చెన్నై పోలీసులను ఆకర్షించింది. అక్కడి పరిస్థితులు, అనివార్య కారణాల నేపథ్యంలో స్పెషల్ డ్రైవ్ తరహాలో కాకుండా ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భంలో కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. చెన్నై ట్రాఫిక్ పోలీసు చరిత్రలో తొలిసారిగా గత బుధవారం ప్రమాదంలో మరణించిన ఓ మైనర్ తల్లిపై కేసు నమోదు చేశారు. అంతిమ సంస్కారాలతో పాటు ఇతర కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆమెను అరెస్టు చేయాలని భావిస్తున్నారు. చెన్నైలోని మొగప్పేర్ ప్రాంతానికి చెందిన మీన వెంకటేష్ కుమారుడు అవినాష్ (పేరు మార్చాం) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మీన ఇటీవల తన కుమారుడి కోసం ఓ హైస్పీడ్ బైక్ ఖరీదు చేశారు. అతడు మైనర్ కావడంతో తన పేరునే రిజిస్ట్రేషన్ చేయించారు. గత బుధవారం తన స్నేహితురాలితో కలిసి ట్యూషన్‌కు వెళ్తున్న అవినాష్ మితిమీరిన వేగం కారణంగా వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. డివైడర్ పైకి ఎక్కిన వాహనం ఓ పాదచారిని ఢీ కొట్టి పడిపోయింది.
ఈ ఘటనలో పాదచారితో పాటు స్నేహితురాలికి స్వల్ప గాయాలు కాగా... తలకు బలమైన గాయమైన అవినాష్ స్థానిక ఆస్పత్రిలో కన్ను మూశాడు. ఈ ఉదంతాన్ని తిరుమంగళం ట్రాఫిక్ పోలీసు ఆధీనంలోని ఇన్వెస్టిగేషన్ వింగ్ సీరియస్‌గా తీసుకుంది. ప్రాథమికంగా అవినాష్‌పై ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసు నమోదు చేసినప్పటికీ అతడు చనిపోవడంతో ఈ కేసు మూసేసింది. మైనర్‌కు వాహనం ఇవ్వడంతో పాటు ఆ వాహనం రిజిస్ట్రేషన్ అయి ఉండటంతో మీన వెంకటేష్‌పై కేసు నమోదు చేసింది. త్వరలో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని భావిస్తోంది. చెన్నై ట్రాఫిక్ డీసీపీ ప్రేమ్ సిన్హా ఈ విషయంపై ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వారు ఎలాంటి వాహనాలనూ పడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్ల పైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. 18 నిండిన తరవాత మాత్రమే గేర్స్‌తో కూడిన వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు లైసెన్స్ సైతం వీరికే మంజూరు చేస్తారు. చట్ట ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే.
ఈ విషయంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న చర్యలు ఆదర్శప్రాయంగా ఉన్నాయి. ఆ స్ఫూర్తితోనే మీన వెంకటేష్‌పై కేసు నమోదు చేశాం’ అని అన్నారు. పాశ్చాత్య దేశాల తరహాలో ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడంతోనే మైనర్, యూత్ విజృంభిస్తున్నారనేది అధికారుల వాదన. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనంపై బయటకు వస్తే వాహనం సీజ్ చేస్తారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ వస్తే వారితో పాటు తల్లిదండ్రులకూ జరిమానా విధిస్తారు. జరిమానాలు భారీ స్థాయిలో ఉండటం, మూడు ఉల్లంఘనలకు మించితే వారి లైసెన్స్ రద్దు తదితర చర్యలు తీసుకుంటారు. ఇక్కడ అంతటి కఠిన చట్టాలు లేకపోయినా... ఉన్న కొన్నింటినీ సంబంధిత శాఖలు పట్టించుకోవట్లేదు. మోటారు వాహనాల చట్టంలోని 180 సెక్షన్ ప్రకారం ఓ మైనర్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి కానీ వాహనం నడిపితే... అతడితో పాటు వారికి వాహనం అందించిన దాని యజమాని పైనా కేసు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment