విద్యార్థులను చితకబాదిన టీచర్
ఆమనగల్లు (కల్వకుర్తి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చెప్పినమాట వినలేదని ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థులను చితకబాదింది. ఓ విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు ఆమనగల్లు పోలీసులు ఉపాధ్యాయురాలు ఎన్.సుజలకుమారి ప్రకాశ్ పై కేసు నమోదు చేశారు.
సుజలకుమారి శుక్రవారం 6వ తరగతికి వెళ్లారు. విద్యార్థులు తమ షూలను తరగతి గది బయట విడిచి రావాలని చెపితే లోపలకు ఎందుకు తీసుకువచ్చారంటూ విద్యార్థినుల తల, చేతులపై కట్టెతో కొట్టింది. దీంతో విద్యార్థుల చేతులు కంది పోయి ఎర్రగా మారాయి. ఇందులో 15 మంది విద్యార్థులు అన్నం తినడానికి సైతం ఇబ్బంది పడ్డారు. విద్యార్థినుల తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను ఇలా కొట్టి చంపుతారా? అంటూ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దెబ్బలు తగిలిన విద్యార్థినులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.