కర్ణాటక సరిహద్దులో ఉన్న జహీరాబాద్‌లో కన్నడ, తెలుగు కలగలిపిన సంస్కృతి కనిపిస్తుంది. 1957లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ఆది నుంచి కాంగ్రెస్ హవానే కొనసాగుతోంది. 12 సార్లు ఇక్కడ ఆ పార్టీకి చెందిన నేతలే విజయం సాధించారు. కేవలం ఒక్క సారి మాత్రమే టీడీపీ ఖాతా తెరిచింది. కాంగ్రెస్ నేత బాగారెడ్డి వరుసగా ఏడు సార్లు ఎన్నికై రికార్డు నెలకొల్పారు.
జహీరాబాద్: భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు జహీరాబాద్ నిజాం పాలనలో ఉండేది. అప్పట్లో పెద్ద ఎక్కల్లిగా జహీరాబాద్‌ను పిలిచేదని పెద్దలు చెబుతుంటారు. జహీర్ ఏ జంగ్ అనే జాగీర్‌దార్ పేరిట జహీరాబాద్‌గా వెలిసిందనేది వారి మాట. జహీరాబాద్‌కు సుమారు 30 కిలో మీటర్ల దూరంలో మన్నా ఎక్కెల్లి అనే గ్రామం కూడా ఉండడంతో జహీరాబాద్‌ను పెద్ద ఎక్కెల్లిగా పిలుచుకునే వారు. అప్పట్లో కర్ణాటకలోని బీదర్ జిల్లా చిడుగుప్ప తాలూకా పరిధిలో జహీరాబాద్ ఉండేది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు సమయంలో జహీరాబాద్ ఆంధ్రప్రదేశ్‌లో చేర్చారు. అనంతరం ఈ ప్రాంతం తాలూకా కేంద్రంగా అవతరించింది. జహీరాబాద్ ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో అతిపెద్ద వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోంది. విద్య, ప్యాపార, వ్యవసాయ రంగాల్లో ప్రత్యేకతను సంతరించుకుంది.
బాగారెడ్డి హవా..
ఇదే ప్రాంతానికి చెందిన ఎం.బాగారెడ్డి ఏడు సార్లు ఎన్నికై. నియోజకవర్గం రాజకీయాలనే కాకుండా జిల్లా, రాష్ట్ర స్థాయి రాజకీయాలను సైతం ఆయన శాసించారు. కాంగ్రెస్ నుంచి ఏడు పర్యాయలు వరుసగా ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు మెదక్ ఎంపీగా ఎన్నికై చరిత్రకెక్కారు. ఆయన ఒకే పార్టీ తరఫున ఎన్నికయ్యారు. అదే పార్టీకి చెందిన ఎం.డి.ఫరీదుద్దీన్ రెండు పర్యాయాలు, జె.గీతారెడ్డి రెండు పర్యాయాలు, పి.నర్సింహారెడ్డి ఒక పర్యాయం కాంగ్రెస్ తరపున గెలిచారు. సీ.బాగన్న తెలుగుదేశం పార్టీ తరపున ఒక సారి విజయం సాధించారు. బాగన్న కాంగ్రెసేతర పార్టీ తరఫున గెలిచిన ఒకే ఒక్కడు కావడం విశేషం.
ఐదు మండలాల అసెంబ్లీ..
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఐదు మండలాలు, ఒక మున్సిపాలిటీతో కలిపి ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త మండలాలు ఏర్పడగా జహీరాబాద్ మండలం రెండుగా చీలిపోయింది. జహీరాబాద్ పాత మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా రెండుగా విడదీసి కొత్తగా మొగుడంపల్లి మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా నియోజకవర్గంలో న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్ మండలాలు ఉన్నాయి.
కర్ణాటక సరిహద్దు..
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉంది. పడమర వైపున కర్ణాటకలోని హుమ్నాబాద్, దక్షిణం వైపున చించోళి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తూర్పు వైపున కోహీర్ మండలానికి సరిహద్దుగా వికారాబాద్ జిల్లా పరిధి విస్తరించి ఉంది. కోహీర్ మండలానికి తూర్పు, దక్షిణం వైపున వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, బంట్వారం మండలాలు ఉన్నాయి. జహీరాబాద్ నియోజకవర్గానికి తూర్పు వైపున అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం సరిహద్దుగా ఉండగా, ఉత్తరం వైపున నారాయణఖేడ్ నియోజకవర్గం విస్తరించి ఉంది.
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు జహీరాబాద్ నియోజకవర్గంలో రాయికోడ్ మండలం ఉండేది. ప్రస్తుతం నియోజకవర్గం పరిధిలో ఉన్న న్యాల్‌కల్ మండలం నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో ఉండేది. పునర్విభజనతో రాయికోడ్ మండలం అందోల్ నియోజకవర్గంలో చేరగా, న్యాల్‌కల్ మండలం మాత్రం నారాయణఖేడ్ నుంచి జహీరాబాద్ నియోజకవర్గంలోకి వచ్చి చేరింది.
1957లో నియోజకవర్గం ఏర్పాటు..
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 1957లో జహీరాబాద్ శాసన సభ నియోజకవర్గం ఏర్పడింది. అంతకు ముందు జహీరాబాద్ కర్ణాటక పరధిలో ఉండింది. ఆ సయంలో జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్ మండలాలు జహీరాబాద్ నియోజకవర్గంలో ఉండేవి. 1978 ఎన్నికల్లో న్యాల్‌కల్ మండలాన్ని నారాయణఖేడ్ నియోజకవర్గంలో చేర్చారు. మండలాల పునర్విభజన తర్వాత న్యాల్‌కల్ మండలం జహీరాబాద్ నియోజకవర్గంలో విలీనం కాగా, రాయికోడ్ మండలం మాత్రం అందోల్ నియోజకవర్గంలోకి చేర్చారు.
జహీరాబాద్ నియోజకవర్గ ముఖ చిత్రం
మొత్తం ఓటర్లు.. 2,27,874
పురుషులు 1,15,456
మహిళలు 1,12,394
ఇతరులు 24
Comments
Please login to add a commentAdd a comment