
వనరుల దోపిడీకే దొరల కుట్ర!
తెలంగాణలో వనరులను దోచుకునేందుకు దొరల కుట్ర జరుగుతోందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపణ
హైదరాబాద్: తెలంగాణలో వనరులను దోచుకునేందుకు దొరల కుట్ర జరుగుతోందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మెట్రో రైలు ప్రాజెక్టు భూమిని నందగిరి దొర మైహోం రామేశ్వర్‌రావుకు కేటాయించడం నూటికి నూరుపాళ్లూ నిజమని మరోసారి ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్‌కు భయపడి మెట్రోరైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ ఎండీ గాడ్గిల్ వాస్తవాలు దాచిపెడుతున్నారని... ఈ మేరకు గాడ్గిల్‌తో బలవంతంగా ప్రకటన చేయించారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శుక్రవారం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మెట్రోరైలుకు చెందిన 18 ఎకరాల స్థల ం నుంచి వైదొలిగితే తమకు నష్టమంటూ.. అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఎన్‌వీఎస్ రెడ్డి రాసిన లేఖను మీడియాకు విడుదల చేశారు. రూ. 2 వేల కోట్ల విలువైన భూమిని రామేశ్వర్‌రావుకు ఉచితంగా కేటాయించారని, రూ. 26 కోట్ల స్టాంప్ డ్యూటీని కూడా మినహాయించారని రేవంత్ పేర్కొన్నారు. మెట్రోరైలు వివాదంలో ఎల్‌అండ్‌టీ ఎండీ గాడ్గిల్‌తో టీఆర్‌ఎస్ ప్రభుత్వం బలవంతపు ప్రకటన చేయించిందని ఆరోపించారు. అలా ప్రకటన చేయకుంటే ఎండీ పదవి నుంచి తొలగించేలా చేస్తామని గాడ్గిల్‌ను బెదిరించారన్నారు.
గచ్చిబౌలిలోని ఆ 18 ఎకరాల భూమిని ఎల్‌అండ్‌టీకి ఇవ్వకుంటే నష్టం జరుగుతుందని ఎన్‌వీఎస్ రెడ్డి లేఖ రాయడంతో... ఆ భూమిని రామేశ్వర్‌రావుకు ఇచ్చేందుకు కిరణ్ భయపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణలో వనరులను దోచుకునేందుకు దొరల కుట్ర జరుగుతోందని, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే దొరలు అవినీతికి పాల్పడకూడదని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సాటి దొరల కోసం మెట్రోను ఫణంగా పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. కొందరి స్వార్థం కోసం మెట్రోరైలు కారిడార్‌లో అనేక మార్పులు జరిగాయని, మెట్రోకు కేటాయించిన స్థలాన్ని మరొకరికి ఎలా కేటాయిస్తారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.