తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్!
హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరించగా.. విపక్ష టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది. సమావేశాల తొలిరోజున(శనివారం) గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఉదంతాన్ని టీఆర్‌ఎస్ గట్టిగా పట్టుకుంది.
హైదరాబాద్: అసెంబ్లీలో అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యవహరించగా.. విపక్ష టీడీపీ సెల్ఫ్‌గోల్ చేసుకుంది. సమావేశాల తొలిరోజున(శనివారం) గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఉదంతాన్ని టీఆర్‌ఎస్ గట్టిగా పట్టుకుంది. జాతీయగీతాన్ని అవమానించిన విషయాన్ని ఎత్తిచూపి ఇతర పక్షాల మద్దతును కూడగట్టింది. ఈ వ్యవహారాన్ని క్షమాపణతో సరిపెట్టాలనుకున్నా.. టీడీపీ స్వీయ తప్పిదాలే టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మారాయి.
సభకు అడ్డు తగులుతున్నారన్న కారణంతో పది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో కీలకమైన బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ గొంతు మూగబోయింది. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కష్ణయ్య మినహా ఆ పార్టీకి ప్రస్తుతం సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నిజానికి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై గెలిచి, టీఆర్‌ఎస్ తీర ్థం పుచ్చుకుని మంత్రి కూడా అయిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని టీడీఎల్పీ వ్యూహ రచన చేసుకుంది. కానీ, ఆచరణలో విఫలమై అధికార పక్షానికి చిక్కింది.
అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి!
గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో మంత్రి తలసాని అనర్హత అంశాన్ని ప్రస్తావించి, ఆయనను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్‌ను వినిపిం చిన టీడీపీ.. సోమవారం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. తొలిరోజు ఘటనపై స్పీకర్ వద్ద జరిగిన ఫ్లోర్‌లీడర్ల సమావేశంలో వీడియో ఫుటేజీ కోసం టీడీపీ డిమాండ్ చేసింది. చివరకు క్షమాపణకు అంగీకరించకుండానే భేటీ నుంచి బయటకొచ్చింది. రెండోరోజు క్షమాపణ చెప్పే విషయంపై టీడీఎల్పీ నేత ఎర్రబెల్లికి స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడే అవకాశమిచ్చారు. స్పీకర్ పదే పదే కోరినా పట్టించుకోకుండా.. కేబినెట్‌లో ఎస్సీ, ఎస్టీ, మహిళలకు అవకాశమివ్వాలంటూ తమకు సంబంధం లేని కొత్త నినాదాన్ని తలకెత్తుకుని టీడీపీ బొక్క బోర్లాపడింది. ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేసినా.. అది స్పీకర్ వద్దే పెండింగులో ఉంది. ఈ సమావేశాలకు ఆయన మంత్రిగా హాజరుకావడాన్ని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ చివరకు ఆ విషయాన్నే పక్కనబెట్టింది. ‘క్షమాపణ చెప్పాల్సిన ఐదుగురు ఎమ్మెల్యేల వరకు సస్పెండ్ అయినా బాగుండేది.
కనీసం మరో ఐదుగురం సభలో ఉండి గొంతు వినిపించేవాళ్లం. ఇపుడు అవకాశం లేకుండా పోయింది’ అని సస్పెండ్ అయిన ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తంచేశారు. తలసాని వ్యవహారంలో ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి టీఆర్‌ఎస్ బయట పడిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇక టీడీపీ సభ్యులను ఏకంగా సెషన్ మొత్తం సస్పెండ్ చేయడాన్ని విపక్షాలు తప్పుబట్టినప్పటికీ సభలో ఎవరూ ఆ పార్టీకి మద్దతుగా నిలవలేదు. టీ విరామ సమయం తర్వాత బీజేపీపక్ష నేత లక్ష్మణ్ ఈ అంశాన్ని లేవనెత్తినా అధికారపక్షం లెక్కపెట్టలేదు. బడ్జెట్ తర్వాతే ఈ సస్పెన్షన్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశముందని రాజకీయవర్గాలు అంటున్నాయి.