తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి
సెప్టెంబర్ 9న నిర్వహణకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా పరిగణించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. రాష్ట్రస్థాయిలో, హైదరాబాద్‌లో అధికారికంగా కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తెలంగాణ భాషా చైతన్య కార్యక్రమాలు జరపాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఈ నెల 9న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు, కవితల పోటీలు నిర్వహించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణలో భాష, సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి కాళోజీ స్మారక పురస్కారం అందివ్వనున్నామని తెలిపారు.