
టీడీపీ నాయకుడి ఆత్మహత్యాయత్నం
మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క కుమారుడి వివాహానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు ఎదుట ఓ టీడీపీ నాయకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
వరంగల్: మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క కుమారుడి వివాహానికి హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు ఎదుట ఓ టీడీపీ నాయకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. చంద్రబాబు వివాహ వేదిక వద్దకు వస్తున్న తరుణంలో వరంగల్ నగరానికి చెందిన టీడీపీ నాయకుడు అర్షం స్వామి బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటి మీద పోసుకున్నాడు. అగ్గిపెట్టెను తీయడంతో అప్రమత్తమైన పోలీసులు అతన్ని వెంటనే అదుపులోకి తీసుకొని ఫంక్షన్ హాల్ బయటకు తీసుకుపోయారు.
స్వామి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 12వ డివిజన్ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడి పోయారు. అప్పటికే ఆర్థికంగా చితికిపోయిన స్వామి ఈ ఎన్నికలతో మరింత నష్టపోయారు. తనకు సీఎం చంద్రబాబు నుంచి ఆర్థిక సహాయం ఇప్పించాలని పలుమార్లు స్థానిక నేతలను అర్థించినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు దృష్టికి తన పరిస్థితిని తీసుకుపోయి ఆర్థిక సహాయం అందించేందుకే ఈ అఘాయి త్యాయానికి పాల్పడినట్లు తెలిసింది. స్వామిని విచారించిన పోలీసులు అనంత రం వదిలిపెట్టారు.