* ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
* హాజరైన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, దిగ్విజయ్ సింగ్
* ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు శ్రద్ధాంజలి
* కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
* కదిలివచ్చిన కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు గడ్డం వెంకటస్వామికి కుటుంబసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో పంజాగుట్ట శ్మశానవాటికలో కాకా అంత్యక్రియలు జరిగాయి. ఆయన తనయుడు, మాజీ మంత్రి జి.వినోద్ తలకొరివి పెట్టారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ కాకా అంత్యక్రియలకు హాజరయ్యారు. ఈ తంతు ముగిసే వరకు రాహుల్ శ్మశానవాటికలోనే ఉన్నారు. మాజీ ఎంపీ వివేక్‌ను ఓదార్చిన రాహుల్ కాకా కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న తదితరులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, డి.శ్రీనివాస్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ తదితర నాయకులు కాకాకు అంతిమ వీడ్కోలు పలికారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఈ నేతలంతా రాహుల్ గాంధీ వెంటే ఉన్నారు.
గాంధీభవన్‌లో కాకాకు కాంగ్రెస్ నేతల శ్రద్ధాంజలి
కాకా పార్థివదేహాన్ని సోమవారం రాత్రి 11 గంటలకు కేర్ ఆసుపత్రి నుంచి సోమాజిగూడలోని ఆయన తనయుడు వివేక్ ఇంటికి తీసుకు వెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పలువురు రాజకీయ ప్రముఖులు వెంకటస్వామి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు. మధ్యాహ్నం తర్వాత కాకా పార్థివదేహాన్ని వివేక్ ఇంటినుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో గాంధీభవన్‌కు ర్యాలీగా తీసుకువెళ్లారు. అక్కడ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాకా పార్థివదేహంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి, పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అక్కడి నుంచి నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ మీదుగా పంజాగుట్ట శ్మశానవాటిక దాకా కాకా అంతిమయాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో వెంకటస్వామికి అంత్యక్రియలు జరిగాయి. ఆయనకు గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. కాకా ఇద్దరు తనయులు, ముగ్గురు కూతుళ్లు, కోడళ్లు, అల్లుళ్లు, మనుమలు, మనుమరాళ్లు ఆయన్ని కడసారి చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాకా పెద్దకొడుకు వినోద్ తన తండ్రి చితికి నిప్పంటించారు.
‘కాకా’కు ప్రముఖుల నివాళి
అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించిన కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మంగళవారం ఉదయం నుంచే సోమాజిగూడలోని ఆయన తనయుడు వివేక్ ఇంటికి కాకా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల రాక మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 9.30 గంటలకు కాకా పార్థివ దేహాన్ని దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. కాకా భౌతిక కాయంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటిం చారు.
ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ‘వెంకటస్వామి జీవితం బడుగు బలహీన వర్గాలకు ఆదర్శం. పేదలకు అండగా ఉంటూ సేవలు అందించడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. నిత్యం కార్మికుల కోసం తపించిన ఆయన, తన వారసత్వాన్ని సృష్టించి వెళ్లారు..’ అని ఏపీ సీఎం చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటిం చారు. తెలగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ గొప్ప నేతను కోల్పోయిందన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం తపన పడిన కాకా.. 1969 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారని గుర్తుచేశారు.
తెలంగాణ కోసం హైకమాండ్‌ను కూడా విభేదించారని, హైదరాబాద్ వికాసంపై స్పష్టమైన అవగాహన ఆయనకు ఉండేదని, కాకా బతికి ఉంటే తెలంగాణకు మరింత మేలు జరిగేదన్నారు. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘స్వాతంత్య్ర సమరం నాటి రాజకీయ ఆఖరి దిగ్గజం కాకా. మా అందరకీ భీష్మ పితామహుడు. ఆయన మృతి తీరని లోటు. అన్ని కులాల వారూ కాకాను స్పూర్తిగా తీసుకోవాలి’ అన్నారు. తెలంగాణ కోసం నిత్యం తపన పడిన కాకా పేరు తెలంగాణ రాష్ట్రంలో దీర్ఘకాలం గుర్తుండిపోయేలా ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. రాజకీయాలకతీతంగా స్పందించే కాకా.. సమాజంలో మార్పు కోసం శ్రీకారం చుట్టిన నేత అని, అజాత శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొనియాడారు.
కాంగ్రెస్ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిందని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి అన్నారు. కాగా, సీఎం కేసీఆర్‌తోపాటు డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, డాక్టర్ రాజయ్య, తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ తదితరులు కాకాకు శ్రద్ధాంజలి ఘటించారు. టీడీపీ నేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, దేవేందర్ గౌడ్, సీపీఎం తెలంగాణ కార్యద ర్శి తమ్మినేని వీరభద్రం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శాసనమండళ్ల అధ్యక్షులు స్వామిగౌడ్, చక్రపాణి తదితరులు కాకాకు శ్రద్ధాంజలి ఘటించిన వారిలో ఉన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సహా పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, అభిమానులు వివేక్ నివాసానికి తరలివచ్చి కాకాకు నివాళులర్పించారు.
‘కాకా’కు కన్నీటి వీడ్కోలు
Published Wed, Dec 24 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement