టీడీపీ నేతల్లో నైరాశ్యం | TDP Alliance With Congress Party Medak Politics | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల్లో నైరాశ్యం

Published Wed, Sep 12 2018 12:06 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TDP  Alliance With Congress Party Medak Politics - Sakshi

సాక్షి, మెదక్‌:  జిల్లాలో తెలుగుదేశం నేతలను నైరాశ్యం అలుముకుంటోంది.  మెదక్‌లో ఒకప్పుడు టీడీపీ బలమైన పార్టీగా ఉండేది. ప్రస్తుతం ఆ ప్రాభవాన్ని కోల్పోయి ఉనికిని చాటుకునేందుకు ఆగచాట్లు పడాల్సివస్తోంది. ప్రస్తుతం ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయలేని దుస్థితికి చేరుకుంది. ఒకప్పుడు మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండేది. కాంగ్రెస్, టీడీపీ రెండు పార్టీ మధ్య నువ్వానేనా అన్న పోటీ ఉండేది. కానీ ప్రస్తుతం  వైరి పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు కోసం తహతహలాడుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే తప్ప రాబోయే ఎన్నికల బరిలో నిలవలేని పరిస్థితి టీడీపీలో నెలకొంది. కాంగ్రెస్‌తో పొత్తు విషయమై టీడీపీ అధిష్టానం చర్చలు జరుపుతోంది.

రాష్ట్రంలో మొత్తం 40 స్థానాలను టీడీపీ డిమాండ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఐదు స్థానాలు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ కోరిన స్థానాలు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సుముఖంగా లేదని సమాచారం. కానీ పొత్తు విషయంపై క్షేత్రస్థాయిలోని కార్యకర్తలు తీవ్రంగా విముఖత చూపుతున్నారు. వైరి పార్టీ అయిన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి ఎలా వెళ్తాం? ఏం చెబుతాం? టీడీపీ అభ్యర్థులకు కాంగ్రెస్‌కు పనిచేసే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు కొంత మంది బహిరంగాగానే వాపోతున్నారు. పొత్తు కుదరడంతో  పార్టీ వీడేందుకు  మెదక్, నర్సాపూర్‌లోని పలువురు నాయకులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మెదక్, నర్సాపూర్‌ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న టీడీపీ నేతల్లో సైతం నిరాశ కమ్ముకుంటోంది. కొంతమంది మాత్రం పొత్తు కుదరకపోతే పరిస్థితి ఏమిటన్న ఆయోమయంలో ఉన్నారు.

కంచుకోటలో నేడు దైన్యం..
మెదక్‌ నియోకజవర్గంపై టీడీపీ ముద్ర బలంగా ఉండేది. దివంగత టీడీపీ నేత రామచంద్రరావు పలుమార్లు మెదక్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు.  1983, 1985,
1994, 1998, 2001, 2009లో జరిగిన ఎన్నికల్లో కరణం రామచంద్రరావు, కరణం ఉమాదేవి, మైనంపల్లి హన్మంతరావు ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మెదక్‌లో టీడీపీకి బలమైన కేడర్‌ ఉండేది. మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేసిన బట్టి జగపతికి కూడా మంచి పట్టు ఉండేది. కాగా తెలంగాణ ఉద్యమ ప్రభావంతో టీడీపీ వైభవం తగ్గుతూ వచ్చింది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున బట్టి జగపతి పోటీ చేయగా మూడో స్థానంలో నిలిచారు.

బట్టి జగపతి సహా పలువురు నాయకులు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్లటంతో పార్టీ నిర్వీర్యమైంది. ప్రస్తుతం మెదక్‌ నియోజకవర్గంలో టీడీపీ అంతగా ప్రభావం చూపలేని పరిస్థితిలో ఉంది. నర్సాపూర్‌ నియోజకవర్గంలో సైతం గతంలో టీడీపీ ప్రభావం చూపే స్థాయిలో ఉండేది. టీడీపీ పొత్తుతో సీపీఐ పలుమార్లు ఇక్కడ గెలుపొందింది. అప్పటి టీడీపీ నేత మదన్‌రెడ్డి రెండు పర్యాయాలు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగినప్పటికీ గెలవలేకపోయారు. తెలంగాణ ఉద్యమం అనంతరం పార్టీ ఇక్కడా పూర్తిగా దెబ్బతింది. మదన్‌రెడ్డి, మురళీయాదవ్‌తోపాటు పలువురు ముఖ్యనాయకులు టీఆర్‌ఎస్‌లోకి వలసలు వెళ్లారు. దీంతో పార్టీ పూర్వవైభవం కోల్పోయింది. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ ఉనికి చాటుకునే స్థితలో ఉంది.
 
సీటు దక్కేనా..?
కాంగ్రెస్‌తో పొత్తుపైనే టీడీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. పొత్తు కుదిరిన పక్షంలో మెదక్‌ సీటు దక్కించుకోవాలని పలువురు టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. అయితే కాంగ్రెస్‌ మెదక్, నర్సాపూర్‌ రెండు స్థానాలు ఇచ్చేందుకు నికారిస్తున్నట్లు తెలుస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో టీడీపీ ఒక్క స్థానంలో గెలుపొందలేదు. గత ఎన్నికలో బీజేపీతో పొత్తులో భాగంగా మెదక్‌ నుంచి టీడీపీ అభ్యర్థి బట్టి జగపతి పోటీ చేయగా నర్సాపూర్‌ నుంచి బీజేపీ చాగళ్ల బల్వీందర్‌నాథ్‌ పోటీ చేశారు. ఇద్దరు అభ్యర్థులు ఒటమిపాలయ్యారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్‌ ఎత్తిచూపుతూ మెదక్, నర్సాపూర్‌లో టీడీపీకి బలంలేదని రెండు స్థానాలు తమకు వదిలివేయాలని కాంగ్రెస్‌ చెబుతున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా మెదక్, నర్సాపూర్‌ నుంచి పోటీ చేయకపోతే మెదక్‌ జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement