సింగరేణి కార్మికుల సభ్యత్వ రుసుమును స్వాహా చేశారనే ఆరోపణపై టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్ష, కార్యదర్శులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.
సభ్యత్వ రుసుము అక్రమాల కేసులో.. రూ. 90 లక్షలు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
కొత్తగూడెం: సింగరేణి కార్మికుల సభ్యత్వ రుసుమును స్వాహా చేశారనే ఆరోపణపై టీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్ష, కార్యదర్శులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సింగరేణి సంస్థ కార్మికుల నుంచి సభ్యత్వ రుసుము కింద ప్రతి నెల రూ. 20 వసూలు చేసి.. గుర్తింపు కార్మిక సంఘానికి అందజేస్తుంది. సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలుపొందిన తర్వాత టీబీజీకేఎస్‌లో పదవుల కోసం కెంగెర్ల మల్లయ్య, మిర్యాల రాజిరెడ్డి వర్గాల మధ్య విబేధాలు పొడచూపాయి.
దీంతో 2013 మే నుంచి కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన సభ్యత్వ రుసుమును యాజమాన్యం ఎవరికీ ఇవ్వకుండా నిలిపివేసింది. తర్వాత ఎన్నికలోల రాజిరెడ్డి విజయం సాధించగా, 2013 మే నుంచి 2014 జూలై వరకు కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన సభ్యత్వ రుసుము సుమారు రూ. 90 లక్షలను అధ్యక్షుడు ఆకునూరి కనకరాజు, ప్రధాన కార్యదర్శి మిరియాల రాజిరెడ్డి, కోశాధికారి సారంగపాణిలకు అందించింది.
అయితే, ఈ సొమ్మును మిరియాల రాజిరెడ్డి, ఆకునూరి కనకరాజుల సొంత అకౌంట్‌లో జమ కావడంతో కొత్తగూడెంకు చెందిన జి.కె. సంపత్‌కుమార్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సభ్యత్వ రుసుములో అవకతవకలు జరిగాయని నిర్ధారించింది. బుధవారం ఉదయం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.