సాక్షి, హైదరాబాద్: అధికారిక పొత్తు ప్రకటనకు ముందే టీడీపీ-బీజేపీల్లో సీట్ల పంపకాల లెక్కలు మొదలయ్యాయి. ‘దేశం’ బీజేపీల మధ్య పొత్తు అధికారికంగానే ప్రకటించాల్సి ఉందని ఇరుపార్టీల ముఖ్యనాయకులు అంతర్గతంగా అంగీకరిస్తుండటంతో నగరంలో సీట్ల పంపకాలపై చర్చ జోరందుకుంది. ఈమారు గ్రేటర్ పరిధిలో మూడు లోక్‌సభ, కనీసం పది శాసనసభ స్థానాలకు తగ్గకుండా తీసుకోవాలని బీజేపీ భావిస్తుండటంతో, ఆయాస్థానాలపై నమ్మకం పెట్టుకున్న టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది.
1999లో టీడీపీ-బీజేపీ పొత్తుల సమయంలో నగరంలో బీజేపీ ముషీరాబాద్, మలక్‌పేట, కార్వాన్, యాకుత్‌పురా, మహరాజ్‌గంజ్‌లతోపాటు సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. ఈ మారు బర్‌పేట,ముషీరాబాద్,గోషామహల్,కార్వాన్,యాకుత్‌పూరా,మలక్‌పేట, ఖైరతాబాద్‌లోపాటు ఉప్పల్,కూకట్‌పల్లి, మల్కాజిగిరి శాసనసభ స్థానాలను పొత్తుల్లో భాగంగా తప్పకుండా తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అదే విధంగా హైదరాబాద్,సికింద్రాబాద్ లోక్‌సభస్థానాలతో పాటు మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలన్న భావనను పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.
‘దేశం’ నేతల గుండెలు గుభేల్ : బీజేపీ పొత్తు వార్తల నేపథ్యంలో టీడీపీ నాయకుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. ఇప్పటికే అంబర్‌పేటలో మాజీమంత్రి కృష్ణాయాదవ్, ముషీరాబాద్‌లో ఎంఎన్ శ్రీనివాసరావు, ముఠాగోపాల్, కార్వాన్ డాక్టర్ ఎస్‌రావు, అమ్జద్‌అలీఖాన్,గోషామహల్‌లో ప్రేమ్‌కుమార్‌ధూత్, మలక్‌పేటలో ముజఫర్‌అలీఖాన్, ఖైరతాబాద్‌లో విజయరామారావుల పరిస్థితి ప్రశ్నార్థకం కానుంది. ఇప్పటికే గోషామహల్‌కు చెందిన టీడీపీ నాయకుడు వినోద్‌కుమార్ రెండు రోజుల్లో కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించారు.
అదేవిధంగా మల్కాజిగిరి,ఉప్పల్, కూకట్‌పల్లి శాసనసభ స్థానాల్లోనూ ఎట్టి పరిస్థితుల్లో తమకే దక్కుతాయంటూ బీజేపీ ముఖ్యనేతలు ఇచ్చిన భరోసాతో ఆయా నియోజకవర్గాల్లో నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మల్కాజిగిరిలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న మైనంపల్లి హన్మంతరావు, బీకే మహేష్ వర్గాలు, ఉప్పల్‌లో దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్ తనయుడు ఇప్పటికే ఎన్నికల ్రపచారా సన్నాహాలు మొదలు పెట్టేశారు. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరి ఈ స్థానాలు కేటాయించాల్సి వస్తే టీడీపీ ముఖ్యనేతల పరిస్థితి ఇబ్బందికరంగా తయారుకానుంది.
మీకేవీ..మాకేవి !
Published Mon, Mar 17 2014 12:07 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement